ఏపీలో మళ్లీ బెల్టు షాపులు!

ABN , First Publish Date - 2021-04-13T09:15:48+05:30 IST

నిత్యం ఆర్థిక లోటుతో కుంటుతున్న ప్రభుత్వం మద్యంపై వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. పైపెచ్చు దాని ద్వారా మరింత ఆదాయాన్ని

ఏపీలో మళ్లీ బెల్టు షాపులు!

  • అనధికారిక అనుమతి వచ్చిందంటూ ప్రచారం
  • ఇప్పటికే పలు గ్రామాల్లో వెలసిన షాపులు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

నిత్యం ఆర్థిక లోటుతో కుంటుతున్న ప్రభుత్వం మద్యంపై వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. పైపెచ్చు దాని ద్వారా మరింత ఆదాయాన్ని ఆర్జించాలన్న భావనతో ఉంది. అందుకనే టీడీపీ హయాంలో మాయపోయిన బెల్టు షాపులు మళ్లీ తెరమీదకు వస్తున్నా యి. ‘‘దీనికి వైసీపీ ప్రభుత్వ పెద్దల నుంచి అనధికారిక అనుమతి లభించింది. పూర్వం తరహాలోనే బెల్టులను ఏర్పాటు చేసుకోవచ్చు’’ అన్న ప్రచారం గత పది రోజులుగా ఊపందుకుంది. గ్రామీణ ప్రాంతా ల్లో పలుచోట్ల ఈ బెల్టులు కొత్తగా వెలుస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి రాకముందు ఈ బెల్టు షాపులు ఉండేవి.


అయితే చంద్రబాబు ప్రభుత్వం వాటిపై ఉక్కుపాదం మోపింది. దీనితో కనుమరుగైన బెల్టు ల స్థానంలో మొబైల్‌ బెల్టు షాపులు వచ్చాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మద్య నిషేధం అంటూ ఊదరగొట్టినా మొబైల్‌ బెల్టుల జోలికి వెళ్ళలేదు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సగటున 10 వరకు మొబైల్‌ బెల్టులున్నాయి. గతంలో గ్రామంలోని ఒకట్రెండు వ్యవస్థీకృత బెల్టులు అమ్మినంత సరుకును అటుఇటుగా ఈ పది మొబైల్‌ బెల్టులు అమ్ముతున్నాయి. తాజా ప్రచారంతో మళ్లీ బెల్టు షాపులు వెలుస్తున్నాయి. అయితే వాటిని గతంలోలా ఇష్టానుసారం పెట్టుకోవడానికి వీలులేదు. స్థానిక నేతల అనుమతి తప్పనిసరి. బెల్టులకు కావాల్సిన సరుకు పంపాలని షాపులకు కూడా అనధికారిక ఆదేశాలు వెళ్తున్నాయి. అయితే ఈ ఆదేశాలు ఎక్సైజ్‌ నుంచా? అధికార పార్టీ నాయకుల నుంచా? అన్నదానిపై స్పష్టత లేదు.


రాష్ట్రంలో ఒకరికి గరిష్ఠంగా మూడు సీసాలే అమ్మాలనే నిబంధన ఉన్నప్పటికీ బెల్టులకు కావాల్సినంత సరుకు ఇస్తున్నారు. ఇందుకోసం క్వార్టర్‌ సీసాపై రూ.10 నుంచి రూ.20 షాపుల్లోని సిబ్బందికి అదనంగా చెల్లించాలనే నిబంధన పెట్టినట్లు తెలిసింది. ఆ నగదు సిబ్బందితో పాటు స్థానిక నాయకులకు చేరుతోందని బెల్టు నిర్వాహకులు అంటున్నారు. షాపులోనే దాదాపు రూ.20 చెల్లించాల్సి రావడంతో అందుకు మరో రూ.30 అదనంగా కలిపి సీసాపై రూ.50 తీసుకుని బెల్టుల్లో అమ్ముతున్నారు. గతంలో 4300 మద్యం దుకాణాలు ఉంటే మద్య నిషేధం పేరుతో వైసీపీ ప్రభుత్వం వాటిని 2900కి తగ్గించింది. దీనితో సగటున ఐదారు గ్రామాలకు ఒక్కటే మద్యం షాపు ఉంది. అందులోనూ ఎక్కువ షాపులు మండల కేంద్రాల్లోనే ఉంటున్నాయి. దీంతో ధర ఎక్కువైనా మందు ప్రియులు తాజాగా వెలుస్తున్న బెల్టు షాపులవైపు చూస్తున్నారు.

Updated Date - 2021-04-13T09:15:48+05:30 IST