Abn logo
Nov 26 2021 @ 03:54AM

బీజేపీకి బీ టీం!

  • టీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తిన రైతు నేత టికాయత్‌
  • కేంద్రానికి ఎక్కువగా మద్దతిచ్చేది టీఆర్‌ఎస్‌ పార్టీయే
  • అలాంటిది కేసీఆర్‌ను ఎలా నమ్ముతాం? 
  • ప్రత్యామ్నాయ పంటలపై విధివిధానాలేమిటి? 
  • రైతు ఉద్యమంపై వైఖరిని స్పష్టం చేయాలి
  • బీజేపీకి మద్దతిస్తున్న దున్నపోతును హైదరాబాద్‌లోనే 
  • బంధించాలి.. ఒవైసీపై పరోక్ష విమర్శలు
  • మరణించిన 750 రైతుల కుటుంబాలను ఆదుకోవాలి
  • భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయత్‌


హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి టీఆర్‌ఎస్‌ పార్టీనే ఎక్కువగా మద్దతు ఇస్తోందని.. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసునని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయత్‌ అన్నారు. బీజేపీకి టీఆర్‌ఎస్‌ సహా వైసీపీ, మజ్లిస్‌ పార్టీలు బీ టీమ్‌ అని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అన్ని విధాలా మద్దతు ఇచ్చిన సీఎం కేసీఆర్‌.. సాగు చట్టాలకు వ్యతిరేకమని చెబితే నమ్మలేమని పేర్కొన్నారు. రైతుల ఉద్యమంపై తమ వైఖరిని టీఆర్‌ఎస్‌ పార్టీ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ, రైతులపై నిరంకుశంగా వ్యవహరించిందని, ఆ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ కాదని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆర్‌ఎ్‌సఎస్‌ నడుపుతోందని.. ఆంబానీ, అదానీ ఆదేశాలతో అది పనిచేస్తుందని విమర్శించారు. బీజేపీకి కిసాన్‌ సంయుక్త్‌ మోర్చా మద్దతిచ్చే ప్రసక్తే లేదని.. ఏ పార్టీకీ మద్దతివ్వబోదని, దేశం కోసమే మోర్చా పనిచేస్తుందని స్పష్టం చేశారు. కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని.. రైతు ఉద్యమమే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలను తిప్పికొట్టిందని పేర్కొన్నారు. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ, ఢిల్లీలో రైతుల ఆందోళన చేపట్టి  ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇందిరాపార్కు వద్ద గురువారం, అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ తెలంగాణ శాఖ మహాధర్నా నిర్వహించింది.


 ఈ ఆందోళనలో తికాయత్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ, అనంతరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ శివార్లలో రైతు ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తామని టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ.. తెలంగాణాలో కూడా  మరణించిన రైతు కుటుంబాలకూ పరిహారం ఇవ్వాలని కోరారు. మద్దతు  ధర చ ట్టం కోసం కేంద్రంతో పోరాడుతూ 750 మంది రైతులు మృతిచెందారని, వారి కుటుంబాలను ఆదుకోవడం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు.  దేశంలో రైతులు సాగు చేసే ప్రతి పంటకూ మద్దతు ధర కల్పించాలనేదే తమ ప్రధాన డిమాండ్‌ అని.. ఆమేరకు చట్టం తీసుకురావాలన్నారు. మద్దతు ధరపై ఎక్కడికక్కడ బీజేపీ నేతలను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పాలు, పండ్లు, కూరగాయలు తదితర పంటలకు మద్దతు ధర కోసం పోరాడుతామని చెప్పారు. ఈ నెల 29 నుంచి ప్రతి రోజూ 500 ట్రాక్టర్లతో రైతులు పార్లమెంట్‌కు వస్తారని తెలిపారు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల అమలు, విద్యుత్తు సవరణ బిల్లు ఉపసంహరణకు ఉద్యమిస్తామన్నారు. 


అసద్‌ది ‘విభజన’ వ్యూహం! 

బీజేపీ ఎక్కడ ఓడిపోయే పరిస్థితి ఉంటే అక్కడ మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తన మత విభజన వ్యూహాలతో ఆ పార్టీకి సాయం చేస్తారని తికాయత్‌ విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రయోజనాలను కాపాడేందుకు ఒక దున్నపోతు తిరుగుతున్నదని పరోక్షంగా అసద్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ దాన్ని హైదరాబాద్‌లోనే బంధించాలని పిలుపునిచ్చారు.  

బీజేపీకి ఓటు వేయొద్దు

‘ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దు. బెంగాల్‌ ఎన్నికల్లో మేం ఇదే చెప్పాం. అన్ని రాష్ట్రాల్లోనూ పిలుపునిస్తున్నాం’ అని తికాయత్‌ వ్యాఖ్యానించారు. ఈ కారణగానే మూడు సాగు చట్టాలను రద్దుచేస్తున్నట్లు ప్రధా ని ప్రకటించారని అన్నారు. చట్టాలను రద్దు చేస్తునట్లు ఏక పక్షంగా ప్రకటించారని గుర్తుచేస్తూ రైతు ప్రతినిధులతో చర్చలు జరపడం నేరమా? అని ప్రశ్నించారు.  


పంట మార్పిడిపై స్పష్టత ఏది? 

దేశవ్యాప్తంగా రైతాంగం పండిస్తున్న 23 పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని తికాయత్‌ స్పష్టం చేశారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు  కనీస మద్దతు ధరల చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. పంట మార్పిడి చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని.. అయితే పంట మారితే ఆ మేరకు సబ్సిడీలు, వేసిన పంటలకు మద్దతు ధర ఇప్పిస్తామని ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలన్నారు.  


మోర్చాలో విబేధాలు సృష్టించే ప్రయత్నం

రైతు ఉద్యమ నాయకులను బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నించిందని టికాయత్‌ ఆరోపించారు. సంయుక్త కిసాన్‌ మోర్చాలో కూడా విబేధాలు సృష్టించేందుకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని.. ఎవరెన్ని కుట్రలు రచించినా రైతు ఉద్యమ ఐక్యతను దెబ్బతీయలేరని హెచ్చరించారు. రైతులను ఢిల్లీలోకి ప్రవేశించకుండా మోడీ సర్కారు దారులు మూసివేయడంతో రైతులు అక్కడే కూర్చొని నిరసన తెలిపాల్సి వచ్చిందన్నారు. కాగా మత ఘర్షణలు, మహిళలు, విద్యార్థులపై దాడులకు నిరసనగా ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా రైతాంగ ఉద్యమం జరుగుతుందని ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి అతుల్‌ కుమార్‌ అంజన్‌ తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ రైతు వ్యతిరేకిగా అభివర్ణించారు. 

క్రైమ్ మరిన్ని...