మోదీతో జగన్ భేటీ.. ఆయన కోసమేనా..?: బోండా ఉమా

ABN , First Publish Date - 2020-02-22T18:59:12+05:30 IST

మంగళగిరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన నిమ్మగడ్డ ప్రసాద్..

మోదీతో జగన్ భేటీ.. ఆయన కోసమేనా..?: బోండా ఉమా

మంగళగిరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా జైల్లో ఎందుకున్నారని, అక్కడ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో సీఎం జగన్ చెప్పాలని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనిపై సీఎం ఎందుకు మాట్లాడటంలేదన్నారు. ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏం మాట్లాడారో జగన్‌ చెప్పాలని డిమాండ్ చేశారు.


జగన్‌ కేసులో ముద్దాయిలందరికీ మారిషస్‌ కోర్టు నోటీసులు ఇచ్చిందని, ఈ కేసుల నుంచి బయటపడేయాలని జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని వేడుకున్నారని బోండా ఉమా ఆరోపించారు. ఏపీ సీఎం జగన్‌ పేరు అంతర్జాతీయ న్యాయస్థానాలకు ఎక్కిందన్నారు. జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు వాన్ పిక్ పేరుతో యూఏఈకి చెందిన ర‌స్ ఆల్ ఖైమాతో పోర్టులు, ఓడరేవుల అభివృద్దికి ఒప్పందం కుదుర్చుకున్నారని.. ఆ సమ‌యంలో వైఎస్ సుమారు 28 వేల ఎక‌రాల భూముల‌ను నిమ్మ‌గ‌డ్డ‌ కంపెనీకి కేటాయించారన్నారు. ర‌స్ ఆల్ ఖైమా రూ. 875 కోట్లు పెట్టుబ‌డులు పెట్టిందని.. అయితే ఆ పెట్టుబ‌డుల‌ను నిమ్మ‌గ‌డ్డ దుర్వినియోగం చేసి జ‌గ‌న్‌కు సంబంధించిన జ‌గ‌తి పబ్లికేష‌న్స్‌లో దాదాపు రూ.850 కోట్ల పెట్టుబ‌డులు పెట్టార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.


నిమ్మగడ్డ ప్రసాద్ కుటుంబంతో ఐరోపా వెళ్లారని, సెర్బియాలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టారని బోండా ఉమా తెలిపారు. ఇప్పుడు నిమ్మగడ్డను భారత దేశానికి తిరిగి రప్పించుకునేందుకే జగన్ తన సమయాన్ని వెచ్చిస్తున్నారన్నారని  విమర్శించారు. గత ఏడాది జూలైలో నిమ్మగడ్డను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఇంకా అక్కడ జైల్లో ఉన్నారని అన్నారు. మరి ఇప్పటివరకు నిమ్మగడ్డపై జగన్ ఎందుకు మాట్లాడడంలేదని బోండా ఉమా ప్రశ్నించారు. దీనికి సంబంధించి ర‌స్ ఆల్ ఖైమా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నోటీసులు వచ్చినట్లు తెలియవచ్చిందన్నారు. దీనిపై జగన్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడడంలేదని బోండా ఉమా ప్రశ్నించారు. ఇప్పటికీ సీఎం జగన్ ప్రతి శుక్రవారం కోర్టు ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా విచారణ జరుగుతోందని, దాన్ని దారి మళ్లించేదుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు. 

Updated Date - 2020-02-22T18:59:12+05:30 IST