బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు : ఇప్పుడిప్పుడే వెలుగులోకి ఆసక్తికర విషయాలు!

ABN , First Publish Date - 2021-01-17T08:13:52+05:30 IST

మాజీమంత్రి భూమా అఖిలప్రియ కుటుంబం చిక్కుకున్న కిడ్నాప్‌ కేసులో మరిన్ని ఆసక్తికర విషయాలు..

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు : ఇప్పుడిప్పుడే వెలుగులోకి ఆసక్తికర విషయాలు!

‘బోయిన్‌పల్లి’కి బెజవాడ లింకు!

విజయవాడలో పలు జిమ్‌లకు ట్రైనర్‌

ప్రముఖుల కోరికపై బౌన్సర్లు సరఫరా 

అక్కడే అఖిల భర్త భార్గవ్‌రామ్‌తో పరిచయం

కిడ్నా్‌పకు ప్లాన్‌ చేయగానే సిద్ధార్థకు కబురు

బెజవాడ నుంచి నలుగురు హైదరాబాద్‌కు..

కిడ్నాప్‌ ఫెయిల్‌.. గోవాలో దొరికిన సిద్ధార్థ!


అమరావతి, విజయవాడ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి భూమా అఖిలప్రియ కుటుంబం చిక్కుకున్న కిడ్నాప్‌ కేసులో మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కిడ్నాప్‌ కోసం మనుషులను సరఫరాచేసిన మద్దాల బసవ సిద్ధార్థ అనే వ్యక్తిని గోవాలో పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ వ్యక్తి స్వస్థలం కృష్ణాజిల్లా కావడంతో బోయిన్‌పల్లి కిడ్నాప్‌ లింకు బెజవాడనూ తాకింది. బోయిన్‌పల్లిలో ఈనెల ఐదోతేదీన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌ కుమార్‌ సోదరుల కిడ్నా్‌పకు జరిగిన ప్రయత్నం విఫలమైన విషయం తెలిసిందే. దీనికోసం పక్కా ప్రణాళికను గుంటూరు శ్రీను అనే వ్యక్తి రూపొందించినట్టు ఇప్పటికే తెలంగాణ పోలీసులు గుర్తించారు. అయితే, శ్రీను వేసిన స్కెచ్‌కు తగినట్టు బౌన్సర్లను సిద్ధార్థ సమకూర్చాడని కొత్తగా వెలుగులోకి వచ్చింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఇతడు తాజాగా గోవాలో దొరికాడు. ఈ క్రమంలో సిద్ధార్థ కూపి లాగేందుకు తెలంగాణ పోలీసులు ఏపీకి వచ్చారు. కృష్ణాజిల్లాలోని కొండపల్లి, విజయవాడ ప్రాంతాల్లో లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త అంశాలు తెరపైకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం, సిద్ధార్థది కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం రాముడుపాలెం. ఐదేళ్ల క్రితం సొంత గ్రామాన్ని వదిలేసి విజయవాడకు వచ్చి ఒక ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలో గార్డ్‌గా చేరాడు. గార్డు పని చేస్తూనే, విజయవాడలోని వివిధ జిమ్ముల్లో ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే మాజీమంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌తో విజయవాడలోనే పరిచయం అయింది. ఇక్కడి పీవీపీ మాల్‌ సమీపంలోనే ఉండే భార్గవ్‌రామ్‌.. అక్కడున్న ఒక ప్రముఖ జిమ్‌కు నిత్యం వెళ్లేవాడు.


అక్కడే సిద్ధార్థ ట్రైనర్‌గా పనిచేసేవాడు. భార్గవ్‌రామ్‌ అఖిలప్రియ భర్త అన్న విషయం తెలుసుకుని సిద్ధార్థ.. అతనితో పరిచయం పెంచుకున్నాడు. ఇలా జిమ్ములకు వచ్చే ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని వారికి బౌన్సర్లను సరఫరా చేస్తుండేవాడు. బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌కుమార్‌ సోదరులను కిడ్నాప్‌ చేయడానికి హైదరాబాద్‌లో ప్లాన్‌ చేయగానే, సిద్ధార్థను భార్గవ్‌రామ్‌ సంప్రదించారు. బలిష్ఠంగా ఉండే నలుగురు మనుషులు కావాలని కోరగా, వారిని కిడ్నాప్‌ జరగడానికి ముందురోజు హైదరాబాద్‌కు సిద్ధార్థ పంపించాడు. 


ఎలా దొరికాడు?

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విజయవాడకు వచ్చారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో ఉన్న వైసీపీ నాయకుడు దేవరకొండ వెంకటేశ్వరరావు కొడుకులు సాయి, వంశీలను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఈ ఇద్దరూ కిడ్నాపర్లుగా వ్యవహరించినట్టు సమాచారం.


వీరిని విచారించగా మద్దాల సిద్ధార్థ పేరు తొలిసారి తెరపైకి వచ్చింది. వారిచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు సిద్ధార్థ ఆట కట్టించారు. పోలీసుల కథనం ప్రకారం, సిద్ధార్థ విజయవాడలో ఉంటూనే తన స్వగ్రామంలో అనేక దారుణాలకు వడిగట్టాడు. ఒక రైతు నుంచి రెండు ఎకరాల పొలాన్ని అక్రమంగా రాయించుకున్నాడు. దీనిపై అప్పట్లో ఆ రైతు చల్లపల్లి పోలీసులను ఆశ్రయించినప్పటికీ న్యాయం జరగలేదు. తాజాగా బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో బౌన్సర్లను సరఫరా చేసి భారీగా డబ్బు వెనకేసుకోవాలని ఆశపడ్డాడు. చివరకు వ్యవహారం బెడిసికొట్టడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల చేతుల్లో పడ్డాడు.

Updated Date - 2021-01-17T08:13:52+05:30 IST