ప్రతీ పనికి ఓ రేటు

ABN , First Publish Date - 2020-05-22T10:31:25+05:30 IST

తీగ లాగితే డొంక కదిలినట్లు నకిలీ బ్లీచింగ్‌ పౌడర్‌ వ్యవహారంపై విచారణతో భద్రాద్రి జిల్లా పంచాయతీ కార్యాలయంలో అవినీతి డొంక

ప్రతీ పనికి ఓ రేటు

అవినీతి నిలయంగా భద్రాద్రి డీపీవో కార్యాలయం 

ట్రాక్టర్ల కొనుగోళ్లలోనూ అక్రమాలు 

ఉన్నతాధికారిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు


కొత్తగూడెం కలెక్టరేట్‌, మే 21: తీగ లాగితే డొంక  కదిలినట్లు నకిలీ బ్లీచింగ్‌ పౌడర్‌ వ్యవహారంపై  విచారణతో భద్రాద్రి జిల్లా పంచాయతీ కార్యాలయంలో అవినీతి డొంక కదులుతోంది. ఈ కార్యాలయంలో ‘ప్రతీ పనికి ఓ రేటు’ చందాన జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత  ఎన్నికల దగ్గర నుంచి పంచాయతీల్లో అనుమతి లేని అపార్టుమెంట్లు, బహుళఅంతస్థుల భవనాలు, అక్రమ లేఅవుట్లు, ఇంటినెంబర్ల కేటాయింపు తదితర పనుల్లో పైసా ప్రమేయం లేకుండా ఫైలు ముందుకు కదల్లేదన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో పంచాయతీలకు ట్రాక్టర్ల పంపీణీలోనూ భారీ కుంభకోణం జరిగినట్టు తెలుస్తోంది. ముందుగా ట్రాక్టర్లు చూపకుండా, తమకు చెప్పకుండా అధికారులకు ఇష్టం వచ్చిన ట్రాక్టర్లు పంపిణీ చేశారని అప్పట్లో ఆరోపణలు వెలువడ్డాయి.


ప్రతీ ట్రాక్టర్‌కు డీలర్‌ నుంచి రూ.20వేల నుంచి రూ.40వేలు జిల్లా ఉన్నతాధికారికి అందినట్లు ఆరోపణలున్నాయి. ట్రాక్టర్‌కు సరఫరా చేసిన తొట్లలోనూ పెద్దమొత్తంలో అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. పాల్వంచ కేంద్రంగానే అది జరిగినట్లు సమాచారం తొట్టికి ఉండాల్సిన గేజ్‌ కంటే తక్కువ గేజ్‌తో తొట్లు చేయించారని, అవి ఇప్పటికే తుప్పు పట్టి పాడవుతున్నట్లు జరుగుతోందని తెలుస్తోంది. కొత్తగూడెలోనిఇ విద్యానగర్‌ కాలనీ నూరుశాతం గిరిజన ప్రాంతం.. జిల్లా పంచాయితీ కార్యాలయం కూడా అక్కడే ఉంది. కానీ ఆ ప్రాంతంలో ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటి అనుమతుల్లోనూ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. రజత్‌కుమార్‌ శైనీ కలెక్టర్‌గా ఉన్న సమయంలో అక్రమంగా నిర్మిస్తున్న సెల్లార్‌ నిర్మాణాన్ని నిలిపివేసి అందుకు బాధ్యులైన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేశారు.


అప్పట్లోనే  జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో నిర్మిస్తున్న భవనాలపై నివేదిక సమర్పించాలని డీపీవో ఆశాలతను ఆదేశించారు. ఆయన బదిలీ కావడంతో ఆ ఆదేశాలు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం పంచాయతీల్లో ఏ పని జరిగినా తనకు తెలియకుండా జరగడానికి వీల్లేదని హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన మాట వినని సర్పంచులను కలెక్టర్‌ పేరుతో బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్‌.. డీపీవో కార్యాలయ పనితీరుపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే అవినీతి బాగోతం వెలుగులోకి వస్తుందని కొందరు ప్రజాప్రతినిధులు, సర్పంచులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2020-05-22T10:31:25+05:30 IST