ఆకురౌడీ మంత్రైతే.. భాషలాగే పాలన!

ABN , First Publish Date - 2020-09-26T09:06:33+05:30 IST

‘‘ఆకురౌడీ.. మంత్రి అయితే భాష, బాడీ లాంగ్వేజ్‌ మాత్రమే కాదు పాలన ఎలా ఉంటుందనే దానికి ఏపీ ప్రత్యక్ష నిదర్శనం’’

ఆకురౌడీ మంత్రైతే.. భాషలాగే పాలన!

 హిందూ ఆలయాలపై దాడుల వెనుక కుట్ర

8 ‘డిక్లరేషన్‌’ వివాదం వైవీదే.. జగనే జీవో పాటించరా? : సత్యకుమార్‌


అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘‘ఆకురౌడీ.. మంత్రి అయితే భాష, బాడీ లాంగ్వేజ్‌ మాత్రమే కాదు పాలన ఎలా ఉంటుందనే దానికి ఏపీ ప్రత్యక్ష నిదర్శనం’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తలసరి ఆదాయం పెంచకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ భవిష్యత్తు తరాలకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో శుక్రవారం జరిగిన పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సత్యకుమార్‌ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఓ మంత్రి దేవునిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంటే సీఎం జగన్‌ కనీసం నోరు తెరవడం లేదని, ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల వెనుక కుట్ర కోణం ఉండి ఉంటుందన్నారు.


తిరుమలలో డిక్లరేషన్‌ గురించి మొదట మాట్లాడింది టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డేనని, ప్రభుత్వ జీవోను ముఖ్యమంత్రే పాటించకపోతే సామాన్యులకు ఏం చెబుతారని నిలదీశారు. పాలనతోపాటు ప్రజా సమస్యలపై స్పష్టతలేని జగన్‌, పొరుగు రాష్ట్రాల్లోనేగాక విదేశాల్లో నియమించుకున్న అంతర్జాతీయ సలహాదారులతో అయి నా చర్చించి పాలన సాగించాలన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో చేపడుతున్న కార్యక్రమాలకు సీఎం జగన్‌ తన పేరు, తన తండ్రి పేరు పెడుతున్నారని.. ఏకంగా కొవిడ్‌-19 పాస్‌పై కూడా వైఎస్సార్‌ అని ముద్రించడం పరాకాష్ఠకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీపై తన కేబినెట్‌ మంత్రితో విమర్శలు చేయించి, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటే ఆశ్చర్యకరంగా ఉందని దుయ్యబట్టారు.

Updated Date - 2020-09-26T09:06:33+05:30 IST