వేతనాభరితం..భద్రాద్రి ఆలయ సిబ్బందిని వీడని వేతన కష్టాలు

ABN , First Publish Date - 2020-08-14T10:04:38+05:30 IST

భద్రాచ లంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పని చేస్తున్న సిబ్బందికి నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు

వేతనాభరితం..భద్రాద్రి ఆలయ సిబ్బందిని వీడని వేతన కష్టాలు

ఏడు నెలలుగా నిలిచిపోయిన చెల్లింపులు

తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న హౌస్‌కీపింగ్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది

పూర్తిస్థాయి వేతనాలివ్వాలంటే తక్షణం రూ.3కోట్లు కావాల్సిందే 


భద్రాచలం, ఆగస్టు 13: భద్రాచ లంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పని చేస్తున్న సిబ్బందికి నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిరు ఉద్యోగులైన హౌస్‌కీపింగ్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది పరిస్థితి దయనీయంగా ఉంది. దేవస్థానంలో పని చేసే 62 మంది హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది గత ఏడు నెలలుగా జీతాలకు నోచుకోలేదు. అలాగే అవుట్‌సోర్సింగ్‌లో పని చేస్తున్న వంద మందికి ఐదు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. ఇక రెగ్యులర్‌గా పని చేసే ఉద్యోగులు 89మంది ఉండగా వారికి రెండు నెలల జీతం చెల్లించలేదు. దేవస్థానంలో ప్రతి నెల జీతాలు చెల్లించాలంటే రూ.కోటి వరకు కావాల్సి ఉంటుందని దేవస్థానం అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కరోనా ప్రబలుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తొలి మూడు నెలలు లాక్‌డౌన్‌ విధించడంతో ఆలయానికి ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. అనంతరం ఆలయాల్లో భక్తులకు దర్శనాలకు అనుమతించినా కరోనా భయంతో భక్తుల రాక అత్యంత కనిష్టస్థాయికి పడిపోయింది. ప్రస్తుతం జీతాలు చెల్లించాలంటే దేవస్థానానికి రూ.3కోట్లు తక్షణ అవసరం ఉంటుందని దేవస్థానం అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


భద్రాద్రి దేవస్థానం వద్ద మాత్రం ప్రస్తుతం రూ.55లక్షలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. దీంతో జీతాల రూపేణా చెల్లించాల్సిన రూ.3కోట్లలో ఇంకా రూ.2.50 కోట్లు దేవస్థానానికి కావాల్సి ఉంటుంది. అదేవిధంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు నెలల తరబడి పెండింగులో ఉండటంతో సంబంధిత కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపులపై దేవస్థానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో తమ జీతాల చెల్లింపునకే డబ్బులు లేని పరిస్థితిని దేవస్థానం అధికారులు వారికి వివరించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో దేవస్థానంలో పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా వేతనాలు, ఇతరత్రా బిల్లుల చెల్లింపు కోసం దేవస్థానం ఆధ్వర్యంలో బ్యాంకులో ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేసిన రూ.6కోట్లను ఉపసంహరించేందుకు అనుమతించాలని దేవస్థానం అధికారులు దేవాదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాయగా ఇందుకు సంబంధించి ఎటువంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వేతనాల జీతాల చెల్లింపుల గండం  ఎలా గట్టెక్కాలనే దానిపై దేవస్థానం అధికారులు తర్జనభరజన పడుతున్నారు.

Updated Date - 2020-08-14T10:04:38+05:30 IST