రేవ్‌ పార్టీ తరహాలో బర్త్‌ డే వేడుకలు!

ABN , First Publish Date - 2021-06-14T08:55:58+05:30 IST

స్నేహితుడి జన్మదిన వేడుకలను యువతీ యువకులు రేవ్‌ పార్టీ తరహాలో చేసుకున్నారు.

రేవ్‌ పార్టీ తరహాలో బర్త్‌ డే వేడుకలు!

  • కడ్తాల ఫామ్‌హౌజ్‌లో యువతీ యువకుల జల్సా
  • పోలీసుల దాడి.. అరెస్టు.. రాత్రంతా కౌన్సెలింగ్‌

ఆమనగల్లు, జూన్‌ 13: స్నేహితుడి జన్మదిన వేడుకలను యువతీ యువకులు రేవ్‌ పార్టీ తరహాలో చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల పట్టణంలో శనివారం రాత్రి ఓ ఫామ్‌హౌ్‌సలో 90 మంది యువతీ యువకులు కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి మరీ జల్సా చేశారు. మద్యం తాగుతూ, డీజే పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ, మరో లోకంలో మునిగి తేలుతుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు. స్థానికులు అందించిన సమాచారంతో ఫామ్‌హౌ్‌సపై సంయుక్తంగా దాడి చేసిన ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు 21 మంది యువతులు, 43 మంది యువకులతో పాటు ముగ్గురు నిర్వాహకులు భరత్‌, దిషాన్‌, అన్వే్‌షలను అరెస్టు చేశారు. ఎస్‌ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వరుణ్‌గౌడ్‌ జన్మదిన వేడుక పార్టీని పోలీస్‌ స్టేషన్‌ వెనుక ఉన్న భరత్‌కు చెందిన ఫామ్‌హౌ్‌సలో ఏర్పాటు చేశాడు. 


రాత్రి 10 గంటలకు రేవ్‌ పార్టీ తరహాలో వేడుకలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 90 మంది వరుణ్‌గౌడ్‌ స్నేహితులు జల్సాలో మునిగిపోయారు. రాత్రి 11.30 గంటలకు పోలీసులు దాడి చేయడంతో బర్త్‌ డే బాయ్‌ వరుణ్‌గౌడ్‌ సహా కొందరు పారిపోయారు. పట్టుబడిన యువతీ యువకులను రాత్రంతా పామ్‌హౌ్‌సలోనే ఉంచిన పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. బాధితుల్లో చాలా మంది బడా బాబు పిల్లలే ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి 47 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని, డీజేను సీజ్‌ చేశామని ఎస్‌ఐ తెలిపారు. అనుమతి లేకుండా వేడుకలు జరుపుకోవడం, తదితర కారణాలతో 68 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని చెప్పారు. అయితే, జాతీయ రహదారి పక్కన పోలీసు స్టేషన్‌ వెనుకే ఉన్న ఫామ్‌హౌ్‌సకు 50-60 వాహనాలు కాన్వాయ్‌గా వచ్చినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-06-14T08:55:58+05:30 IST