టీకా వచ్చేసింది!

ABN , First Publish Date - 2021-01-13T05:40:57+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ నివారణకు టీకా వచ్చేసింది.

టీకా వచ్చేసింది!
పూణె నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వ్యాక్సిన్‌

  • 16న జిల్లాలో కొవిడ్‌ -19 వ్యాక్సినేషన్‌
  • మొదట డాక్టర్లు, హెల్త్‌కేర్‌ వర్కర్లకే..


ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ నివారణకు టీకా వచ్చేసింది. మంగళవారం ఉదయం పూణె నుంచి ప్రత్యేక కార్గో విమానంలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య వ్యాక్సిన్‌ను నగరంలోని శీతలీకరణ కేంద్రంలో భద్రపరిచారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 16వతేదీ నుంచి వ్యాక్సిన్‌ వేయడానికి వైద్యఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తొలివిడతలో  ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, పారామెడికల్‌  సిబ్బంది, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, ప్రైవేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది, ఇతర హెల్త్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు.


( ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ రంగారెడ్డి జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో తొలివిడత వ్యాక్సినేషన్‌ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 16వ తేదీన తొలివిడత హెల్త్‌కేర్‌ వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. ఈ మేరకు కరోనా వ్యాక్సిన్‌ కోవిషీల్డ్‌ను మంగళవారం ఉదయం పూణె నుంచి ప్రత్యేక కార్గో విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను నగరంలోని శీతలీకరణ కేంద్రానికి తరలించారు. జిల్లాలో తొలివిడత ఈనెల 16వ తేదీ నుంచి హెల్త్‌వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే 26,900 మందికి టీకా వేయనున్నారు. తొలివిడత ఎంపిక చేసిన 9 కేంద్రాల్లో వారికి వ్యాక్సిన్‌ అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఏఐజీ గచ్చిబౌలి, కేర్‌ ఆసుపత్రి, కాంటినెంటల్‌, కొండాపూర్‌ ఏరియా ఆసు పత్రి, మెడికేర్‌, మెయినాబాద్‌ పీహెచ్‌సీ, పీఆర్కే ఆసుపత్రి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి, నార్సింగ్‌ పీహెచ్‌సీలలో వ్యాక్సినేషన్‌ పంపిణీ చేయనున్నారు. 16వ తేదీన ఒక్కో కేంద్రంలో మొదటి రోజు 30మందికి వ్యాక్సిన్‌ ఇస్తారు. 18వ తేదీ నుంచి రోజుకు వంద మందికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. వీరికి ముందుగానే  వ్యాక్సినేషన్‌ ఇచ్చే తేదీ, సమయం, కేంద్రం పేరు వంటి వివరాలను ఎస్‌ఎంఎస్‌ ద్వారా  అందజేస్తారు. ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నెంబరు ఆధారంగా సంబంధిత వ్యక్తులకు టీకా ఇస్తారు. వ్యాక్సిన్‌ వేసిన వారిని కొంత సేపు అబ్జర్వేషన్‌లో ఉంచేందుకు అధికా రులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఒక్కో వ్యాక్సినేషన్‌ కేంద్రంలో ఐదుగురు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. తొలివిడత వ్యాక్సినేషన్‌లో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను కొవిడ్‌ పోర్టల్‌లో నమోదు చేసి ఇప్పటికే డ్రైరన్‌ కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అలాగే వైద్య సిబ్బందికి అన్నివిధాలా శిక్షణ కూడా ఇప్పటికే పూర్తిచేశారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే జడ్పీ చైర్‌పర్సన్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇదిలాఉంటే వ్యాక్సిన్‌ పంపిణీలో అవసరానికి మించి డోస్‌లు సిద్ధం చేశారు. నగరంలోని శీతలీకరణ కేంద్రంలో వీటిని భద్రపరిచారు. 


వికారాబాద్‌ జిల్లాలో 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో తొలిరోజు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేసేందుకు మూడు కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. తాండూరులోని జిల్లా ఆసుపత్రితోపాటు వికారాబాద్‌ ఏరియా ఆసుపత్రి, మహావీర్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. తొలిరోజు ప్రధానమంత్రి మోదీ సందేశం అనంతరం జిల్లాలో ఈ మూడు కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఒక్కో కేంద్రంలో వంద మంది వంతున వ్యాక్సినేషన్‌ ఇవ్వనున్నారు. అనంతరం 18వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు. తాండూరులోని జిల్లా ఆసుపత్రితోపాటు పరిగి, కొడంగల్‌, మర్పల్లి సీహెచ్‌సీలు, 22 రూరల్‌, అర్బన్‌ పీహెచ్‌సీల్లో 4,219 మంది వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. వికారాబాద్‌ జిల్లాలో వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 4,219 మంది డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందిని గుర్తించి వారి వివరాలను ఆన్‌లైన్‌ చేశారు. ఎవరికి ఎక్కడ వ్యాక్సిన్‌ వేయనున్నారనేది సంబంధిత వ్యక్తుల సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ పంపించనున్నారు. 


కోల్డ్‌ స్టోరేజీ నుంచి సరఫరా...

హైదరాబాద్‌లోని కోఠి ఆరోగ్య శాఖ కోల్డ్‌ స్టోరేజీ నుంచి జిల్లాకు వ్యాక్సిన్‌ సరఫరా చేయనున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను మొదట అనంతగిరిలోని వ్యాక్సిన్‌ కోల్డ్‌ స్టోరేజ్‌ సెంటర్‌లో భద్రపరచాలని భావించినా.. ఆ తరువాత అక్కడ కాకుండా మహావీర్‌ జనరల్‌ ఆసుపత్రిలో నిల్వ ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక్కడి నుంచే జిల్లావ్యాప్తంగా వ్యాక్సిన్‌ సరఫరా చేయనున్నట్లు సమాచారం. ఇతర ఆసుపత్రుల్లోనూ కోల్డ్‌ చైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 


మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో..

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : కరోనా నివారణ టీకాను ఇచ్చేందుకు మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాయంత్రాంగం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. జిల్లాలో  మొత్తం 59 కేంద్రాల ద్వారా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 14,700మందికి టీకా వేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి జిల్లాయంత్రాంగం ప్రతిపాదనలు పంపింది. ఈనెల 16న మొదటివిడత టీకాను 11 కేంద్రాల్లో ప్రారంభించనున్నారు. వీటిలో ఆదిత్య హాస్పిటల్‌, అంకుర, కుషాయిగూడ పీహెచ్‌సీ, మల్లారెడ్డి హాస్పిటల్‌, మల్లాపూర్‌ యూహెచ్‌సీ, మ్యాట్రిక్స్‌ హాస్పిటల్‌, మెడిసిటీ, ఓమ్నీ, రెమిడి, శ్రీశ్రీ హోలిస్టిక్‌ హాస్పిటల్‌, ఉప్పల్‌ పీహెచ్‌సీ ఉన్నాయి. మొదటిరోజు జిల్లావ్యాప్తంగా ప్రతీ కేంద్రానికి 30మందికి చొప్పున 330మందికి టీకా వేయనున్నారు. ఈనెల 18 నుంచి 59 కేంద్రాల్లో రోజువారీగా 100మందికి టీకా వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రెండోవిడత టీకాను 28 రోజుల తర్వాత వేస్తారు.



Updated Date - 2021-01-13T05:40:57+05:30 IST