‘టాటా’ చేతికి బిగ్‌బాస్కెట్‌?

ABN , First Publish Date - 2020-10-29T06:00:17+05:30 IST

ఆన్‌లైన్‌ కిరాణా స్టార్టప్‌ బిగ్‌బాస్కెట్‌ దాదాపు వంద కోట్ల డాలర్లకు (రూ.7,400 కోట్లు) మెజారిటీ వాటా విక్రయించేందుకు టాటా

‘టాటా’ చేతికి బిగ్‌బాస్కెట్‌?

రూ.7,400 కోట్ల స్థాయిలో డీల్‌!


బెంగళూరు: ఆన్‌లైన్‌ కిరాణా స్టార్టప్‌ బిగ్‌బాస్కెట్‌ దాదాపు వంద కోట్ల డాలర్లకు (రూ.7,400 కోట్లు) మెజారిటీ వాటా విక్రయించేందుకు టాటా గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చైనా ఇన్వె్‌స్టమెంట్‌ దిగ్గజం అలీబాబా తనకు బిగ్‌బాస్కెట్‌లో ఉన్న 26 శాతం వాటాను పూర్తిగా టాటాలకు విక్రయించనున్నట్లు తెలిసింది. ఇరువర్గాల మధ్య ప్రస్తుత సంప్రదింపులు ఎప్పటికి కొలిక్కి వస్తాయనేదానిపైన మాత్రం స్పష్టత లేదు. బిగ్‌బాస్కెట్‌ దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ కిరాణా, ఆహారోత్పత్తుల విక్రయ సంస్థ. ఇదే తరహా సేవలందిస్తోన్న గ్రోఫర్స్‌తోపాటు అమెజాన్‌ ఫ్రెష్‌, జియోమార్ట్‌ నుంచి కంపెనీకి గట్టిపోటీ ఎదురవుతోంది. పైగా, కరోనా వ్యాప్తితో ఆన్‌లైన్‌ షాపింగ్‌, డోర్‌ డెలివరీ సేవలకు డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సేవలను మరింత విస్తరించేందుకు బిగ్‌బాస్కెట్‌ భారీగా నిధులు సేకరించే ప్రయత్నాల్లో ఉందని సమాచారం. 


త్వరలో టాటా సూపర్‌ యాప్‌ 

ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్‌ వరకు విభిన్న రంంగాల్లోకి విస్తరించిన టాటా గ్రూప్‌.. ఆన్‌లైన్‌ సేవలపై దృష్టిసారించింది. టాటా డిజిటల్‌ పేరుతో గత ఏడాది కొత్త సంస్థను సైతం ఏర్పాటు చేసింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, జియోమార్ట్‌ సహా అన్ని ఈ-కామర్స్‌ కంపెనీలకు ఒకే వేదిక ద్వారా పోటీనివ్వాలనుకుంటోంది. ఇందుకోసం సూపర్‌యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ఈమధ్యనే ప్రకటించారు. ఈ డిసెంబరు లేదా వచ్చే ఏడాదిలో యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన చెప్పారు. ఆహారం, కిరాణా సరుకులు, ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌, ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తుల ఆర్డర్‌ నుంచి ఇన్సూరెన్స్‌, ఫైనాన్షియల్‌, హెల్త్‌కేర్‌, బిల్లుల చెల్లింపు సేవల వరకు అన్నీ సూపర్‌ యాప్‌ ద్వారా అందించనున్నట్లు తెలిసింది. ఈ వ్యూహానికి బిగ్‌బాస్కెట్‌ కొనుగోలు మరింత దోహదపడనుందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2020-10-29T06:00:17+05:30 IST