సైనా, శ్రీకాంత్‌కు కష్టమేనా..?

ABN , First Publish Date - 2020-05-28T08:50:15+05:30 IST

ఈ ఏడాది బ్యాడ్మింటన్‌ టోర్నీల రీషెడ్యూల్‌ క్యాలెండర్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రపంచ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) తాజాగా షట్లర్లకు ఆమోదయోగ్యమైన ...

సైనా, శ్రీకాంత్‌కు కష్టమేనా..?

‘ఒలింపిక్‌ అర్హత’ విధానం వచ్చే ఏడాది నుంచి

బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటన


న్యూఢిల్లీ: ఈ ఏడాది బ్యాడ్మింటన్‌ టోర్నీల రీషెడ్యూల్‌ క్యాలెండర్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రపంచ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) తాజాగా షట్లర్లకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 28తో ముగిసిన ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌ పీరియడ్‌ (అర్హత సమ యం) వచ్చే ఏడాది ఆరంభం నుంచి ప్రారంభం కానుందని బుధవారం ప్రకటించింది. అంటే.. 2021 ఒకటో వారం నుంచి 17వ వారం మధ్య సమయాన్ని టోక్యో ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌ పీరియడ్‌గా గుర్తించనున్నట్టు స్పష్టం చేసింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు నుంచి రీషెడ్యూల్‌ చేసిన టోర్నీలను విశ్వక్రీడల అర్హతకు లెక్కలోకి తీసుకోరు. వచ్చే సంవత్సరం జనవరి ఒకటి నుంచి వరుసగా 17వ వారం మధ్యలో జరిగే ఎంపిక చేసిన టోర్నీల్లో ప్రదర్శన ఆధారంగా షట్లర్లకు టోక్యో బెర్త్‌ దక్కనుంది. అయితే, ఈ ఏడాది మార్చి 13 వరకు అంటే టోర్నీల సస్పెన్షన్‌కు ముందున్న ఆయా షట్లర్ల ఒలింపిక్‌ ర్యాంకింగ్‌ పాయింట్లను కూడా క్వాలిఫికేషన్‌ అంచనాలోకి తీసుకోనున్నట్టు బీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది. దీని ప్రకారం.. 2019 ఏప్రిల్‌ 29 నుంచి 2020 ఏప్రిల్‌ 26 మధ్య జరిగిన క్వాలిఫికేషన్‌ టోర్నీల్లో పోటీపడ్డ షట్లర్ల ర్యాంకింగ్‌ పాయింట్లు కూడా అర్హత పరిధిలోకి వస్తాయి. ‘క్వాలిఫయింగ్‌ పీరియడ్‌లోకి వచ్చే అర్హత టోర్నీలన్నీ 2021లో 17వ వారం లోపు పూర్తయి ఉండాలి. ఈలోపు టోర్నీల్లో ప్రదర్శనను గమనంలోకి తీసుకొని టోక్యో క్రీడలకు అర్హతను లెక్కిస్తారు’ అని బీడబ్ల్యూఎఫ్‌ స్పష్టం చేసింది. 


అవకాశాలు అంతంతే..

ఇప్పటిదాకా ఉన్న ఒలింపిక్‌ ర్యాంకింగ్‌ పాయింట్లను కూడా పరిగణనలోకి తీసుకోనుండడంతో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుతోపాటు సాయి ప్రణీత్‌, డబుల్స్‌ ఏస్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టిలకు ఒలింపిక్‌ అర్హత మార్గం మరింత సులువు కానుంది. వీరంతా ఇదివరకే ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌కు అత్యంత సమీపంలో ఉన్నారు. దీంతో వచ్చే ఏడాది ఎంపిక చేసిన ఒకట్రెండు టోర్నీల్లో రాణించినా టోక్యో బెర్త్‌ సులువుగా దక్కనుంది. ఇక.. సీనియర్లు సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్‌లకు ఒలింపిక్‌ దారులు మూసుకుపోయినట్టే. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో టోర్నీల షెడ్యూల్‌ సస్పెండయ్యే సమయానికి సైనా, శ్రీకాంత్‌ ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌ మార్క్‌ పాయింట్లకు ఆమడదూరంలో ఉన్నారు. ఈ ఇద్దరూ వచ్చే ఏడాది అర్హత కోసం ఎంపిక చేసిన అన్ని టోర్నీల్లోనూ అద్భుత ప్రదర్శన చేస్తేనే టోక్యో అవకాశాలుంటాయి.  

Updated Date - 2020-05-28T08:50:15+05:30 IST