Abn logo
Apr 19 2021 @ 00:06AM

కరోనా వేళ కనికరిస్తారా? ఓటర్లు పోలింగ్‌ బూత్‌వైపు అడుగులు వేసేనా?

హాజరుపై అనుమానాలు

గతంలో ఎన్నికల్లో 67శాతమే నమోదు

ప్రస్తుత ఎన్నికలపై అభ్యర్థుల్లో, ప్రజల్లో చర్చ

2016 బలాబలాలనుద్దేశించి ప్రస్తుత అంచనాలు

ఖమ్మం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఓ వైపు కరోనా సెకెండ్‌వేవ్‌ ధాటికి ప్రజలు గజగజా వణికిపోతున్న వేళ.. త్వరలో జరగనున్న కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ విషయంపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి మొదటి దశలో కంటే.. రెండో దశలో వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇదే క్రమంలో ఖమ్మం కార్పోరేషన్‌ పరిధిలోనూ వందల సంఖ్యలో వైరస్‌ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న జరిగే పోలింగ్‌కు ఓటర్లు ఎంతమేర ఆసక్తి చూపుతారోనన్న భయం అభ్యర్థుల్లో, రాజకీయపార్టీల నేతల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించి.. ప్రక్రియను ప్రారంభించినా.. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో వాటిని వాయిదా వేయబోతున్నారంటూ సోషల్‌ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రస్తుతం నామినేషన్లు వేసిన అభ్యర్థులు.. ఓటర్లను పోలింగ్‌బూత్‌ల వరకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. 

పోలింగ్‌ శాతం నమోదుపై అనుమానాలు..

2016లో తొలిసారి ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు ప్రశాతంగా జరిగాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఆ సమయంలో కొవిడ్‌ లాంటి ఎలాంటి ఉపద్రవాలు లేవు. అప్పట్లో అధికారులు కూడా ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. అభ్యర్థులు కూడా తమకు ఓట్లు వేయాలంటూ.. బూత్‌ల వద్దకు ప్రజలను తరలించేలా ఏర్పాట్లు చేశారు. దాంతో నాటి ఎన్నికల సమయానికి ఖమ్మం నగర పరిధిలో 2,65,710మంది ఓటర్లు ఉండగా.. కేవలం 1,79,827(67.68శాతం) మంది మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కానీ ప్రస్తుతం ప్రజలు కరోనా భయంతో ఉండగా.. అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, సెకెండ్‌ వేవ్‌ను తక్కువగా అంచనా వేయొద్దని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రభుత్వం సూచనలు ఇస్తుండటంతో త్వరలో జరిగే కార్పొరేషన్‌ పోలింగ్‌ ఏమేరకు జరుగుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఎన్నికలతో కేసులు పెరుగుతాయంటూ చర్చ

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎన్నికలు పెడితే.. ప్రచారం మొదలు.. పోలింగ్‌ వరకు ప్రజలు సమూహాలుగా మారతారని, తద్వారా కొవిడ్‌ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉంటుందన్న చర్చ జరగుతోంది. అదే జరిగితే కరోనా వ్యాప్తిని అరికట్టడం పక్కనపెట్టి.. కేసులు రెట్టింపయ్యే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరయితే సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సందేశాలకు అనుగుణంగా ఎన్నికలు వాయిదా వేస్తారని, నామినేషన్ల వరకే ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తారని, మరికొందరు ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని.. ఎవరికి తోచిన రీతిలో వారు చర్చించుకుంటున్నారు. 

2016 బలాబలాలతో బేరీజు.. 

ఖమ్మం నగరపాలక సంస్థకు 2016లో జరిగిన తొలి ఎన్నికల్లో తమ తమ డివిజన్లలో ఏయే పార్టీలకు ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న విషయాలను బేరీజు వేసుకుంటున్న అభ్యర్థులు.. ప్రస్తుత ఎన్నికల్లో తమకు వచ్చే ఓట్లపై అంచనాలు వేసుకుంటున్నారు. అప్పట్లో 50 డివిజన్లు ఉండగా.. టీఆర్‌ఎస్‌ 34, కాంగ్రెస్‌ 10, సీపీఐ, సీపీఎం, వైసీపీ రెండుస్థానాల చొప్పున కైవసం చేసుకున్నాయి. ఆ సమయంలో పోలైన 1,79,827ఓట్లకుగాను టీఆర్‌ఎస్‌కు 76,820, కాంగ్రెస్‌కు 37,210, వైసీపీకి 19,040, టీడీపీకి 15,292, సీపీఎంకు 13,411, సీపీఐకి 8,668, బీజేపీకి 2,941, ఇతరులకు 5,422 ఓట్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు, కాంగ్రెస్‌ తరపున గెలిచిన ఏడుగురు టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఇటీవల డివిజన్ల పునర్విభజన జరగ్గా.. 60డివిజన్లుగా చేయడంతో స్వరూపాలు, రాజకీయ సమీకరణలు మారాయి. దీంతో వాటన్నింటిని పరిశీలించుకుని ప్రస్తుతం నామినేషన్లు వేసిన అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. తమ గెలుపునకు కావాల్సిన వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. 

పోస్టల్‌ బ్యాలెట్లతో ఊరట.. 

కరోనా వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో నేపథ్యంలో పోలింగ్‌ శాతం నమోదుపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్ణయం కొంత ఊరటనిస్తోంది. గతంలో విధుల్లో ఉండే ఉద్యోగులకు మాత్రమే ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం ఉండగా.. ఈసారి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారికి, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, దివ్యాంగులకు, సైనికులకు, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని కల్పించారు. అయితే పోస్టల్‌ ఓటు వేసే వారు వీడియో చిత్రీకరణ మధ్య ఓటు వేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రజలకు అధికారులు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల శ్రేనులు అవగాహన కల్పించాల్సిన ఉంది. అయితే ఈ వెసులు బాటు పోలింగ్‌ నమోదుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు కొంత ఊరటచెందుతున్నారు. కొవిడ్‌ బాధితులు పోలింగ్‌ బూత్‌లకు వచ్చే అవసరం లేకపోవడంతో.. మిగిలిన ప్రజలు ఎలాంటి భయాందోళన లేకుండా ఓటు వేసేందుకు వస్తారంటూ అంచనాలు వేస్తున్నారు. ఫలితంగా కొంతమేర పోలింగ్‌ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement