ప్రజలు మరో మూడేళ్లు భరించగలరా?
ABN , First Publish Date - 2021-06-02T06:27:09+05:30 IST
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలానికి మే 30వ తేదీతో రెండేళ్లు అంటే 830 రోజులు గడిచిపోయాయి...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలానికి మే 30వ తేదీతో రెండేళ్లు అంటే 830 రోజులు గడిచిపోయాయి. ఒక ప్రభుత్వ పరిపాలనలోని మంచి చెడులను బేరీజు వేసేందుకు ప్రజలకు రెండేళ్లు సరిపోతాయి. ఈ రెండేళ్ళను బట్టి మిగిలిన మూడేళ్ళ పరిపాలన ఏ రీతిగా సాగనున్నదో కూడా ఒక అంచనాకు రావొచ్చు. ముఖ్యమంత్రి తన ప్రమాణ స్వీకారం సందర్భంగా కేవలం ఆరునెలల్లో ఒక మంచి ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందేలా పని చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆయన ‘మంచి’ అనే పదానికి చాలా దూరంగానే ఉంటున్నారు. రాష్ట్రంలో ఆ తొమ్మిది నవరత్నాల పథకాలు తప్ప ఏదీ కనిపించటం లేదు, వినిపించటం లేదు. ప్రతిపక్ష పార్టీ నేతగా ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ ఆయన మర్చిపోయి ఉండవచ్చు. ప్రజలు మాత్రం మర్చిపోరు, మరిచిపోలేరు.
ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం అని శపథం చేశారు. కేంద్రం దగ్గరికి వెళ్లి సీఎం గారే తల దించుకొని వచ్చారు. పోలవరంలో అవినీతి తప్ప, తట్టెడు కాంక్రీటు వేయలేదని ఆరోపణలు చేశారు. ఈ రెండేళ్ల కాలంలో గత ప్రభుత్వం చేపట్టిన 70శాతం ప్రాజెక్టు పనులు తప్ప పోలవరంలో పెద్దగా జరిగిందేమీ లేదు. కేవలం 8శాతం పనులతో సరిపెట్టారు. పోలవరం అంచనాలు పెద్ద ఎత్తున పెంచారు. కేంద్రం నుంచి ప్రాజెక్టు డబ్బులు రాబట్టడంలో విఫలమయ్యారు. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు తదితర విషయాల జోలికి వెళ్లటం లేదు. ప్రజా రాజధాని అమరావతినే రాజధానిగా కొనసాగిస్తానని, అక్కడే ఇల్లు, కార్యాలయం కట్టుకున్నానని నమ్మబలికి రైతుల భూములతో ఏర్పాటైన అమరావతికే ఎసరు పెట్టారు. మూడు రాజధానులు అనే వింతవాదాన్ని ముందుకు తెచ్చి రాజధాని రైతులను రోడ్డున పడేశారు. కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిర్మొహమాటంగా ప్రకటిస్తే, కేంద్రం దగ్గర ప్రైవేటీకరణకు చేతులు కలిపి, కార్మికులతో రాజకీయ ఉద్యమాలకు తెరలేపారు.
ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులపై కక్ష కట్టారు. అచ్చంనాయుడు, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్, ధూళిపాళ్ళ నరేంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి, బీసీ జనార్దన్ లను అరెస్టు చేసి జైలుకు పంపారు. వీడియో మార్ఫింగ్ చేశారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుకు, అసైన్డ్ ల్యాండ్స్ ఆక్రమించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు నోటీసులిచ్చారు. స్వపార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైలుకు పంపించారు. సుప్రీంకోర్టు జోక్యంతో రఘురామ క్షేమంగా బతికి బయటపడ్డారు. సిపిఐ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ నాయకులను సైతం గృహనిర్బంధం చేశారు. దళిత బహుజన కులాలపై దాడులు సంగతి మహా దారుణం. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, చిత్తూరు మాజీ జడ్జి రామకృష్ణ, అనితా రాణి వంటి వారిని వేధించారు. నంద్యాల మహాలక్ష్మి, పులివెందుల నాగమ్మ, గుంటూరు భూక్యా రమా, ఓం ప్రకాష్ విగత జీవులయ్యారు. శిరోముండనం కేసులో వరప్రసాదు రాష్ట్రపతికి లేఖ రాసినా జవాబు చెప్పలేదు.
ప్రశాంతంగా నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలపై పదే పదే కోర్టుకి వెళ్లి ప్రజాస్వామిక ప్రక్రియను అపహాస్యం చేశారు. కోర్టుల్లో చివాట్లు పడ్డారు. న్యాయస్థానాలపై, న్యాయమూర్తులపై కుల ముద్ర వేసేందుకు వెనకాడలేదు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేసిన వారిని అరెస్టు చేశారు. ఆఖరికి ఏబీఎన్, టీవీ 5 మీడియా ఛానళ్లపై కూడా 124ఎ రాజద్రోహం కేసులు పెట్టారు. అన్నింటికంటే మించి కరోనా మహమ్మారి జడలు విప్పి నాట్యం చేస్తున్నా కదలిక లేదు. ఆసుపత్రులలో సరిపడా పడకలు లేవు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, తీసుకున్న చర్యలు అంతంత మాత్రమే. ఇలాంటి ఏలుబడిని ఏపీ ప్రజలు మరో మూడేళ్లు ఎలా భరిస్తారో... వేచిచూడాల్సిందే!
పోతుల బాలకోటయ్య
ఆంధ్రప్రదేశ్ దళిత బహుజన సమగ్రాభివృద్ధి వేదిక