దళిత బంధు అధికారులకు మంగళహారతులతో స్వాగతం

ABN , First Publish Date - 2021-08-28T01:02:48+05:30 IST

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకం సర్వే శుక్రవారం ప్రారంభమైంది.

దళిత బంధు అధికారులకు మంగళహారతులతో స్వాగతం

హుజూరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకం సర్వే శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు పథకం ఫైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ను ఎంపిక చేశారు. ఇందు కోసం దళితవాడల్లో ఇంటింటి సర్వే చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆదేశాల మేరకు ఆర్డీవో సీహెచ్‌ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. మొదట హుజూరాబాద్‌ పట్టణంలోని మామిడ్లవాడలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, ఆర్డీవో రవీందర్‌రెడ్డిలకు దళిత మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 491మంది వివిధ శాఖల ఉద్యోగులు సర్వేలో పాల్గొంటున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలు ఉన్నాయి. నియోజకవర్గంలో 106గ్రామపంచాయతీలు, రెండు మున్సిపా లిటీలున్నాయి. 130మంది స్పెషలాధికారులు, 130మంది సపోర్టింగ్‌ స్పెషలాఫీసర్లు, 31మంది క్లస్టర్‌ అధికారులు, 130మంది పంచాయతీ కార్యదర్శులు, 60మంది బిల్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ సిబ్బంది, ప్రతి మండలానికి ఇద్దరు కో-ఆర్డినేటర్లు, ప్రతి టీమ్‌కు ఒక పోలీస్‌, ఒక బ్యాంకు అధికారిని ఏర్పాటు చేశారు. మొత్తం 48అంశాలతో దళిత కుటుంబాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఐదు రోజుల్లో సర్వే పూర్తి చేస్తారని ఆర్డీవో రవీందర్‌రెడ్డి విలేకరులకు తెలిపారు.

Updated Date - 2021-08-28T01:02:48+05:30 IST