కేన్‌ c/o Ramappa

ABN , First Publish Date - 2021-08-02T05:35:28+05:30 IST

తెలంగాణ రాష్ర్టానికి తలమానికంగా..

కేన్‌ c/o Ramappa

జీవ వైవిధ్య ప్రాంతం.. ప్రపంచ వారసత్వ ప్రదేశం
రామప్ప సమీపంలో విలువైన కేన్‌ మొక్కలు
నిజాం కాలం నుంచి కొనసాగుతున్న పరిశోధనలు
51 ఎకరాల్లో విస్తరించిన  ప్రాంతం..  47 ఏళ్ల కిందటే గుర్తింపు
అభివృద్ధి చేస్తే రామప్పకు అదనపు ఆకర్షణ


ములుగు: 
తెలంగాణ రాష్ర్టానికి తలమానికంగా ఉన్న రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపుతో ప్రపంచ వారసత్వసంపదగా ఖ్యాతిగాంచింది. 800ఏళ్లనాటి కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి ప్రతీక అయిన ఈ చారిత్రక రాతికట్టడం పేరు ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. రామప్ప కేవలం వారసత్వ చిరుమాగానే కాకుండా జీవవైవిధ్యానికి కూడా పెట్టింది పేరని చాలామందికి తెలియదు. అత్యంత అరుదైన కేన్‌(చాపతీగ) మొక్కలకు ఇక్కడి పరిసరాలు ఆలవాలం. తెలంగాణరాష్ట్రం మొత్తంలో ఇలాంటి మొక్కలున్న ఏకైక ప్రదేశం కూడా రామప్పే. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడ్డ రామప్ప రాబోయే రోజుల్లో పర్యాటకంగా అభివృద్ధి చెందనుండగా ఇక్కడి కేన్‌ను సంరక్షించి, అభివృద్ధి చేస్తే అదనపు ఆకర్శనగా మారనుంది.

నిజాంకాలంలో వెలుగులోకి..
నిజాం పరిపాలనా కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వృక్షశాస్త్రజ్ఞుడు ఆచార సయీదుద్దీన్‌ తొలిసారిగా రామప్ప పరిసరాల్లో కేన్‌ మొక్కలను గుర్తించారు. తన అధ్యయనాన్ని జర్నల్‌ ఆఫ్‌ బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ పుస్తకంలో ప్రచురించారు. ఆతర్వాత 1953లో ఖాన్‌ అనే మరో వృక్షశాస్త్రవేత్త ఈ కేన్‌ మొక్కల ఉనికిని ఫారెస్టు ఫ్లోరా ఆఫ్‌ హైదరాబాద్‌ అనే పుస్తకంలో ప్రచురించారు. తదనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అనేక పరిశోధనలు జరిగాయి. ఈనేపథ్యంలో 51 ఎకరాల్లో కేన్‌ మొక్కలు విస్తరించిన ఈ ప్రదేశాన్ని 1974లో అప్పటి రాష్ట్ర జీవవైవిధ్య మండలి రక్షిత ప్రాంతంగా గుర్తించింది.

20రకాల జీవరాశులు, 50రకాల మొక్కలు..

ప్రపంచవ్యాప్తంగా 370జాతుల కేన్‌ మొక్కలుంటే మనదేశంలో 22 జాతులున్నాయి. ఇందులో నాలుగు రకాలు తెలుగు రాష్ర్టాల్లో కనిపిస్తాయి. ఏపీలోని కర్నూలు, విజయనగరం, నెల్లూరుతోపాటు తెలంగాణ రాష్ట్రంలో రామప్ప పరిసరాల్లో మాత్రమే ఉన్నాయి. కేన్‌ మొక్కలను గృహోపకరణాల తయారీకే కాకుండా ఆయుర్వేద ఔషధంగా కూడా వాడుతారు. కేన్‌ కొమ్మలతో చేసిన మందు జ్వరాన్ని తగ్గించడంతోపాటు విరేచనాలు, కీళ్ల నొప్పులను తగ్గించేందుకు కూడా బాగా పనిచేస్తుంది. వీటి పండ్లను తింటారు కూడా. ఈ జీవవైవిధ్య పరిరక్షణ ప్రాంతంలో అరుదైన జీవరాశులు, మొక్కలు కనిపిస్తాయి. రకరకాల పక్షులు, కోతులు, గబ్బిలాలు, తాబేళ్లు, సీతాకోక చిలుకలతోపాటు అరుదైన తెల్లమద్ది, జమ్మి, నెమలినార, మోదుగ, బర్రెంక, విషముష్టి, ఊడుగ, తాని, పాలకొడిశె, తిప్పతీగ, దూలగొండి, సరస్వతి, ఉత్తరేణి, గలిజేరు, దుబ్బదునిచేరు, అటిక మామిడి, తగడ, పొన్నగంటి, తూటికాడ, మంచి కశింద వంటి ఔషధ మొక్కలు విరివిగా పెరిగాయి.

ఆక్రమణలతో ఆటుపోట్లు
పరిరక్షణ ప్రాంతంగా 47 ఏళ్ల కిందట గుర్తించినప్పటికీ పాలకుల పట్టింపులేమితో జీవవైవిధ్య ప్రాంతం ఆక్రమణలకు గురైంది. ఐదెకరాలకు కుచించుకుపోయింది. ఈక్రమంలో వృక్షశాస్త్ర పరిశోధకుడు డాక్టర్‌ సుతారి సతీష్‌ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరపడంతోపాటు అధికారులకు వినపతిపత్రాలు సమర్పించడం, అవగాహన సదస్సులు నిర్వహించడంతో 2014లో సంరక్షణకు అడుగులపడ్డాయి. అటవీ శాఖ అధికారులు 1970 రికార్డులను అనుసరించి 51 ఎకరాల గుర్తించి స్వాధీన పర్చుకున్నారు.

అభివృద్ధి సమయమిది..
రామప్ప ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇదే తరుణంలో రామప్పకు వచ్చే తూర్పు ముఖద్వారం దారిని ఆనుకొని ఆలయానికి సుమారు కిలోమీటరు దూరంలో అరుదైన కేన్‌, ఔషధ మొక్కలు, జీవరాశులున్న ఉన్న ఈ 51ఎకరాల ఈ జీవైవిధ్య పరిరక్షణ ప్రాంతాన్ని దేశీయ మొక్కలతో విస్తరించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. రామప్ప సందర్శనకు వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు ఈ బయోడైవర్సిటీ ప్రదేశం ఆహ్లాదం కలిగించనుంది.

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు: సుతారి సతీష్‌, వృక్షశాస్త్ర పరిశోధకుడు

రామప్ప సమీపంలోని జీవవైవిద్య పరిరక్షణ ప్రాంతాన్ని అభివృద్ధిచేయాలంటే ఇదే అనువైన సమయం. కబ్జాకు గురైన 51 ఎకరాల స్థలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనే సంరక్షించబడింది. చిరకాల స్వప్నంగా ఉన్న రామప్పకు యునెస్కో గుర్తింపు లభించింది. ఇదే స్ఫూర్తితో బయోడైవర్సిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ప్రపంచ పర్యాటకులకు విద్యా పర్యాటక ప్రాంతంగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

Updated Date - 2021-08-02T05:35:28+05:30 IST