సాయానికి సరిహద్దు!

ABN , First Publish Date - 2020-07-01T10:37:10+05:30 IST

ఏపీ, తెలంగాణ సరిహద్దు గ్రామాల రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.

సాయానికి సరిహద్దు!

ఏపీలో భూములున్న తెలంగాణ రైతులకు దక్కని ‘భరోసా’

రుణాల మంజూరులోనూ కొర్రీలు

ఆధార్‌ చిరునామా తెలంగాణది కావమే కారణం

రెంటికి చెడ్డరేవడిలా అన్నదాతల పరిస్థితి


మధిర, జూన్‌ 30: ఏపీ, తెలంగాణ సరిహద్దు గ్రామాల రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. తెలంగాణలో నివాసం ఉండి ఆంధ్రాలో భూములున్న వారికి అక్కడి ప్రభుత్వం పథకాలు వర్తింపజేయడం లేదు. ప్రతీ పథకం, ప్రతీ లబ్ధి వెనుక అనేక కొర్రీలు పెడుతుండటంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. తమ సరిహద్దు కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు. సరిహద్దు తెలంగాణకు చెందిన వారికి ఏపీ గ్రామాల్లో, ఏపీకి చెందిన వారికి తెలంగాణలో పొలాలున్నాయి. ఏపీకి చెందిన వారికి ఇక్కడ భూములుంటే.. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు, రైతుబీమా వర్తింపజేస్తోంది. బ్యాంకులు రుణాలు కూడా ఇస్తున్నాయి. కానీ తెలంగాణకు చెందిన వారికి ఏపీలో భూములుంటే మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వ పథకాలేవీ వర్తించడం లేదు. అదేమంటే ఆధార్‌ కార్డు తెలంగాణలో ఉందన్న సమాధానం ఎదురవుతోంది. రైతుభరోసా, బ్యాంకు రుణాలు, రుణమాఫీకి స్థానికేతరులన్న కారణం చూపుతున్నారు.


మధిర నియోజకవర్గంలోని మఽధిర, ఎర్రుపాలెం, బోనకల్‌, ముదిగొండ మండలాల్లోని సరిహద్దు గ్రామాల రైతులు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర సమయంలో తమకు ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదని, రాష్ట్ర విడిపోయాక తమకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి రుణాలు, సాయం అందడం లేదని వాపోతున్నారు. అయితే నందిగామ, వత్సవాయి, జగ్గయ్యపేట, వీరుల పాడు మండలాల్లోని కొన్ని జాతీయ బ్యాంకుల శాఖలు రుణాలు ఇస్తుం డగా.. కొన్ని బ్యాంకులు నిరాకరిస్తు న్నాయి. అలాగే గంపలగూడెం మండ లంలో ఒక్క బ్యాంకు నుంచి కూడా రు ణాలు మంజూ రవడం లేదని రైతులు వాపోతున్నారు.


ఈ క్రమంలో కొందరు రైతులకు అక్కడి వారితో ఉన్న సంబంధాలు, పలుకుబడితో రుణాలు మంజూరు చేయించుకుంటున్నారు. తమకు ఏపీలో భూములున్నాయని, కానీ బ్యాంకులు తమకు రుణాలు ఇవ్వడంలేదని మఽధిర మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చిలుకూరుకు చెందిన పలువురు తమకు ఆంధ్రాలో భూములుండటంతో అక్కడున్న సిండికేట్‌ బ్యాంకుకు వెళితే వారు ఆధార్‌కార్డులో ఏపీ చిరునామా లేదని కనీసం ఖాతా కూడా ఇవ్వలేదు. ఇల్లూరుకు చెందిన ఆరుగురిలో ముగ్గురికి మాత్రమే రుణాలిచ్చారు.


20మంది బోనకల్‌ మండలం గోవిందాపురం రైతులకు వీరులపాడు మండలం వేములనర్వలో భూములుండగా.. రుణాలివ్వడంలో అక్కడి సిండికేట్‌ బ్యాంకు వారు కొర్రీలు పెడుతున్నారు. ముందిగొండ మండలం వల్లభి రైతులకు జగ్గయ్యపేట, గండ్రాయి రెవెన్యూలో భూములుండగా.. బ్యాంకులు రుణాలు అరకొరగా ఇస్తున్నాయి.


బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదు..దేవభత్తుని సత్యనారాయణ, రామచంద్రాపురం

మాకు కృష్ణాజిల్లా కొనిజర్లలో ఎకరం50సెంట్ల భూమి ఉంది. కొణిజర్లలోని బ్యాంకులకు వెళ్లితే తెలంగాణ వారికి ఇక్కడ రుణాలు ఇవ్వమని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చే రైతుభరోసా, రైతుబీమా పథకాలూ వర్తించడం లేదు. 


తెలంగాణ ఆధార్‌కార్డు కారణమంటున్నారు..బాగం మధుసూదన్‌రావు, గోవిందాపురం

నాకు వత్సవాయి మండలం కాకరవాయిలో మూడెకరాలుంది. అక్కడ ఇండియన్‌ బ్యాంకు రుణాలు ఇస్తుంది. కానీ రైతు భరోసా ఇవ్వమని, అందుకు తెలంగాణ ఆధార్‌కార్డు ఉండటమే కారణమంటున్నారు. ఏపీ వారికి తెలంగాణలో రైతుబంధు ఇస్తున్నారు. కానీ మాకు మాత్రం అక్కడి ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వడంలేదు. 


రైతుభరోసా ఇవ్వడం లేదు..ఉప్పుగల్లు వెంకట్రామయ్య, బోనకల్‌

నాకు కృష్ణాజిల్లా వేములనర్వ గ్రామంలో రెండెకరాల భూమి ఉంది. కానీ అక్కడి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడంలేదు. అక్కడ భూములు ఉండటం వల్ల తెలంగాణ రైతుబంధు ఎలాగూ వర్తించదు. కనీసం అక్కడి ప్రభుత్వం నుంచైనా సాయం అందుతుందేమోనని అనుకున్నాం. కానీ రెండు వైపులా మాకు నిరాశే మిగులుతోంది. 


పంట రుణాలు ఇవ్వడంలేదు..బండ్లమూడి హనుమంతరావు, గుంటుపల్లి గోపారం

నాకు గంపలగూడెం మండలం వినగడపలో ఏడెకరాలుంది. అక్కడి బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడంలేదు. ఏపీ ప్రభుత్వం రైతు భరోసా కూడా ఇవ్వడంలేదు. సొంతంగా పెట్టుబడులు పెట్టుకోవాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం కల్పించుకొని సాయం చేయాలి.


ప్రభుత్వ సహాయం అందజేయాలి..కోట సూర్యనారాయణ, ఎర్రుపాలెం

నాకు కృష్ణా జిల్లా వినగడపలో మూడున్నర ఎకరాల పొలం ఉంది. కానీ అక్కడి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. ఇక్కడి ప్రభుత్వం అక్కడ నివాసం ఉండి ఇక్కడ భూములున్న రైతులకు సాయం ఇస్తోంది. అక్కడ భూములున్న మాకు మాత్రం ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. దీంతో పెట్టుబడి కష్టాలు ఎదుర్కొంటున్నాం.

Updated Date - 2020-07-01T10:37:10+05:30 IST