Abn logo
Mar 26 2020 @ 02:27AM

అప్రమత్తతే జీవన సార్థకత

  • రాత్‌ గవాఁయే సోయికే, దివస్‌ గవాఁయీ ఖాయ్‌
  • హీరా జనమ్‌ అన్‌మోల్‌హై, కౌడీ బద్దే జాయ్‌

‘‘రాత్రంతా కమ్మటి నిద్రను ఆస్వాదిస్తూ, దినమంతా రుచికర భోజనం భుజిస్తూ, మనిషి మరో ఆలోచనేది లేకుండా సోమరిగా కాలాన్ని వృథా చేస్తున్నాడు కానీ జీవితానికున్న విలువ తెలుసుకొని అందుకు తగినట్టు మసలుకోలేకపోతున్నాడు’’ అంటాడు మహాత్మా కబీరు. జాగ్రత్తలు పాటిస్తూ ప్రవర్తించినప్పుడే మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోగలడనేది ఆయన అభిప్రాయం. మన వేదపురాణేతిహాసాలన్నీ మానవుని సన్మార్గాన నడిపిస్తూ అర్థవంతమైన జీవితం గడపడం కోసమే నిర్దేశింపబడ్డాయి. ఐతరేయ బ్రాహ్మణంలో ‘‘చరైవేతి.. చరైవేతి’’ అనే జీవన మంత్రం చెప్పబడింది. దాని అంతరార్థం ఏమిటంటే... అలసట లేకుండా, ఎక్కడా ఆగకుండా అప్రమత్తతతో నిరంతరం ముందుకు సాగుతూ పోతుండాలి.


బద్ధకం మనిషిని బలహీనపరచడమే కాకుండా సోమరితనం ఆవహింపజేసి జీవన సత్యాలకు దూరం చేస్తుంది. మహాభారత యుద్ధంలో అస్త్రసన్యాసం చేసి మనోవ్యాకులతకు గురైన అర్జునుని దగ్గరకు వెళ్లిన కృష్ణ పరమాత్మ, పాండవ మధ్యముడు చెప్పినవన్నీ విని ‘‘ఉత్తిష్ఠ కౌంతేయ’’ అంటాడు అర్థవంతంగా. భగవంతుని మాటల్లో ప్రతిధ్వనించిన భావం- అర్జునుడు బంధుప్రీతిలో కూరుకుపోయి, తన కర్తవ్యమేమిటో తెలుసుకోలేని మాయలో కమ్ముకుపోయి జీవితానికున్న అర్థాన్ని, విలువల్ని మరిచిపోయాడు అనుకుని అర్జునుణ్ని లేచి యుద్ధానికి సిద్ధం కావాలని అంటాడు. స్వామి వివేకానందుడు కూడా ’’లేవండి! మేల్కొండి!! అని యువతకు పిలుపునిచ్చారు. ‘‘యువతీయువకులు, యుక్తవయసు మత్తు నుంచి మేల్కొని సోమరితనం, నిరాశవాదం, పలాయన వాదం వంటి జాడ్యాలను దూరం చేసుకొని ముందుకు సాగిపోతున్నప్పుడే లక్ష్యాలు నెరవేరి, జీవితం ఫలవంతమవుతుంది.’’ అన్నది ఆయన మాటల్లోని అర్థం. ‘‘మానవ జీవితం క్షణ భంగురం, నీటి బుడగ,  ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మనిషి జీవితంలో బాల్యం, యవ్వనం, కౌమారం, వార్థక్యం చాలా వేగంగా వచ్చిపడిపోతాయి. చేయాలనుకున్న పనుల్ని తరువాత చేద్దాం అనుకొని వాయిదా వేయడం అజ్ఞానం. ముసలితనం, వ్యాధులు, విపత్తులు, మరణం ఈ నాలుగూ పెద్ద ప్రమాదాలు. వీటిపట్ల తగు జాగ్రత్త వహించాలి. జీవితంలో ఏమీ సాధించకుండా ఈ భూమ్మీద నుండి వెళ్లిపోతే పశువులతో సమానమే! జీవితాన్ని, జీవిత కాలాన్ని వ్యర్థం చేసుకొని కాలగర్భంలో కలసిపోతే మన పుట్టుకకు అర్థమే ఉండదు. అందుకే అప్రమత్తంగా ఉంటూ అందుకు తగ్గట్టు ప్రవర్తిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.’’ అని గౌతమ బుద్ధుడు బోధించాడు. మనం కూడా ఆ మహనీయుల బోధనలను అర్థం చేసుకొని, సోమరితనం వీడి, అప్రమత్తతతో మెలుగుతూ, జీవితం విలువ తెలుసుకుని తరిద్దాం. 

- పరికిపండ్ల సారంగపాణి, 98496 30290


Advertisement
Advertisement
Advertisement