జలకళ తప్పింది!

ABN , First Publish Date - 2020-10-20T08:34:54+05:30 IST

వైఎస్సార్‌ జలకళలో భాగంగా ఉచితంగా బోర్లు వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ఉచితంగా బోరు వేసినా, మోటార్‌ పంపుసెట్లు సొంతంగా బిగించుకోవాలంటే రైతులకు భారం అవుతుందని

జలకళ తప్పింది!

‘దుర్భిక్ష’ ప్రాంతాలకు పథకం దూరం

అర్హతున్నా 1100 గ్రామాలు అవుట్‌

ఐదేళ్ల క్రితం నాటి నివేదికలను

యథాతథంగా తీసుకున్న కొత్తసర్కార్‌

ఆ లిస్టుతో లబ్ధిదారుల్లో భారీ కోత

ఆ నివేదికలపై అప్పట్లోనే విమర్శలు

రిజర్వాయర్‌ సమీప గ్రామాలనూ

దుర్భిక్ష జాబితాలో కలిపేసిన వైనం

ఓసారి బోరు వేస్తే ఉచితం ఉండదట!


ఎండిన గొంతులకే జలం అందాలి. వరుస కరువులకు చిక్కి,  చెమ్మ ఇంకని దుర్భిక్ష సీమలకే జలకళ తిరిగి రావాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ‘తీవ్ర దుర్భిక్షం’ పేరిట 1094 గ్రామాలను ‘వైఎస్సార్‌ జలకళ’కు దూరం చేసేసింది. నిజానికి,  వీటిలో చాలా గ్రామాలు దుర్భిక్ష పరిస్థితిని ఎప్పుడో దాటేశాయి. కానీ, ఐదేళ్ల క్రితం నాటి పాత నిర్ధారణలనే కొత్త ప్రభుత్వం యథాతథంగా తీసుకుని.. లబ్ధిదారులను ఎక్కడికక్కడ కుదించేసింది. ‘ప్రతి రైతుకు బోరు’ అని పథకంలో చెప్పి, ఒకసారి బోరు వేస్తే, ఉచితం వర్తించబోదని మెలిక పెట్టేశారు!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైఎస్సార్‌ జలకళలో భాగంగా ఉచితంగా బోర్లు  వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ఉచితంగా బోరు వేసినా, మోటార్‌ పంపుసెట్లు సొంతంగా బిగించుకోవాలంటే రైతులకు భారం అవుతుందని ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. ఆ తర్వాత ప్రభుత్వం  మరో ప్రకటన చేసింది.  బోరు.. మోటార్‌.. విద్యుత్‌ కనెక్షన్‌, వైరు... ఇలా అన్నీ ఉచితంగానే ఇస్తామని ఉత్తర్వులు జారీచేసింది. పేద రైతులకు ఉద్దేశించిన ఈ పథకాన్ని ఇంత ‘బాగా’ అమలుచేస్తే కావాల్సింది ఏముంటుంది? అయితే, ప్రభుత్వం తీరుచూస్తుంటే ఈ పథకం నికరంగా ఎంతమంది పేద రైతులకు దక్కుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే బోర్లు వేసిన పొలాలకు మళ్లీ బోర్లు మంజూరు చేయకూడదని జలకళ  నిబంధనల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. అలాగే, తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలను ఈ పథకం నుంచి మినహాయించారు. ఈ ప్రాంతాల్లో బోర్లు వేయరాదని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు జలకళ దక్కనీయకుండా చేయడానికే ఇలా చిక్కులు సృష్టిస్తున్నారని రైతుసంఘాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారం పంచపాండవులు- మంచం కోళ్లు అనే సామెతను గుర్తు చేస్తున్నదని ఆవేదన చెందుతున్నాయి. రైతులు వారి పొలాల్లో వేసిన బోర్లు చాలా వరకు నీళ్లు రాక ఎండిపోయిన సందర్భాలున్నాయి.


ఒక బోరు ఎండితే మరో బోరు.. అది పడకపోతే మరొకటి.. ఇలా తమ పొలంలో ఎన్నో బోర్లు వేసిన రైతులు ఉన్నారు. దీనివల్ల అప్పులుపాలయి వ్యవసాయం వదిలిపెట్టడం, వలసపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి రాష్ట్రంలో బాగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితిని తప్పించడానికి టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రయత్నాలు జరిగాయి. ఇందులో భాగంగా అప్పట్లో ఎన్టీఆర్‌ జలసిరి పథకం అమలుచేశారు. ఈ పథకం కింద ప్రభుత్వమే పేద రైతు పొలాల్లో బోర్లు వేసింది. సోలార్‌ పంపుసెట్లనుకూడా అందించాలని ప్రణాళికలు రచించింది. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే పాత పథకాలన్నీ రద్దు చేసినట్టే.. ఎన్టీఆర్‌ జలసిరినీ తీసేసింది. దానిస్థానంలో వైఎ్‌సఆర్‌ జలకళ తెచ్చింది. పేద, పెద్ద అని లేకుండా బోర్లు రైతులందరి పొలాల్లో వేయాలని నిర్ణయించి.. మోటార్లు, పంపుసెట్లు, ఇతర ఉచిత బిగింపులను మాత్రం పేదరైతులకు పరిమితం చేసింది. అప్పటికి ‘జలసిరి’ మంజూరైన వారినీ, ఈ పథకం కింద పంపుసెట్లు తీసుకోడానికి అప్పట్లో డీడీలు కట్టిన లబ్ధిదారులనూ కొత్త ప్రభుత్వం పట్టించుకోలేదు. వారిని ‘జలకళ’లో భాగం చేయలేదు. గత ప్రభుత్వంలో బోర్లు వేసినవారిని కూడా పక్కన పెట్టేశారు. వారికి ఉచిత మోటార్‌ పంపుసెట్లు, విద్యుత్‌ కనెక్షన్‌..ఇలా ఏ లబ్ధీ కలగడంలేదు. దీంతో అప్పట్లో డీడీలు కట్టినవారిలో చాలామంది ఆ సొమ్ము వెనక్కి తీసేసుకొంటున్నారు. గతంలో ఒకసారి బోరు వేసి ఫెయిలైతే.. మరోసారి వేయాలంటే ఉచితం వర్తించదని తాజాగా పేర్కొన్నారు.


ఇప్పటికీ ఐదేళ్ల క్రితం లెక్కలేనా?

ప్రతి జిల్లాలో పలు గ్రామాల్లో భూగర్భ జలాలు ఎండిపోయాయని ఐదేళ్లు కింద భూగర్భజలశాఖ సర్వే చేసి నివేదికలిచ్చింది. వాటి ఆధారంగా అధికారులు అప్పట్లో రాష్ట్రంలో దాదాపు 1,100 గ్రామాలను తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలుగా గుర్తించారు. జలకళ పథకం అమలులో ప్రభుత్వ అధికారులు ఐదేళ్ల నాటి నివేదికలనే ప్రాతిపదిక చేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో బోర్లు వేయరాదని నిర్ణయం తీసుకోవడం రైతులకు శరాఘాతమే! ఈ ఐదేళ్లలో అన్నీకాకపోయినా భూగర్భ జలం పెరిగి దుర్భిక్షం తప్పించుకొన్న గ్రామాలు కొన్నయినా ఉంటాయి. కొత్తగా పథకం తెస్తున్నప్పుడు ఇంకా ఆ పాత రికార్డులే పట్టుకుని వేలాడితే ఎలాగని రైతులు ప్రశ్నిస్తున్నారు. పైగా భూగర్భజలశాఖ సర్వే తప్పుల తడకలుగా ఉందని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. నదీ జలాల దాపులో, రిజర్వాయర్లకు సమీపంలో ఉన్న గ్రామాలనూ భూగర్భ జలాలు అడుగంటిన వాటి జాబితాలో కలిపేశారు. చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోని ఎక్కువ గ్రామాల్లో భూగర్భ జలమట్టం సుదీర్ఘ లోతులో ఉన్నాయని అప్పటి సర్వే తేల్చింది. ఈ గ్రామాల్లోని రైతులను ఇప్పుడు ఈ నివేదికలు ‘జలకళ’ నుంచి దూరం చేసేశాయి. ఎప్పుడో ఐదేళ్ల క్రితం నాటి నివేదికలను ప్రామాణికంగా ఎలా పరిగణిస్తారని పలువురు రైతులు తప్పుబడుతున్నారు. భూగర్భజలాలపై కొత్త సర్వే నిర్వహించాలని, అప్పటిదాకా దుర్భిక్షం పేరిట ఏ గ్రామాన్నీ పథకానికి దూరం చేయొద్దని పలువురు వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలు కోరుతున్నాయి. 

Updated Date - 2020-10-20T08:34:54+05:30 IST