Abn logo
Jul 19 2020 @ 02:35AM

ఇద్దరూ ఇద్దరే!

కరోనా బాధితులతో ఆస్పత్రులు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. ఎవరైనా డిశ్చార్జ్‌ అయితే గానీ బెడ్స్‌ సమకూర్చలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. హైదరాబాద్‌లో బోలెడన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఉండటం వల్ల బెడ్లకు కొరత అంతగా లేదు. ఉపద్రవం ముంచుకొస్తే ప్రభుత్వం తమను ఆదుకుంటుంది అన్న భరోసా కల్పించాల్సింది ప్రభుత్వాలే కదా! తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయి, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మాయా మశ్చీంద్ర  పథకాల రూపకల్పనలో బిజీగా ఉంటే బాధితులకు దిక్కెవరు? ఇలాంటి విషయాలలో కూడా న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి రావడం ప్రభుత్వాలకు తలవంపు కాదా? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పథకాలతో ప్రజలను మభ్య పెడుతూ ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన వాక్‌ స్వాతంత్ర్యాన్ని కూడా హరించడానికి వెనుకాడటం లేదు. ఈ విషయంలో కేసీఆర్‌ను తలదన్నేలా జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.


ఉద్యమాలు, ఆందోళనల ద్వారా ప్రభుత్వాల మెడలు వంచాల్సిన ప్రతిపక్షాలు.. ముఖ్యమంత్రులు జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ వైఖరి కారణంగా నిస్సహాయంగా ఉండిపోతున్నాయి. దీనితో ఉపశమనం కోసం ప్రజలే కాకుండా ప్రతిపక్షాలు సైతం రెండు రాష్ట్రాల్లోనూ హైకోర్టులను ఆశ్రయిస్తున్నాయి. ఈ కారణంగా ఉభయ రాష్ట్రాలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులపై భారంతోపాటు బాధ్యతా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరితో పాటు తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర చౌహాన్‌ కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. జస్టిస్‌ మహేశ్వరికి న్యాయశాస్త్రం పట్ల పూర్తి అవగాహన ఉంది. తీర్పులు ఇచ్చే సమయంలో తన పరిధులను అతిక్రమించరు. అమలులో ఉన్న చట్టాలకు, నిబంధనలకు అనుగుణంగానే ఆయన తీర్పులు ఉంటాయి. తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర చౌహాన్‌ మానవ హక్కులు, మానవత్వం వంటి విషయాలతోపాటు ప్రజాస్వామిక సూత్రాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు పరిధి దాటినట్టు అనిపించినా తుది తీర్పు వచ్చేసరికి చట్ట పరిధిలోనే వ్యవహరిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా జస్టిస్‌ చౌహాన్‌ చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనం.


‘‘రాష్ట్రప్రభుత్వం నన్ను వేధిస్తోంది. రక్షణ కల్పించండి’’ అని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒకాయన ఆ మధ్య ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తాను ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారో తెలుసుకోవడానికై కొన్ని వారాల తర్వాత ఆయన మళ్లీ గవర్నర్‌ను కలిశారు. అప్పుడు గవర్నర్‌ తన జేబులో నుంచి ఒక కాగితం తీసి, ‘‘మీరిచ్చిన వినతిపత్రం నా వద్దే ఉంది.. దీనిని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను’’ అని తాపీగా సెలవిచ్చారట. దీనితో వినతిపత్రం ఇచ్చిన ఆయన అవాక్కయ్యారు. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవీచ్యుతుడైన రమేశ్‌కుమార్‌ వంతు వచ్చింది. తనను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా నియమించవలసిందిగా గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసుకోండి అని రమేశ్‌కుమార్‌ను రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. తనను కలుసుకోవడానికి సోమవారం ఉదయం 11.30 నిమిషాలకు రమేశ్‌కుమార్‌కు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. అయితే అంతకుముందు జరిగిన ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని రమేశ్‌కుమార్‌ విషయంలో గవర్నర్‌ ఎలా వ్యవహరించబోతున్నారా? అన్న విషయమై అధికార వర్గాల్లో ఆసక్తి ఏర్పడింది. హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ను నియమించవలసి ఉంటుంది. అయితే గవర్నర్‌ ఈ దిశగా చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి ఏమిటి? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. వివాదం హైకోర్టు పరిశీలనలో ఉంది కనుక గవర్నర్‌ సానుకూలంగా వ్యవహరించవచ్చు. అది జరగని పక్షంలో హైకోర్టు జోక్యం చేసుకుని రమేశ్‌కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించవచ్చు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.


ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి సుతరామూ ఇష్టం లేదు కనుక గవర్నర్‌ తీసుకోబోయే చర్యపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా వ్యవహరించినప్పుడు గవర్నర్లు నిస్సహాయంగా ఉండిపోవాల్సిందేనా అంటే, ‘కాదు’ అనే సమాధానం వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార శైలి వల్ల విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఉద్యమాలు, ఆందోళనల ద్వారా ప్రభుత్వాల మెడలు వంచాల్సిన ప్రతిపక్షాలు.. ముఖ్యమంత్రులు జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ వైఖరి కారణంగా నిస్సహాయంగా ఉండిపోతున్నాయి. దీనితో ఉపశమనం కోసం ప్రజలే కాకుండా ప్రతిపక్షాలు సైతం రెండు రాష్ట్రాల్లోనూ హైకోర్టులను ఆశ్రయిస్తున్నాయి. ఈ కారణంగా ఉభయ రాష్ట్రాలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులపై భారంతోపాటు బాధ్యతా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరితో పాటు తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర చౌహాన్‌ కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. ఈ ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులదీ భిన్నమైన నేపథ్యం. జస్టిస్‌ మహేశ్వరికి న్యాయశాస్త్రం పట్ల పూర్తి అవగాహన ఉంది. తీర్పులు ఇచ్చే సమయంలో తన పరిధులను అతిక్రమించరు. అమలులో ఉన్న చట్టాలకు, నిబంధనలకు అనుగుణంగానే ఆయన తీర్పులు ఉంటాయి. ప్రధాన న్యాయమూర్తి కాకముందు కూడా ఆయన ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు సమర్థించిన సందర్భాలే ఎక్కువ. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఆయన ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు సమర్థించడాన్ని చూస్తున్నాం. రమేశ్‌కుమార్‌ ఉదంతంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మూడు పర్యాయాలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ద్వందంగా తిరస్కరించింది.


తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర చౌహాన్‌ విషయానికొస్తే ఆయన విద్యాభాస్యం అంతా విదేశాల్లోనే జరిగింది. దీనితో మానవ హక్కులు, మానవత్వం వంటి విషయాలతోపాటు ప్రజాస్వామిక సూత్రాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు పరిధి దాటినట్టు అనిపించినా తుది తీర్పు వచ్చేసరికి చట్ట పరిధిలోనే వ్యవహరిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా జస్టిస్‌ చౌహాన్‌ చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనం. తమ పరిధిలో లేని అంశమైనప్పటికీ కార్మికులకు న్యాయం జరిపించడానికి ఆయన పరితపించారు. ఒక సందర్భంలో రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసినప్పుడు కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యను సహృదయంతో పరిష్కరించవలసిందిగా కోరారు. సచివాలయ భవనాల కూల్చివేత విషయం కూడా తమ పరిధిలోనిది కాకపోయినా కోవిడ్‌ విస్తరిస్తున్న తరుణంలో కూల్చివేతలు అవసరమా అని ఆలోచించి అడ్డుకోవడానికి ప్రయత్నించారని న్యాయవాదులు విశ్వసిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు క్రియాశీలకంగా వ్యవహరించకపోతే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న తరచుగా వినిపిస్తోందంటే వారు ఎంతటి గురుతర బాధ్యత నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రతిపక్షాలు వ్యతిరేకించడం సహజం. ప్రజా సమస్యల విషయంలో ఆందోళనలు కూడా చేస్తుంటాయి. గతంలో ఇటువంటి సందర్భాల్లో ముఖ్యమంత్రులు ఒక అడుగు వెనక్కి తగ్గి ప్రతిపక్షాలతో మాట కలిపేవారు. ఇప్పుడు తెలుగునాట అటువంటి వాతావరణం లేదు.


ప్రతిపక్షాల ముఖం చూడటానికి కూడా ముఖ్యమంత్రులైన కేసీఆర్‌, జగన్‌రెడ్డి ఇష్టపడటం లేదు. విజ్ఞాపనపత్రాలు ఇద్దామనుకున్నా ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రులు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు. తమ ఫిర్యాదులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు పంపినా పరిష్కరించే స్థితిలో వారు ఉండటం లేదు. ఉభయ రాష్ట్రాలలో కూడా ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు ముఖ్యమంత్రులకు నమ్మినబంట్లుగా మారిపోయారు. విధి నిర్వహణలో స్వతంత్రంగా వ్యవహరించాలి.. వ్యవహరించవచ్చు అనే విషయం మర్చిపోయారు. ముఖ్యమంత్రుల మనసెరిగి మెలగడానికే వారు ఇష్టపడుతున్నారు. ఫలితంగా ప్రధాన ప్రతిపక్షాలకే కాదు ఇతరత్రా బాధితులకు కూడా ఉపశమనం లభించడం లేదు. ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు కాపాడటానికే అన్నట్టుగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వ్యవహరిస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి సలహాదారుగా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీవీ రమేశ్‌ తాజాగా వ్యాఖ్యానించారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టు ఆదేశాలు అంటే హడలిపోయిన నీలం సాహ్ని ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కోర్టు ధిక్కరణకు పాల్పడటానికి సైతం వెనుకాడటం లేదు. ప్రభుత్వ భవనాలకు రంగుల విషయంలో కోర్టు ధిక్కరణకు పాల్పడిన కేసులో ఆమె రెండు రోజులపాటు హైకోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఫీజులు నిర్ణయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శించింది. ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోయిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల్లో కొందరు చివరకు హైకోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందారు.


హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేయగా, సుప్రీంకోర్టు కూడా ప్రైవేటు కళాశాలలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలపై హైకోర్టును ఆశ్రయించడం తెలుగునాట నిత్యకృత్యమైంది. చట్టాలే కాదు రాజ్యాంగం కూడా మాకు అడ్డు రాకూడదు అన్నట్టుగా ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో కరోనా వైరస్‌ విషయంలో కూడా హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు హైకోర్టు ఆదేశాలతో కేసీఆర్‌ ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు తమ బాధ్యత గుర్తెరిగి రాజ్యాంగ విలువలకు లోబడి పరిపాలన సాగిస్తే ప్రతిదానికీ కోర్టులను ఆశ్రయించే పరిస్థితి రాదు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి వైఖరి కారణంగా న్యాయస్థానాలు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ విషయమే తీసుకుందాం. హైకోర్టు తీర్పు తర్వాత జగన్‌ స్థానంలో ఎవరున్నా రమేశ్‌కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించి ఉండేవారు. రమేశ్‌కుమార్‌పై వ్యక్తిగత కక్ష పెంచుకున్న జగన్‌ రెడ్డి న్యాయ స్థానం ఆదేశాలను అమలుచేయడానికి కూడా ఇష్టపడటం లేదు. దీనితో మళ్లీ హైకోర్టు జోక్యం చేసుకుని గవర్నర్‌ను కలవాల్సిందిగా రమేశ్‌కుమార్‌కు సూచించింది. తామిచ్చిన తీర్పును ఎందుకు అమలుచేయడం లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. హైకోర్టు ఆదేశాలతో బంతి గవర్నర్‌ కోర్టులోకి వెళ్లింది. హైకోర్టు తీర్పును అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా గవర్నర్‌ నిర్ణయం తీసుకుంటే కథ సుఖాంతమవుతుంది. లేని పక్షంలో బంతి మళ్లీ హైకోర్టుకు వస్తుంది. అదేమంటే న్యాయస్థానాలను కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారు గానీ, జగన్‌ చేస్తున్న తప్పులను గుర్తించడానికి కొందరు నిరాకరించడం దురదృష్టకరం. 


ఎవరు గొప్ప?

ఈ విషయం అలా ఉంచితే ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ రెడ్డి తీరు గమ్మత్తుగా ఉంటుంది. ఇరువురూ ప్రజలను కూడా కలుసుకోరు. ప్రతిపక్షాల వాసనే పడదు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రగతి భవన్‌లో, ఎప్పుడు ఫామ్‌హౌస్‌లో ఉంటారో తెలియని పరిస్థితి! ఉభయ రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్నప్పటికీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్న ఆలోచన ఇరువురు ముఖ్యమంత్రులకూ రాలేదు. తెలంగాణలో కరోనా పరీక్షలు అతి తక్కువగా జరుగుతున్నాయని దేశం కోడై కూస్తున్నప్పటికీ కేసీఆర్‌కు పట్టడం లేదు. తొలి పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కంటే కేసీఆర్‌ పనితీరు బావుందని ఆంధ్రా ప్రజలు కూడా భావించేవారు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అవుతోంది. కరోనా విషయంలో కాకుండా మరికొన్ని ఇతర విషయాల్లో కూడా కేసీఆర్‌ కంటే జగన్‌ పనితీరు బావుందని తెలంగాణ ప్రజలు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. మొండితనంతోపాటు కక్షపూరితంగా వ్యవహరించడంలో ఇద్దరిదీ ఒకే దారి అయినప్పటికీ, ప్రజలను మాయ చేయడంలో మాత్రం కేసీఆర్‌కంటే జగన్‌ ఒక ఆకు ఎక్కువే చదివారనిపిస్తోంది. జగన్‌రెడ్డి ప్రకటిస్తున్న పథకాలన్నీ మాయామశ్చీంద్రను తలపిస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాపించిన తొలి దశలో భారీగా పరీక్షలు నిర్వహించడం ద్వారా జగన్‌ మంచి మార్కులు కొట్టేశారు.


తెలంగాణలో అతి తక్కువ పరీక్షలు జరుగుతుండగా, ఏపీలో జగన్‌ ఎక్కువ పరీక్షలు చేయిస్తున్నారు అని తెలుగు ప్రజలే కాకుండా, జాతీయ మీడియా కూడా భావించింది. సేకరించిన శాంపిల్స్‌ ఆధారంగా అందరిలో ఇటువంటి అభిప్రాయం ఏర్పడింది. ఆ తర్వాత ఏం జరుగుతున్నది ఎవరూ పట్టించుకోవడం లేదు. సేకరించిన శాంపిల్స్‌లో 40 శాతం పరీక్షలకు నోచుకోవడం లేదు. ఆ తర్వాత కూడా పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్యం అందని పరిస్థితి! ఆస్పత్రిలో బెడ్‌ కావాలంటే పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణలో ఇటువంటి పరిస్థితి అంతగా లేదు కానీ ఏపీలో అంతా బాగానే ఉందని నమ్మిస్తున్నారు. భారీగా శాంపిల్స్‌ను సేకరించడం అనే చర్య ద్వారా కేసీఆర్‌ కంటే తానే బాగా పనిచేస్తున్నాను అన్న పేరును జగన్‌ తెచ్చుకున్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో జగన్‌ చేస్తున్న హడావుడినే తీసుకుందాం. తొలి దశలో ఆరు జిల్లాల్లో 2,200 జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నామని జగన్‌ ప్రకటించారు. ఇది చూసి మనకు ఇన్ని జబ్బులున్నాయా అన్న సందేహం కలిగి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించగా, అబ్బే అవన్నీ జబ్బులు కాదు ప్రొసీజర్లు మాత్రమే అని వివరించారు. ప్రొసీజర్‌ అంటే... ఎవరికైనా చేతికీ, కాలికీ దెబ్బతగిలిందనుకోండి. గాయం మాత్రమే అయితే కట్టు కట్టి మందులిస్తారు. అదొక ప్రొసీజర్‌ కింద లెక్క వేస్తారు.


కాలి వేలో, చేతి వేలో విరిగిందనుకుంటే అది చిన్నదా పెద్దదా, కట్టు సరిపోతుందా, అయితే ఏ తరహా కట్టు? సర్జరీ చేయాల్సి వస్తే ఏ తరహా సర్జరీ? ఇలా ప్రొసీజర్లు ఉంటాయి. కాలు, చేయి విరగడం ఒక్కటే అయినా ప్రొసీజర్లను బట్టి వాటన్నింటినీ ఈ 2,200ల్లో కలిపేశారు. అంతేగానీ కొత్త రోగాలు కాదు. ఈ సూక్ష్మం తెలియని ప్రజలు మాత్రం రెండు వేల రెండు వందల జబ్బులను జగనన్న ఆరోగ్యశ్రీలో చేర్చారు అని సంబరపడిపోతున్నారు. మిగతా సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. అమలులో ఉన్న పథకాలను రద్దు చేసి కొత్తవాటికి రూపకల్పన చేసి నగదు బదిలీ చేస్తున్నారు. దీనితో మా ఖాతాలో అంత డబ్బు పడింది.. ఇంత డబ్బు పడింది అని జనం మురిసిపోకుండా ఎలా ఉంటారు? దీని వెనుక ఉన్న మాయను మాత్రం గుర్తించలేకపోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఇలాంటి మాయలనే ప్రదర్శించారు. ప్రతి దానినీ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. పత్రికలలో భారీగా ప్రకటనలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ట్రిక్కుల పట్ల మొహం మొత్తిందో ఏమో కానీ ప్రచారార్భాటానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. గతంలో కేసీఆర్‌ అనుసరించిన మోడల్‌ను గమనించిన జగన్‌ రెడ్డి ఇప్పుడు దాన్ని మరింత విస్తృతపరిచి అమలుచేస్తున్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో రెండు పర్యాయాలు భారీ ప్రకటనలు జారీ చేశారు. ‘చారణా కోడికి బారణా మసాలా’ అన్నట్టుగా ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా కేసీఆర్‌ కంటే జగన్‌ పనితీరు మెరుగ్గా ఉందన్న అభిప్రాయం విస్తరిస్తోంది. 


కాడి పారేశారు!

కరోనా వైరస్‌ సోకుతున్నవారి సంఖ్య తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉంటోంది. మరణాలు కూడా భారీగానే ఉంటున్నాయి. గత వారం రోజుల్లోనే ఏపీలో 200 మంది వరకు మృతి చెందారు. తెలంగాణలో ఇంత మంది చనిపోవడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏకంగా పెద్ద జియ్యంగార్‌కే కరోనా వైరస్‌ సోకింది. దీనితో స్వామివారికి పూజా కైంకర్యాలు ఎవరు ప్రారంభించాలి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పెద్ద జియ్యంగార్‌ కంటే ముందు పలువురు పూజారులకు వైరస్‌ సోకింది. అయినా భక్తుల దర్శనాలు కొనసాగిస్తున్నామని పాలకమండలి ప్రకటించింది. నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు కొందరికి రెండు వారాల క్రితమే కరోనా వైరస్‌ సోకింది. అప్పుడు ఆ విషయం దాచిపెట్టడంతో ఇప్పుడు పెద్ద జియ్యంగార్‌కు సైతం వైరస్‌ సోకింది. కేసులు, మరణాల విషయంలో ఉభయ రాష్ట్రాల్లో గోప్యత పాటించడం వల్లనే ఇప్పుడు వైరస్‌ కమ్ముకొచ్చింది. వివరాలు తెలిసినా వాటిని ప్రచురించలేని స్థితిలోకి మీడియాను నెట్టేశారు. అదేమంటే కేసులు పెడతామంటున్నారు. ఈ ధోరణి వల్ల నష్టపోతున్నది ప్రజలే. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనంటూ ఇరువురు ముఖ్యమంత్రులూ ప్రకటించి చేతులు దులుపుకొన్నారు. ప్రారంభంలో కరోనాను అరికట్టే చాంపియన్‌గా ప్రధాని మోదీ ముందుకొచ్చారు. ఇప్పుడు ఆ బాధ్యతను ముఖ్యమంత్రులకు వదిలేసి పక్కకు తప్పుకొన్నారు. ముఖ్యమంత్రులు కూడా చేతులెత్తేసి అధికారుల నెత్తిన ఆ బాధ్యత పెట్టారు. వైరస్‌ విస్తరిస్తున్నకొద్దీ అధికారులు కూడా బాధ్యతల నుంచి పక్కకు జరిగి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి అని ప్రజలపైనే భారం వేశారు. వాస్తవానికి ఈ సమస్య మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచమంతటా ఉంది. కొన్ని దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నిరోధించాయి.


మన దేశంలో కేరళ వంటి ఒకటి రెండు రాష్ట్రాలు వైద్య సదుపాయాలు పెంచుతూ వచ్చాయి. ఫలితంగా అక్కడ వైరస్‌ సోకినా చికిత్స కోసం అల్లాడిపోవాల్సిన అవసరం లేదు. వైరస్‌ వ్యాప్తి ఇంకా ఎక్కువ అవుతుందని కేసీఆర్‌, జగన్‌ కూడా తాజాగా ప్రకటించారు. వైరస్‌ విస్తరించే విషయం నిజమే! మరి ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయన్నదే ప్రశ్న. కరోనా బాధితులతో ఆస్పత్రులు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. ఎవరైనా డిశ్చార్జ్‌ అయితే గానీ బెడ్స్‌ సమకూర్చలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. హైదరాబాద్‌లో బోలెడన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఉండటం వల్ల బెడ్లకు కొరత అంతగా లేదు. ఉపద్రవం ముంచుకొస్తే ప్రభుత్వం తమను ఆదుకుంటుంది అన్న భరోసా కల్పించాల్సింది ప్రభుత్వాలే కదా! తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయి, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మాయా మశ్చీంద్ర పథకాల రూపకల్పనలో బిజీగా ఉంటే బాధితులకు దిక్కెవరు? ఇలాంటి విషయాలలో కూడా న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి రావడం ప్రభుత్వాలకు తలవంపు కాదా? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పథకాలతో ప్రజలను మభ్య పెడుతూ ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన వాక్‌ స్వాతంత్ర్యాన్ని కూడా హరించడానికి వెనుకాడటం లేదు. ఈ విషయంలో కేసీఆర్‌ను తలదన్నేలా జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలకు చెందినవారితోపాటు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. కేసులు ఎదుర్కొంటున్న వారిని వివిధ పోలీస్‌స్టేషన్లకు తిప్పుతూ హింసిస్తున్నారు. గతంలో కరడుగట్టిన నేరస్తులను, తీవ్రవాదులను ఇలా పోలీస్‌స్టేషన్లు మార్చి మార్చి తిప్పుతూ మానసికంగా వేధించేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు కూడా ఈ దుస్థితి పట్టిస్తున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విషయంలో సంబంధిత అధికారి అమానవీయంగా వ్యవహరించారు అని హైకోర్టు సైతం వ్యాఖ్యానించింది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మీరేమీ భయపడవద్దు. మీకు అండగా ఉంటాను అని తన పార్టీ తరఫున అనుచిత వ్యాఖ్యలను పోస్టు చేస్తున్న వారికి భరోసా ఇచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతరులపై కేసులు పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారు? ప్రజలు అధికారం ఇచ్చింది గిట్టనివారిని అణచివేయడానికి కాదు. ప్రజలకు మంచి చేసి పది కాలాలపాటు గుర్తుండేలా అధికారాన్ని వినియోగించాలి.


కాదంటే శంకరగిరి మాన్యాలే!

ఇక జిమ్మిక్కులతో ప్రస్తుతానికి ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిలోని మరో కోణాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన కొత్తలో కీలకంగా వ్యవహరించిన అధికారులు ఒక్కొక్కరినీ శంకరగిరి మాన్యాలకు పంపుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికల కమిషన్‌ నియమించిన ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఏం గతి పట్టించారో చూశాం. బదిలీ అయిన పోస్టులో చేరకుండానే ఆయన పదవీ విరమణ చేశారు. ఇప్పుడు రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీవీ రమేశ్‌ వంతు వచ్చింది. కేంద్ర సర్కార్‌ నుంచి వచ్చిన రమేశ్‌, జగన్‌ ముఖ్యమంత్రి కాగానే సీఎంవోలో చేరారు. తర్వాత పదవీ విరమణ చేసినా సలహాదారుడిగా నియమితులయ్యారు. దళిత వర్గానికి చెందిన రమేశ్‌ పర్యవేక్షిస్తున్న శాఖలను ఆయన నుంచి హఠాత్తుగా తొలగించి డమ్మీని చేశారు. దీనితో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం వైపు వెళ్లడం లేదు. రమేశ్‌ అన్నా అంటూ జగన్‌ పిలుచుకున్న అధికారికి ఎదురైన పరిస్థితి ఇది. వైసీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ‘పార్టీ వర్థిల్లాలి’ అని ట్వీట్‌ చేసిన అధికారి పీవీ రమేశ్‌ పరిస్థితి ఇది! మరో అధికారి అజేయ కల్లం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేసిన ఆయన పదవీ విరమణ తర్వాత జగన్‌కు అనుకూలంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ప్రధాన సలహాదారుడిగా నియమితుడైన అజేయ కల్లంకు కొంత కాలం ప్రాధాన్యం లభించింది. తాజాగా ఆయనను కూడా డంప్‌లో పడేసినట్టు వార్తలొస్తున్నాయి. సర్వీసులో ఉన్న ఐపీఎస్‌ అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌ విషయం తీసుకుందాం. రాజశేఖర్‌రెడ్డికి వీరభక్తుడైన మాదిరెడ్డి ప్రతాప్‌ ఆర్టీసీ ఎండీగా తన కార్యాలయంలో వైఎస్‌ జయంతిని నిర్వహించి వైఎస్‌పై భక్తిని చాటుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆయనను హఠాత్తుగా బదిలీ చేసింది. దీనితో ఆయన విలేకరుల సమావేశంలో తన బదిలీకి కారణాలు తెలియవంటూ, రాజశేఖర్‌రెడ్డి ఉండి ఉంటే రాష్ట్రం కూడా విడిపోయి ఉండేది కాదు అంటూ వ్యాఖ్యానించారు. దీనితోపాటు ప్రభుత్వంపై కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆయనకు సంజాయిషీ నోటీసు ఇవ్వడంతోపాటు ఇచ్చిన పోస్టింగ్‌ను కూడా రద్దు చేశారు. దీనితో జగన్‌ హిట్‌లిస్టులో ఉన్న తదుపరి అధికారి ఎవరో అని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల సేవలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు తరిస్తున్నారంటూ పీవీ రమేశ్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. ఈ కారణంగా మిగిలి ఉన్న సలహాదారుడి పదవి కూడా ఆయనకు ఊడవచ్చు!

ఆర్కే

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Advertisement