నా సవాల్‌ను స్వీకరించనేలేదు

ABN , First Publish Date - 2020-10-22T07:41:47+05:30 IST

నా సవాల్‌ను స్వీకరించనేలేదు

నా సవాల్‌ను స్వీకరించనేలేదు

దుబ్బాక గడ్డ మీదనే సిద్ధంగా ఉన్నా

మీ అబద్ధాలకు ఆధారాల్లేవా?

బీజేపీ నేతలపై మంత్రి హరీశ్‌ ధ్వజం

దుబ్బాకలో మహిళల భారీ ర్యాలీ


సిద్దిపేట, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘‘బీడీ కార్మికుల పింఛన్లు, కేసీఆర్‌ కిట్టు పథకానికి కేంద్రమే డబ్బు ఇస్తున్నదని చెప్పిన బీజేపీ నేతలు ఏమయ్యారు?. మీ అబద్ధాలకు ఆధారాలు లేవా? నేను దుబ్బాక బస్టాండు సెంటర్లోనే ఉన్నా.. నా సవాల్‌ స్వీకరించే ధైర్యం లేదా?’’ అని బీజేపీ నేతలపై మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంలో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్‌ఎ్‌సకు మద్దతుగా తరలివచ్చిన మహిళలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. దుబ్బాక ప్రజలు చైతన్యవంతులని, అబద్ధాలు మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. బీడీ కార్మికులకు రూ.2016 పింఛన్‌ను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని స్పష్టం చేశారు. 


ఇందులో 16పైసలు కూడా కేంద్రం ఇవ్వడం లేదన్నారు. గొంతు పెంచి మాట్లాడితే అబద్ధాలు నిజమవుతాయా?.. నిజాలు అబద్ధమవుతాయా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కిట్టుకు కేంద్రమే డబ్బులిస్తుంటే.. మోదీ కిట్టు అని ఎందుకు పేరు పెట్టలేదో సమాధానం చెప్పాలన్నారు. ఇక కాంగ్రెస్‌ నేతలు పెద్దపెద్ద సూట్‌కేసులు, కార్లలో వచ్చి దుబ్బాకలో తొవ్వలు తెలవకుండా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత భారీ మెజారిటీతో గెలవడం ఖాయమైందని, ర్యాలీకి తరలివచ్చిన మహిళలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ర్యాలీలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మారెడ్డి,  సోలిపేట సుజాత పాల్గొన్నారు.


Updated Date - 2020-10-22T07:41:47+05:30 IST