బీపీసీఎల్‌ ఎవరి చేతికో!

ABN , First Publish Date - 2020-11-16T06:22:13+05:30 IST

ప్రభుత్వ రంగంలోని భారత్‌ పెట్రోలియం కంపెనీ కార్పొరేషన్‌ లిమిటెట్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది. ఈ కంపెనీ ఈక్విటీలో ప్రభుత్వానికి ఉన్న 52.98 శాతం వాటా కొనేందుకు ఆసక్తి ఉన్న సంస్థలు...

బీపీసీఎల్‌ ఎవరి చేతికో!

  • అందరి చూపు రిలయన్స్‌పైనే
  • బిడ్డింగ్‌కు నేడు చివరి రోజు 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని భారత్‌ పెట్రోలియం కంపెనీ కార్పొరేషన్‌ లిమిటెట్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది. ఈ కంపెనీ ఈక్విటీలో ప్రభుత్వానికి ఉన్న 52.98 శాతం వాటా కొనేందుకు ఆసక్తి ఉన్న సంస్థలు సోమవారం లోగా తమ ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ను సమర్పించాల్సి ఉంది. కొవిడ్‌-19 నేపథ్యంలో ఈ బిడ్స్‌ తుది గడువును ప్రభుత్వం ఇప్పటికే నాలుగుసార్లు పొడిగించింది. ఇక ఈ గడువును  పొడిగించే ప్రసక్తే లేదని అధికార వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో బీపీసీఎల్‌ ఈక్విటీలో ప్రభుత్వానికి ఉన్న 52.98  శాతం వాటా కొనేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలు సోమవారంలోగానే తమ బిడ్‌ను సమర్పించాలి.


రూ.74,000 కోట్లు 

బీపీసీఎల్‌ ఈక్విటీలో తన 52.98 శాతం వాటా విక్ర యం ద్వారా 1,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.74,400 కోట్లు) వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రస్తుతం కంపెనీ షేరు మార్కెట్‌ ధర ప్రకారం చూస్తే ఈ వాటా విలువ రూ.47,430 కోట్లు మాత్రమే. దీనికి తోడు ప్రభుత్వ వాటా కొనే సంస్థ ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా మరో 26 శాతం వాటాను మార్కెట్‌ నుంచి కొనాల్సి ఉంటుంది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం చూస్తే ఇందుకు మరో రూ.23,276 కోట్ల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరామ్కో, బ్రిటిష్‌ పెట్రోలియం, ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ వంటి విదేశీ ఆయిల్‌ కంపెనీలేవీ ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. 


‘రిలయన్స్‌’పైనే నజర్‌

బహుళ జాతి ఆయిల్‌ కంపెనీలు ఏవీ కూడా బీపీసీఎల్‌పై ఆసక్తి చూపకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌)పై పడింది. అయితే రిలయన్స్‌ ఇప్పటి వరకు దీనిపై నోరు మెదప లేదు. కాగా ప్రభుత్వ రంగంలోని ఐఓసీ, బీపీసీఎల్‌ మాజీ చైర్మన్లు ఇటీవల రిలయన్స్‌ పెట్రోలియంలో చేరారు. బీపీసీఎల్‌ కొనుగోలు కోసమే రిలయన్స్‌ వీరిద్దరిని తీసుకుందని ప్రచారం జరుగుతోంది. బీపీసీఎల్‌కు కొచ్చిన్‌, ముంబై, మధ్యప్రదేశ్‌లోని బినాలో మూడు రిఫైనరీలు ఉన్నాయి. దేశీయ పెట్రో ఉత్పత్తుల రిటైల్‌ మార్కెట్లో కంపెనీకి 22 శాతం వాటా ఉంది. రిఫైనరీ ప్రాజెక్టులు పెద్ద ఆకరణీయంగా లేకపోయినా, మార్కెట్‌ వాటాను దృష్టిలో ఉంచుకుని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తప్పకుండా బీపీసీఎల్‌ ఈక్విటీలో ప్రభుత్వ వాటా కోసం బిడ్‌ సమర్పిస్తుందని భావిస్తున్నారు. 


Updated Date - 2020-11-16T06:22:13+05:30 IST