Boney Kapoor కుటుంబానికి UAE బంపరాఫర్..
ABN , First Publish Date - 2021-09-14T20:46:06+05:30 IST
వివిధ రంగాల్లో దేశానికి కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం 2019 నుంచి గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే.
దుబాయ్: వివిధ రంగాల్లో దేశానికి కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం 2019 నుంచి గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఐదు, పదేళ్ల కాలపరిమితితో గోల్డెన్ వీసా ఇస్తోంది. భారత్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఇప్పటి వరకు గోల్డెన్ వీసా అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. ఇక సినీ రంగంలో కూడా పలువురు భారత నటులకు గోల్డెన్ వీసా వచ్చింది. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌తో పాటు సంజయ్ దత్ గోల్డెన్ వీసా అందుకున్నారు. అటు మలయాళం ఇండస్ట్రీ నుంచి మోహన్‌లాల్, మమ్ముట్టి కూడా ఇటీవల యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా తీసుకున్నారు.
తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ నిర్మాత, అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్ చేరారు. బోనీ కపూర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు దుబాయ్ 10 ఏళ్ల గోల్డెన్ వీసా మంజూరు చేసింది. ఈ విషయాన్ని బోనీ కపూర్ ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా దుబాయ్ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తనతో పాటు తన ఫ్యామిలీకి పదేళ్ల కాలపరిమితితో గోల్డెన్ వీసా మంజూరు చేసినందుకు దుబాయ్ పాలకులకు థ్యాంక్స్ చెప్పారు. ఇది తన కుటుంబానికి దక్కిన అరుదైన గౌరవంగా ఆయన పేర్కొన్నారు.
ఇక అతిలోకి సుందరి శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లోనే మరణించిన విషయం తెలిసిందే. ఆమె బస చేసిన జుమైరహా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆ సమయంలో కూడా దుబాయ్ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు పూర్తిగా సహకరించింది. అలాగే శ్రీదేవి మృతదేహాన్ని త్వరితగతిన భారత్‌కు తరలించేందుకు కూడా సాయం చేసింది.