రాణించిన స్మిత్.. బెంగళూరు విజయ లక్ష్యం 178 పరుగులు

ABN , First Publish Date - 2020-10-17T23:02:18+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది

రాణించిన స్మిత్.. బెంగళూరు విజయ లక్ష్యం 178 పరుగులు

దుబాయ్: ఐపీఎల్‌లో భాగంగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఈసారి వ్యూహాత్మకంగా రాబిన్ ఉతప్పను ఓపెనర్‌గా పంపింది. క్రీజులోకి వచ్చిన ఉతప్ప చెలరేగిపోయాడు. తనను ఓపెనర్‌గా పంపడం సరైన నిర్ణయమేనని నిరూపించాడు. 22 బంతుల్లోనే 7 ఫోర్లు, సిక్సర్‌తో 41 పరుగులు చేశాడు. 15 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ క్రిస్‌మోరిస్ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు దొరికిపోయాడు. దీంతో 50 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.


8వ ఓవర్‌ వేసిన చాహల్ రెండు వరుస బంతుల్లో ఉతప్ప, సంజు శాంసన్ (9)లను పెవిలియన్ పంపాడు. దీంతో పరుగుల ప్రవాహం ఒక్కసారిగా నెమ్మదించింది. అయితే, క్రీజులో కుదురుకున్న కెప్టెన్ స్టీవ్ స్మిత్ జోరు పెంచడంతో స్కోరు వేగం పెరిగింది. అతడికి జోస్ బట్లర్ తోడవడంతో ఊపు వచ్చింది. 24 పరుగులు చేసిన బట్లర్, మోరిస్ బౌలింగులో అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన తెవాటియా బ్యాట్ ఝళిపించే ప్రయత్నం చేసినా పరుగులు పిండుకోవడంలో విఫలమయ్యాడు. 


బెంగళూరు బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు పరుగులు రావడం కష్టమైంది. అయితే, స్మిత్ మాత్రం అడపా దడపా బంతులను బౌండరీలకు తరలించడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. 36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 57 పరుగులు చేసిన స్మిత్ కూడా మోరిస్‌కే వికెట్ సమర్పించుకున్నాడు. 11 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 19 పరుగులు చేసిన తెవాటియా నాటౌట్‌గా మిగిలాడు. అర్చర్ 2 పరుగులు చేసి అవుటయ్యాడు. 

Updated Date - 2020-10-17T23:02:18+05:30 IST