‘భారత్‌’ గర్జించే.. ‘భారత్‌’ గర్వించే!!

ABN , First Publish Date - 2022-01-26T09:13:58+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్ల అభివృద్ధి గురించి వరుస ప్రకటనలు చేస్తున్న అమెరికా, బ్రిటన్‌ల వైపు యావత్‌ ప్రపంచం చూస్తున్న తరుణంలో..

‘భారత్‌’ గర్జించే.. ‘భారత్‌’ గర్వించే!!

  • స్వదేశీ కొవిడ్‌ టీకా ‘కొవ్యాక్సిన్‌’ ఆవిష్కరణ..
  • భారత్‌ బయోటెక్‌ సారథులు డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలకు  పద్మభూషణ్‌


కొవిడ్‌ వ్యాక్సిన్ల అభివృద్ధి గురించి వరుస ప్రకటనలు చేస్తున్న అమెరికా, బ్రిటన్‌ల వైపు యావత్‌ ప్రపంచం చూస్తున్న తరుణంలో.. నేనుసైతం అంటూ భారత్‌ గర్జించింది. కరోనాపై కదనానికి ఓ అస్త్రాన్ని సంధించింది. ఆ అచ్చమైన స్వదేశీ అస్త్రమే కొవ్యాక్సిన్‌. అతి తక్కువ కాల వ్యవధిలో దాన్ని తయారుచేసిన హైదరాబాదీ కంపెనీ ‘భారత్‌ బయోటెక్‌’. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) సంయుక్త భాగస్వామ్యంలో కొవ్యాక్సిన్‌ను అభివృద్ధిచేసింది. ఔషధ తయారీ రంగంలో అభివృద్ధిచెందిన దేశాలకూ భారత్‌ తీసిపోదని చాటిచెప్పింది. కోట్లాది మంది ప్రాణాలు నిలిపిన ఈ ఆవిష్కరణకు గుర్తింపుగానే భారత్‌ బయోటెక్‌ సారథులైన డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలను దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో మూడోదైన పద్మభూషణ్‌ వరించింది. ‘‘మార్కెట్లో ఆధిపత్యం కోసం నిరంతరం పోరాడే పోటీ శక్తిగా కాకుండా.. దీర్ఘకాలంగా వివిధ ప్రాంతాల్లో నిర్లక్ష్యం చేసిన వ్యాధులపై పోరాడే శక్తిగానే మేం ఉండాలనుకుంటున్నాం’’ అనే కంపెనీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) కృష్ణ ఎల్లా మాటలే వారిలోని పోరాటపటిమకు అద్దం పడుతుంది. 


ఈ పోరాట పటిమే కృష్ణ ఎల్లా, కంపెనీ సహ వ్యవస్థాపకురాలు,  జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్లా ఇద్దరినీ పద్మభూషణ్‌కు అర్హులను చేసింది. వృత్తిరీత్యా వైద్యుడైన డాక్టర్‌ కృష్ణ ఎల్లా తన భార్య సుచిత్రతో కలిసి అమెరికా నుంచి తిరిగివచ్చి 1996 సంవత్సరంలో హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ను స్థాపించారు. అప్పటి నుంచి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధుల నిర్మూలనకు వ్యాక్సిన్లు తయారుచేయడంపైనే ఆయన దృష్టి సారించారు. డాక్టర్‌ కృష్ణ, సుచిత్ర సారథ్యంలో కంపెనీ హెపటైటి్‌స-బి, రొటా వైరస్‌, టైఫాయిడ్‌ వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు... చికున్‌గున్యా, జైకా వంటి వైరల్‌ వ్యాధులకు కూడా టీకాలు కనుగొంది. 123కుపైగా దేశాల ప్రజలను వ్యాధుల బారి నుంచి కాపాడి ఆరోగ్యవంతంగా జీవనం సాగించగల శక్తిని అందించింది. కంపెనీ ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలకు 300కోట్లకుపైగా వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేసింది. ఇటీవలే పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌ బయోటెక్‌ కనుగొంది. కేంద్రప్రభుత్వం దానికి కూడా అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేయడంతో, ప్రస్తుతం 15-18 ఏళ్లలోపు పిల్లల వ్యాక్సినేషన్‌కు కొవ్యాక్సిన్‌ను వినియోగిస్తున్నారు. మరోవైపు ముక్కు టీకా (ఇంట్రానేసల్‌ వ్యాక్సిన్‌)తోనూ భారత్‌ బయోటెక్‌ రెండుదశల ప్రయోగ పరీక్షలను పూర్తి చేసింది. మూడోదశ ట్రయల్స్‌కు అనుమతుల కోసం కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో)కు దరఖాస్తు చేసుకోగా.. అందుకు అనుమతులు ఇవ్వొచ్చంటూ ఇటీవల విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) సిఫారసు చేసింది. ఇప్పటికే కొవ్యాక్సిన్‌, కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులు తీసుకున్న వారికి మూడో (బూస్టర్‌) డోసుగా ముక్కు టీకాను అందించాలని భారత్‌ బయోటెక్‌ యోచిస్తోంది. 

Updated Date - 2022-01-26T09:13:58+05:30 IST