హైదరాబాద్‌ మాజీ ఫుట్‌బాలర్‌ బహదూర్‌ మృతి

ABN , First Publish Date - 2020-05-31T09:01:44+05:30 IST

1960-70వ దశకంలో విధ్వంసకర స్ట్రయికర్‌గా ఖ్యాతి గడించిన మాజీ సాకర్‌ ఆటగాడు బీర్‌ బహదూర్‌ (75) అనారోగ్యంతో ...

హైదరాబాద్‌ మాజీ ఫుట్‌బాలర్‌ బహదూర్‌ మృతి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): 1960-70వ దశకంలో విధ్వంసకర స్ట్రయికర్‌గా ఖ్యాతి గడించిన మాజీ సాకర్‌ ఆటగాడు బీర్‌ బహదూర్‌ (75) అనారోగ్యంతో శనివారం తుదిశ్వాస విడిచారు. హైబీపీ, డయాబెటీ్‌సతో దీర్ఘకాలంగా బాధపడుతున్న బహదూర్‌ గత నెల 10వ తేదీన కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతను శనివారం సాయంత్రం మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. సికింద్రాబాద్‌ ‘ఈఎంఈ’ సెంటర్‌ క్లబ్‌కు చాలాకాలం ప్రాతినిథ్యం వహించిన ఈ హైదరాబాదీ స్టార్‌.. 1966లో బ్యాంకాక్‌లో జరిగిన 5వ ఆసియా క్రీడల్లో భారత జట్టు తరఫున ఆడాడు. ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాక కొంతకాలం కోచ్‌గా పనిచేసిన బహదూర్‌ ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో బొల్లారంలో రోడ్డు పక్కన పానీపూరి కూడా విక్రయించాడు. అప్పట్లో బహదూర్‌ దుస్థితి తెలిసి సికింద్రాబాద్‌ ఈఎంఈ సెంటర్‌లో క్యాంటీన్‌ నిర్వహించేందుకు ఆర్మీ అధికారులు అనుమతిచ్చారు. బహదూర్‌ కోమాలోకి వెళ్లాక వైద్యం చేయించడానికి కూడా కుటుంబసభ్యులు ఇబ్బంది పడుతుంటే ఈఎంఈ ఆర్మీ అధికారులు రూ. 60 వేలు ఆర్థిక సాయం చేశారు. భారత ఫుట్‌బాల్‌ జట్టుకు ఎన్నో మధురమైన విజయాలు అందించిన బహదూర్‌ మరణం సాకర్‌ అభిమానులను కలిచి వేసిందని తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు మహ్మద్‌ రఫత్‌ అలీ, కార్యదర్శి ఫాల్గుణ సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-05-31T09:01:44+05:30 IST