Advertisement
Advertisement
Abn logo
Advertisement

284 పరుగుల విజయ లక్ష్యం న్యూజిలాండ్‌కు చిన్నదేనా.. గత రికార్డులు ఏం చెబుతున్నాయి?

కాన్పూరు: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ను 234 పరుగుల వద్ద ముగించింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యంతో కలుపుకుంటే రహానే సేనకు 283 పరుగుల లీడ్ లభించింది. నిజానికి నాలుగో రోజు ఆట ముగియడానికి మరో నాలుగు ఓవర్ల ముందే భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ ఓవర్లు కూడా ఆడి ఉంటే ఇండియా ఆధిక్యం 300 పరుగులు దాటి ఉండేది. 


అయితే, ఆట ముగియడానికి ముందు కివీస్‌ను ఆడించడం వెనక ఓ వ్యూహం దాగి ఉంది. అప్పటికే పూర్తిగా అలసిపోయి ఉన్న న్యూజిలాండ్‌కు బ్యాటింగ్ అవకాశం ఇవ్వడం ద్వారా వికెట్లు రాబట్టొచ్చనేది భారత్ వ్యూహం. ఒకటో, రెండో వికెట్లు కనుక నేల కూల్చితే చివరి రోజు క్రీజులోకి రావడంతోనే ఆ జట్టుపై ఒత్తిడి ఉంటుంది. ఫలితంగా త్వరత్వరగా వికెట్లు కోల్పోయే అవకాశం ఉంది. దీనికితోడు భారత బౌలర్లు మంచి ఊపుమీద ఉండడం ఇందుకు కలిసి వచ్చే అంశమని రహానే సేన భావిస్తోంది. 


ఇక, న్యూజిలాండ్ వైపు నుంచి ఆలోచిస్తే, ఆ జట్టుకు మంచి చేజింగ్ అనుభవం ఉంది. ఇది విలియమ్సన్ సేనకు కలిసివచ్చే అంశం. 1993/94లో క్రైస్ట్‌చర్చ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 324 పరుగుల విజయ లక్ష్యాన్ని కివీస్ సునాయాసంగా ఛేదించింది. 2008/09లో చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో 317 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఊదిపడేసి విజయం సాధించింది. 1984/85లో పాకిస్థాన్‌తో డునెడిన్‌లో జరిగిన మ్యాచ్‌లో 278 పరుగుల విజయ లక్ష్యాన్ని కూడా అలవోకగా అందుకుంది.


దీంతో ఇప్పుడు భారత్ నిర్దేశించిన 284 పరుగుల విజయ లక్ష్యం కూడా దాని పరిధిలోనే ఉంది కాబట్టి చివరి రోజు మ్యాచ్ ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. అయితే, క్రికెట్‌లో రికార్డులు తారుమారు కావడం సాధారణమే కాబట్టి రేపటి మ్యాచ్‌లో నెగ్గి కివీస్ తన గత రికార్డులను కాచుకుంటుందా? లేదంటే, కివీస్‌ను ఓడించడం ద్వారా ఆ రికార్డుకు భారత్ బ్రేక్ వేస్తుందా? చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.


Advertisement
Advertisement