రుణమాఫీకి బ్రేక్‌!

ABN , First Publish Date - 2020-03-24T08:54:50+05:30 IST

రుణమాఫీ ప్రక్రియకు కొద్దిరోజులు బ్రేక్‌ పడే అవకాశాలు ఉన్నాయి. కరోనా ప్రభావంతో రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ అయిన పరిస్థితుల్లో.. రుణమాఫీ అమలులో

రుణమాఫీకి బ్రేక్‌!

లాక్‌డౌన్‌ కారణంగా అమలుకు ఆలస్యం

ఎస్‌ఎల్‌బీసీకి చేరిన 35 బ్యాంకుల వివరాలు

ఇంకా 10 బ్యాంకుల నుంచి డేటా పెండింగ్‌

రూ.25 వేల లోపున్నవారికీ ఈ నెలలో కష్టమే


హైదరాబాద్‌, మార్చి23 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ ప్రక్రియకు కొద్దిరోజులు బ్రేక్‌ పడే అవకాశాలు ఉన్నాయి. కరోనా ప్రభావంతో రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ అయిన పరిస్థితుల్లో.. రుణమాఫీ అమలులో జాప్యం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. రూ.25 వేల లోపు బకాయిలు ఉన్న రైతులకు మార్చి 31 లోపు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది అమలయ్యే పరిస్థితి కనిపించటంలేదు. రాష్ట్రంలో మొత్తం 45 బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇచ్చాయి. బ్రాంచిల వారిగా వివరాలు సేకరించి, బ్యాంకుల వారిగా వివరాలు సమర్పించాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎ్‌సఎల్‌బీసీ) నుంచి ఆదేశాలు క్షేత్రస్థాయికి వెళ్లాయి. అయితే ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా డేటా సేకరించటంలో జాప్యం జరుగుతోంది.


మొత్తం 45 బ్యాంకులకు గాను సోమవారం నాటికి 35 బ్యాంకుల వివరాలు మాత్రమే ఎస్‌ఎల్‌బీసికి అందాయి. ఇంకా 10 బ్యాంకుల నుంచి డేటా అందాల్సి ఉంది. మొదటి విడతలో రూ. 25 వేల వరకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ, పూర్తి వివరాలు లేకపోవటంతో.. డేటాను క్రోడీకరించటం కష్టతరం అవుతోంది. ఈనెల 17న రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,210 కోట్లకు బీఆర్వో కూడా విడుదల చేసింది. రూ.25 వేల లోపు బకాయిలు ఉన్న రైతులు రాష్ట్రంలో 5.83 లక్షల మంది ఉన్నారు. వీరికి ఏకకాలంలో రుణమాఫీ చేయటానికి ఆదేశాలు వచ్చినా.. కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.  

Updated Date - 2020-03-24T08:54:50+05:30 IST