కెనరా బ్యాంక్‌ లాభం రూ.1,010 కోట్లు

ABN , First Publish Date - 2021-05-19T05:46:10+05:30 IST

గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రభు త్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది

కెనరా బ్యాంక్‌ లాభం రూ.1,010 కోట్లు

బెంగళూరు (ఆంధ్రజ్యోతి) : గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రభు త్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.1,010 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2019-20) ఇదే కాలం లో బ్యాంక్‌ రూ.6,567 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. సిండికేట్‌ బ్యాంక్‌ విలీనం కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నష్టం ఎక్కువగా ఉందని పేర్కొంది. కాగా త్రైమాసిక సమీక్షా కాలంలో నికర వడ్డీ మార్జిన్లు పెరగటంతో పాటు మొండి బకాయిల (ఎన్‌పీఏ) కోసం చేసిన కేటాయింపులు తక్కువగా ఉండటం కలిసివచ్చిందని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ వెల్లడించారు. మార్చి త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ ఆదాయం రూ.14,222.39 కోట్ల నుంచి రూ.21,522 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో నికర వడ్డీ ఆదాయం 9.87 శాతం వృద్ధి చెంది రూ.5,087 కోట్ల నుంచి రూ.5,589 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్‌ పేర్కొంది. 


మరోవైపు మొండి పద్దుల కోసం చేసిన కేటాయింపులు కూడా రూ.4,875.28 కోట్ల నుంచి రూ.4,427.53 కోట్లకు తగ్గిందని బ్యాంక్‌ తెలిపింది. స్థూల ఎన్‌పీఏలు 9.39 శాతం నుంచి 8.93 శాతానికి, నికర ఎన్‌పీఏలు 4.34 శాతం నుంచి 3.82 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపులు 75.86 శాతం నుంచి 79.68 శాతానికి పెరిగాయి. కాగా మార్చితో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంక్‌ రూ.2,557 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ గ్లోబల్‌ వ్యాపారం 8.23 శాతం పెరిగి రూ.16,86,030 కోట్లకు చేరుకుంది. దేశీయంగా డిపాజిట్లు 10.74 శాతం వృద్ధి చెందిరూ.9,63,306 కోట్లకు చేరుకున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా కెనరా బ్యాంక్‌ కు 10,416 శాఖలు ఉండగా ఇందులో 3,069 గ్రామీణ ప్రాంతాల్లో, 3,140 సెమీ అర్బన్‌, 2,094 అర్బన్‌, 2,113 మెట్రో నగరాల్లో ఉన్నాయి. కొవిడ్‌ కారణంగా  తమ సిబ్బందిలో 50 శాతం మాత్రమే బ్యాంకులో విధులకు హాజరవుతున్నారని, మిగతా ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తూ కస్టమర్లకు అవసరమైన సేవలందిస్తున్నారని ప్రభాకర్‌  చెప్పారు.

Updated Date - 2021-05-19T05:46:10+05:30 IST