అనగనగా ఒక కేఫ్‌!

ABN , First Publish Date - 2020-11-23T05:38:47+05:30 IST

మహిళలపై ఆంక్షలు ఉన్న దేశాలలో యెమన్‌ ఒకటి. అలాంటి చోట వారికి స్వేచ్ఛను ఇచ్చేందుకు చేసే చిన్న ప్రయత్నమైనా గొప్ప విషయమే మరి. ఆ ప్రయత్నమే చేసింది ఉమ్‌ ఫెరాస్‌ అనే మహిళ. తన తోటి మహిళలు, అమ్మాయిలు కాసేపైనా మనస్ఫూర్తిగా కబుర్లు చెప్పుకొనేందుకు ఒక కాఫీ దుకాణం తెరిచారు...

అనగనగా ఒక కేఫ్‌!

మహిళలపై ఆంక్షలు ఉన్న దేశాలలో యెమన్‌ ఒకటి. అలాంటి చోట వారికి స్వేచ్ఛను ఇచ్చేందుకు చేసే చిన్న ప్రయత్నమైనా గొప్ప విషయమే మరి. ఆ ప్రయత్నమే చేసింది ఉమ్‌ ఫెరాస్‌ అనే మహిళ. తన తోటి మహిళలు, అమ్మాయిలు కాసేపైనా మనస్ఫూర్తిగా కబుర్లు చెప్పుకొనేందుకు ఒక కాఫీ దుకాణం తెరిచారు. అక్కడి మహిళల పాలిట వరంగా మారిన ‘మార్నింగ్‌ ఐకాన్‌ కేఫ్‌’ విశేషాలివి...


అరేబియన్‌ ద్వీపకల్పంలో రెండో పెద్ద దేశమైన యెమన్‌ ఆరేళ్ల అంతర్యుద్ధం వల్ల మొత్తం తన స్వరూపాన్నే కోల్పోయింది. నిత్యం ఫిరంగుల మోత, హింస వల్ల దెబ్బతిన్న చాలా ప్రాంతాల్లో మరిబ్‌ కూడా ఒకటి. అలాంటి చోట స్వేచ్ఛ అనే మాట ఎత్తడమంటే ఒకరకంగా సాహసమే. ఆ ప్రాంతంలో ఒక మహిళ సొంతంగా వ్యాపారం చేయడం అంత సులువు కాదు. కానీ ఏడాది కాలంగా తన కేఫ్‌ను విజయవంతంగా నడిపిస్తూ ఫెరాస్‌ మహిళల సాధికారత, గౌరవప్రదమైన జీవితానికి దారులు వేస్తున్నారు. ‘‘మా దేశంలో మహిళలు ఒకచోట గుమికూడే స్వేచ్ఛ లేదు. వారికంటూ ఒక ప్రత్యేకమైన చోటు లేదు. అప్పుడే నాకు ఇక్కడి మహిళలు కప్పు కాఫీ తాగుతూ తమ సమస్యలు తోటివాళ్లతో పంచుకునేందుకు వారికంటూ ఒక వేదిక ఉంటే బాగుండనే ఆలోచన వచ్చింది. అలా గత ఏడాది ఏప్రిల్‌లో ‘మార్నింగ్‌ ఐకాన్‌ కేఫ్‌’ను మొదలెట్టాను. మహిళల స్వేచ్ఛను దృష్టిలో ఉంచుకొని మా కేఫ్‌లో ఆడవాళ్లనే పనిలో పెట్టుకున్నాను’’ అని చెబుతారు ఫెరాస్‌. ఈ కేఫ్‌లోకి తల్లులు తమ చిన్నపిల్లలను వెంట తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. 


మహిళల సత్తా చాటేందుకు..

మరిబ్‌లోని సాంప్రదాయవాదులకు ఆడవాళ్లు గడప దాటి బయటకు వెళ్లి ఉద్యోగాలు చేయడం గిట్టలేదు. ఎందుకంటే ఫెరాస్‌ చేస్తున్న పని వారికి కొత్తగా అనిపించింది. ‘‘కేఫ్‌ అనగానే ఏవో చెడు ఆలోచనలు చేస్తుంటారు చాలామంది. అయితే ప్రతి ఆలోచనను వ్యతిరేకించే వాళ్లు ఉన్నట్టే సమర్థించే వాళ్లూ ఉంటారు’’ అంటున్న ఫెరాస్‌ మహిళలు సొంతంగా కంపెనీ నడపగలరనే సందేశాన్ని గట్టిగా చాటాలని అనుకుంటున్నారు. కేఫ్‌లో అమ్మకానికి ఉంచే పదార్థాలలో చాలా వాటిని ఆమె  పొరుగు పట్టణాల నుంచి తెప్పించుకుంటారు. అయితే పెరుగుతున్న ధరలు, కరెన్సీ విలువలో హెచ్చుతగ్గులున్న ప్రస్తుత సమయంలో నాణ్యమైన ఉత్పత్తులను అందించడం, కేఫ్‌ను నడిపించడం పెద్ద సవాల్‌గా మారింది అంటారామె. ఎంత కష్టమైనప్పటికీ తమ ప్రాంత మహిళలు, అమ్మాయిల కోసం ఫెరాస్‌ తన కేఫ్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలనే ఆలోచనతో ఉన్నారు.

Updated Date - 2020-11-23T05:38:47+05:30 IST