కనెక్టికట్ ఫెడరల్ జడ్జిగా భారతీయురాలిని నామినేట్ చేసిన బైడెన్
ABN , First Publish Date - 2021-06-16T20:00:45+05:30 IST
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారతీయ అమెరికన్ పౌర హక్కుల న్యాయవాది సరళ విద్య నాగాలాను కనెక్టికట్ రాష్ట్ర ఫెడరల్ జడ్జిగా నామినేట్ చేశారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారతీయ అమెరికన్ పౌర హక్కుల న్యాయవాది సరళ విద్య నాగాలాను కనెక్టికట్ రాష్ట్ర ఫెడరల్ జడ్జిగా నామినేట్ చేశారు. ఈ నామినేషన్‌ను సెనేట్ ధృవీకరిస్తే కనెక్టికట్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ నాగాలా.. కనెక్టికట్ జిల్లా కోర్టులో ఫెడరల్ జడ్జిగా పనిచేసే దక్షిణాసియా సంతతికి చెందిన తొలి న్యాయమూర్తిగా రికార్డుకెక్కుతారు. ప్రస్తుతం నాగాలా కనెక్టికట్ జిల్లాలోని యూఎస్ అటార్నీ కార్యాలయంలోని మేజర్ క్రైమ్స్ యూనిట్ డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారు. 2017 నుంచి ఆమె ఈ పదవిలో కొనసాగుతున్నారు. 2012లో యూఎస్ అటార్నీ కార్యాలయంలో చేరిన నాగాలా ఇప్పటివరకు వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో న్యాయమూర్తి సుసాన్ గ్రాబెర్ వద్ద లా క్లర్క్‌గా నాగాలా తన లా కెరీర్‌ను ప్రారంభించారు. 2008లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని బర్కిలీ స్కూల్ ఆఫ్ లా నుండి జూరిస్ డాక్టర్ డిగ్రీని, 2005లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని అందుకున్నారు.