Abn logo
Oct 24 2021 @ 02:34AM

Revanth Reddy పీసీసీ అధ్యక్షుడయ్యాక.. : Bandi ఆసక్తికర వ్యాఖ్యలు..

  • కోతులకు కనబడేది కోతులే
  • బీజేపీ నేతలు, కార్యకర్తలు కొదమ సింహాలు
  • టీఆర్‌ఎస్‌ వాళ్లు నన్ను రహస్యంగా కలిశారు
  • మంత్రులు, ఎమ్మెల్యేలను చూసి హుజూరాబాద్‌కు
  • దండుపాళ్యం ముఠా వచ్చిందని జనం అంటున్నారు
  • ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు
  • కేసీఆర్‌ కుటుంబం, పార్టీలో కొట్లాటలు పెరిగాయి
  • ఎమ్మెల్యేలు తిరగబడే స్థాయికి వచ్చారు
  • కాంగ్రెస్‌కు పోటీ బీజేపీతోనా..? టీఆర్‌ఎస్‌తోనా..?
  • ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో బండి సంజయ్‌


హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నాయకులు, కార్యకర్తలు కొదమ సింహాలు అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. కోతులకు ఎక్కడ చూసినా కోతులే కనబడతాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘మేం కొదమ సింహాలం. మా గర్జన తట్టుకోలేక కోతులు హైరానా పడుతున్నాయి.. పచ్చకామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగా కనబడుతుందన్నట్టు.. టీఆర్‌ఎ్‌సలో ఉన్నోళ్లంతా కోతులు కాబట్టి, ఎదుటి పార్టీలో కూడా అలాగే ఉంటారని అనుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ వాళ్లు నన్ను రహస్యంగా కలిశారు. మంత్రులు, ఎమ్మెల్యేలను చూసి హుజూరాబాద్‌ ప్రజలు దండుపాళ్యం ముఠా వచ్చిందని అంటున్నారు.


సీఎం కేసీఆర్‌వి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు. మేం డబ్బులిస్తం.. మీరు ఓట్లేయండి.. అని హుజూరాబాద్‌లో ప్రలోభాలకు తెరలేపారు. డబ్బులతో మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. కాంగ్రెస్‌ గోత్రాలు టీఆర్‌ఎ్‌సకు.. టీఆర్‌ఎస్‌ గోత్రాలు కాంగ్రె్‌సకు తెలుసు.. వారిద్దరి టార్గెట్‌ బీజేపీ. కేసీఆర్‌ పాలన పట్ల ఉన్న వ్యతిరేకత హుజూరాబాద్‌ ఎన్నిక ద్వారా బయటకు రాబోతోంది. వచ్చే నెల 15న టీఆర్‌ఎస్‌ తలపెట్టిన విజయగర్జన సభే వీడ్కోలు సభ అవుతుంది. కేసీఆర్‌ అహంకారం తగ్గాలంటే టీఆర్‌ఎ్‌సకు గుణపాఠం చెప్పాలని హుజూరాబాద్‌ ప్రజలు నిర్ణయానికి వచ్చారు’’ అని సంజయ్‌ స్పష్టం చేశారు. ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని విషయాలను వెల్లడించారు.


బీజేపీ నేతలంతా కాంగ్రెస్‌లోకి వెళతారని మంత్రి కేటీఆర్‌ అంటున్నారు కదా?

ముందు వాళ్ల పార్టీ నాయకులు ఎటుపోకుండా చూసుకుంటే మంచిది. టీఆర్‌ఎస్‌ నాయకులే ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని, సిద్ధాంతాన్ని నమ్ముకుని మా పార్టీ నేతలు పనిచేస్తారు తప్ప, వ్యక్తులను నమ్ముకుని కాదు. ఇకపోతే, ఈటల, బీజేపీలోకి రాకముందు కాంగ్రె్‌సతో పాటు మిగతావారినీ కలిశారు. అందులో తప్పేముంది? ఇంకో విషయం.. టీఆర్‌ఎ్‌సవాళ్లు నన్ను కూడా రహస్యంగా కలిశారు.  


హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ప్రలోభాలకు గురిచేస్తోందని మీరు పదేపదే ఆరోపిస్తున్నారు.. అంటే ఎలా..?

సొంత పార్టీ నాయకులనే కొనే దుస్థితికి టీఆర్‌ఎస్‌ నాయకులు దిగజారారు. కొంత మంది ప్రజాప్రతినిధులను కొంటున్నారు. జాగా ఉంటే కబ్జా చేస్తామని, అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలను చూసి దండుపాళ్యం ముఠా వచ్చిందని హుజూరాబాద్‌ ప్రజలు అంటున్నారు.

ముందస్తుకు వెళ్లబోమని కేసీఆర్‌ చెప్పారు కదా?

కేసీఆర్‌ ఏది అంటారో దానికి భిన్నంగా చేస్తారు. ఆయన కుటుంబం, టీఆర్‌ఎ్‌సలో కొట్లాటలు పెరిగాయి. ఎమ్మెల్యేలు తిరగబడే స్థాయికి వచ్చారు. రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారు.. అభివృద్ధి లేదు. కేసీఆర్‌ పట్టించుకోవడంలేదు. దళితబంధు కోసం కేడర్‌ ఒత్తిడి చేస్తోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే మాకు మొరపెట్టుకుంటున్నారు. వాళ్ల దృష్టిని మళ్లించడానికే ముందస్తు లేదంటూ కేసీఆర్‌ ప్రకటన చేశారు.


పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను కేంద్రం సామాన్యులపై భారం మోపుతోందని టీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తోంది కదా?

పెట్రోల్‌ అమ్మకాలపై వచ్చిన ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి లీటరుకు రూ.41 కేంద్రం నుంచి పన్నుల వాటా రూపేణా వస్తుంది. ఇది తగ్గిస్తే రాష్ట్రంలో రూ.60కే పెట్రోల్‌ దొరుకుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చాలని లేఖ రాసే దమ్ము హరీశ్‌కు ఉందా.?


రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్‌.. బీజేపీకి పోటీగా ఎదిగిందని అనుకుంటున్నారా?

టీఆర్‌ఎ్‌సను ఎదుర్కోవడానికి మేం పోరాటం చేస్తున్నాం. ఏ పార్టీ అధ్యక్షుడయినా తన పార్టీని శక్తిమంతం చేయడానికి కృషి చేస్తాడు. కానీ, కాంగ్రెస్‌.. బీజేపీతో కొట్లాడుతోంది. బీజేపీ ఏ రోజు సభ పెడితే వాళ్లు పోటీ మీటింగ్‌ పెడుతున్నారు. కాంగ్రెస్‌ మాతో పోటీ పడుతోందా? టీఆర్‌ఎ్‌సతో పోటీ పడుతోందా? అన్నది ఆ పార్టీ నాయకత్వం ఆలోచించుకోవాలి.

మీ ప్రచార వ్యూహం ఎలా కొనసాగిస్తున్నారు?

నాలుగు నెలల నుంచి మేం పోలింగ్‌ కేంద్రాలు, శక్తి కేంద్రాల వారీగా ప్రతీ ఒక్కరినీ కలిసి ఓటు అభ్యర్థిస్తున్నాం. రాష్ట్ర, జాతీయ పార్టీ నాయకులు, స్థానిక కేడర్‌తో కలిసి ప్రతీ రోజు ఒక్కో మండలంలో రెండు, మూడు సమావేశాలు నిర్వహించి ప్రచారం చేస్తున్నాం. ఈటలకు జరిగిన అన్యాయం, కేసీఆర్‌ అహంకార వైఖరి, టీఆర్‌ఎస్‌ హామీల అమలులో చేసిన మోసాలను వివరిస్తున్నాం.


బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కైయ్యాయని కేటీఆర్‌ అంటున్నారు కదా?

కాంగ్రెసోళ్లేమో బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒకటి అని అంటారు. టీఆర్‌ఎస్సేమో బీజేపీ కాంగ్రెస్‌ ఒకటి అంటుంది.. ఆ రెండు పార్టీలకు మేమే టార్గెట్‌ అని వారి మాటల్లోనే స్పష్టమైంది. వారిద్దరి లక్ష్యం ఒకటే అయినప్పుడు వారిద్దరూ ఒక్కటి కాదా?. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎలా చీల్చాలన్నదానిపై టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసి ప్లాన్‌ చేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎ్‌సలో చేరడాన్ని ఏమనాలి? ప్లీజ్‌ పంపండి అని టీఆర్‌ఎస్‌ అడిగితే.. కాంగ్రెస్‌ పంపింది.. ఇది నిజం కాదా? 


హుజూరాబాద్‌ ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?

టీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా ఉద్యమం తప్పదు. బీజేపీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆరంభమైన ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం, ఈ ఎన్నిక తర్వాత మరింత ఉధృతమవుతుంది. టీఆర్‌ఎ్‌సపై ఇది చివరి పోరాటం కావాలని ప్రజలు భావిస్తున్నారు. టీఆర్‌ఎ్‌సతో కొట్లాడే దమ్ము బీజేపీకే ఉందని వారు విశ్వసిస్తున్నారు.


షర్మిల పాదయాత్రపై మీ అభిప్రాయం?

సమస్యలు తెలుసుకోవడానికి ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చు. ఎవరు చేసినా మేం వ్యతిరేకించం.’టీఆర్‌ఎస్‌ ఏం సాధించిందని విజయగర్జన?

తెలంగాణను అప్పుల పాలు చేసినందుకా..? ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి తెచ్చినందుకా? ఉద్యోగ, ఉపాధ్యాయులను రాసిరంపాన పెట్టినందుకా? దళితులు, బీసీలను మోసం చేసినందుకా? అడ్డగోలుగా సంపాదించుకున్నందుకా? ఇందుకా విజయ గర్జన? టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఎన్ని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇచ్చారు? దళితుడిని సీఎం చేశారా? ఎన్ని దళిత కుటుంబాలకు మూడెకరాలు ఇచ్చాం? ఇంటికో ఉద్యోగం ఎంత మందికి వచ్చింది? విద్యార్థులు, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులు అసలు ఆత్మహత్యలే చేసుకోలే.. వంటి వాటిపై తీర్మానాలు చేయాలి. అందుకే ప్లీనరీ.. టీఆర్‌ఎ్‌సకు అదే వీడ్కోలు సభ అవుతుంది


హుజూరాబాద్‌ ఎన్నిక సందర్భంగా రాజుకుంటున్న రాజకీయ వేడిపై మీ అభిప్రాయం?

హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు ఇప్పటికే ఖాయమైంది. మా అభ్యర్థి ఈటల ఎంత మెజారిటీ సాధిస్తాడన్నదానిపైనే ఇప్పుడు రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని వెతుక్కోవడానికే ఎన్ని రోజులు పట్టిందో అందరికీ తెలుసు. కేసీఆర్‌ డైరెక్షన్‌లో నియోజకవర్గంలో అడుగడుగునా అధికార దుర్వినియోగం, ఒక్కో ఓటుకు రూ.20 వేల చొప్పున పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ జరుగుతోంది. మరోవైపు, అబద్ధాలు ప్రచారం చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా నెగ్గాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, ప్రజలు ఈటలను గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారు. సర్వే నివేదికలన్నీ బీజేపీ వైపే ఉన్నాయి.