ఏప్రిల్‌ 13 నుంచి భద్రాద్రి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-01-25T05:30:00+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఏప్రిల్‌ 13 నుంచి 27 వరకు వసంతపక్ష తిరుకల్యాణ (శ్రీరామనవమి) బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు

ఏప్రిల్‌ 13 నుంచి భద్రాద్రి బ్రహ్మోత్సవాలు
భద్రాద్రి సీతారాముల కల్యాణం (ఫైల్‌)

27వరకు నిర్వహణ.. 21న శ్రీరామనవమి, 22న మహాపట్టాభిషేకం

ప్రభుత్వ ఆమోదం కోసం వైదిక కమిటీ నివేదిక

భద్రాచలం, జనవరి 25 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఏప్రిల్‌ 13 నుంచి 27 వరకు  వసంతపక్ష తిరుకల్యాణ (శ్రీరామనవమి) బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. 15రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి రోజున ఫ్లవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి సందర్భంగా ఉదయం వేపపూత ప్రసాద వినియోగం, శ్రీ సీతారామచంద్రస్వామి మూలవరులకు పంచామృతాభిషేకం నిర్వహించనున్నారు.  నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 17న మృత్స్యంగ్రహణం, వాసుహోమం,  అంకురారోపణంతో ప్రారంభమై 18న గరుఢ పట లేఖనం, 19న ధ్వజారోహణం, 20న ఎదుర్కోలు, 21న శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం, 22న శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. అలాగే 23న సదస్యం, 24న తెప్పోత్సవం, దొంగలదోపోత్సవం, 25న ఊంజల్‌ సేవ, 26న వసంతోత్సవం, 27న చక్రతీర్థ, పూర్ణాహుతి, ద్వాదశ ప్రదక్షణలు, ధ్వజావరోహణం, ద్వాదశ ఆరాధనలు, శేష వాహన సేవ, శ్రీపుష్పయాగంతో ఉత్సవ సమాప్తి కానుంది. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాల సమయంలో నిత్యకల్యాణాలను నిలిపివేయనున్నారు. 

ప్రభుత్వ ఆమోదం కోసం నివేదిక

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన నివేదికను వైదిక కమిటీ రూపొందించి ఇటీవల భద్రాద్రి దేవస్థానం ఈవో బి.శివాజీకి సమర్పించింది. దీంతో ఆయన ఆ నివేదికను ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌కు పంపారు. ఇదిలా ఉండగా గతేడాది కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గనిర్దేశాలకు అనుగుణంగా రామయ్య కల్యాణం, ఇతర ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహించారు. అయితే ఈసారి కరోనా వ్యాప్తి గతంతో పోలిస్తే తగ్గినందున మిథిలా స్టేడియంలోనే నిర్వహించాలనే యోచనలో దేవస్థానం వర్గాలున్నట్టు తెలుస్తోంది. దీనిపై స్పష్టతివ్వాలని దేవస్థానం అధికారులు  ప్రభుత్వాన్ని కూడా కోరినట్టు సమాచారం. అయితే ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో  స్పష్టత వచ్చి మార్గదర్శకాలు విడుదలైన తర్వాతే దేవస్థానం అధికారికంగా బ్రహ్మోత్సవాల సమాచారాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 


Updated Date - 2021-01-25T05:30:00+05:30 IST