Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొద్దిగా లేటుగా పెట్టుకుందాం.. సిరీస్‌పై దక్షిణాఫ్రికాను కోరిన బీసీసీఐ

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది.  సఫారీలతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 సిరీస్‌ల కోసం భారత జట్టు తలపడాల్సి ఉంది. షెడ్యూలు ప్రకారం ఈ నెల 17న తొలి టెస్టు జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ భయంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్న వేళ ఈ సిరీస్‌పై సందిగ్ధత నెలకొంది.


సిరీస్ జరుగుతుందని, పర్యటనకు వచ్చే ఆటగాళ్లకు పూర్తి రక్షణ కల్పిస్తామని క్రికెట్ సౌతాఫ్రికా ఇప్పటికే హామీ ఇచ్చింది. భారత్ కూడా పర్యటనకే మొగ్గు చూపుతోంది. మరోవైపు, భారత-ఎ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో అక్కడే అనధికారిక నాలుగు రోజులు టెస్టులు ఆడుతోంది. ఈ నేపథ్యంలో భారత పర్యటన తథ్యమనే అనుకున్నారు. తామైతే రెడీగానే ఉన్నామని అయితే, ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని బీసీసీఐ ఇప్పటికే సౌతాఫ్రికాకు తెలియజేసింది.


ఇప్పుడు ఒమైక్రాన్ భయాలు మరింత పెరిగిన నేపథ్యంలో సిరీస్‌ను కొంచెం ఆలస్యంగా ప్రారంభిద్దామని క్రికెట్ సౌతాఫ్రికాను బీసీసీఐ కోరుతోంది. ఏ విషయాన్ని తాము ఆదివారం చెబుతామని, అంతవరకు ఆగాలని కోరినట్టు తెలుస్తోంది. పర్యటన ఉంటుందా? ఉండదా? అన్న విషయాన్ని తాము ఆ రోజున తేల్చేస్తామని స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా, ఈ పది మ్యాచ్‌ల పర్యటన విలువ దాదాపు 330 కోట్లు ఉంటుందని అంచనా. 

Advertisement
Advertisement