అదే సర్వజ్ఞానం!

ABN , First Publish Date - 2020-08-14T05:30:00+05:30 IST

దేహం దేవాలయం లాంటిదైతే మన అంతశ్చేతన ఒక గ్రంథాలయం లాంటిది. గ్రంథాలయంలో వేల కొద్దీ పుస్తకాలు ఉంటాయి. గ్రంథపాలకుడు అంటే లైబ్రేరియన్‌ వాటన్నిటినీ సంరక్షిస్తూ ఉంటాడు...

అదే సర్వజ్ఞానం!

దేహం దేవాలయం లాంటిదైతే మన అంతశ్చేతన ఒక గ్రంథాలయం లాంటిది. గ్రంథాలయంలో వేల కొద్దీ పుస్తకాలు ఉంటాయి. గ్రంథపాలకుడు అంటే లైబ్రేరియన్‌ వాటన్నిటినీ సంరక్షిస్తూ ఉంటాడు. అయితే అతను ప్రతి పుస్తకాన్నీ చదవవలసిన అవసరం, పూర్తిగా తెలుసుకోవలసిన అగత్యం లేదు. కానీ, ఏది ఎక్కడుందో అతనికి తెలిసి ఉండాలి. కావలసినప్పుడు దాన్ని తీసి, ఉపయోగించుకొనేలా ఉండాలి. అదే విధంగా, మన అంతశ్చేతన సమస్త జ్ఞానానికీ నిలయం. మనకు అన్ని సమయాల్లో, అన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఒక భౌతిక శరీరంలో ఉండి, ప్రతిదాన్నీ తెలుసుకోవడం అనేది సాధ్యం కూడా కాదు. అయితే, శారీరకంగా నిశ్చలంగా ఉన్నప్పుడు, మన ఆలోచనలు పూర్తి స్థిరంగా ఉన్నప్పుడూ తీవ్ర వాంఛలూ, అనిష్టాలూ ఉండవు. మెదడు స్వేచ్ఛా స్థితి పొందుతుంది. అప్పుడు మీరు లైబ్రేరియన్‌లా ఉంటారు. అంటే జ్ఞానమంతా మీతోనే ఉంటుంది.  మీకు అవసరమైనప్పుడు దాన్ని మీరు పొందవచ్చు. ఒక న్యాయవాది దగ్గర ఎన్నో పుస్తకాలు ఉంటాయి. అతను అన్ని పుస్తకాల్లోనూ, ప్రతి అక్షరాన్నీ నేర్చుకోలేడు. అన్నివేళలా వాటిని గుర్తు పెట్టుకోనూ లేడు. కానీ అతని దగ్గరకు ఒక విధమైన కేసు వచ్చినప్పుడు, ఏ పుస్తకం తీసుకోవాలో, దేన్ని ఉపయోగించుకోవాలో అతనికి తెలుసు. అది గుర్తుంచుకోవాలి. మీరు నిశ్చలంగా ఉండి, మానసికమైన ప్రకంపనల నుంచీ స్వేచ్ఛ పొందితే... అప్పుడు మీరు ఒక యోగిగా మారుతారు! అప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం తెలుస్తుంది. అందుకనే నిశ్చలమైన చేతననూ, యోగపరమైన చేతననూ ‘సర్వజ్ఞానం’ అని అంటారు. అలాంటి సమాధి స్థితికి చేరినవారి చేతనలో సర్వజ్ఞానానికి సంబంధించిన బీజం ఆవిష్కృతమవుతుంది.




సర్వ జ్ఞానానికీ నిలయం చేతన. మీరు నిశ్చలంగా ఉండి, మానసికమైన ప్రకంపనల నుంచీ స్వేచ్ఛ పొందితే... అప్పుడు మీరు ఒక యోగిగా మారుతారు!

- శ్రీ శ్రీ రవి శంకర్‌

(ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు)


Updated Date - 2020-08-14T05:30:00+05:30 IST