‘సీబీఎన్‌ ఆర్మీ’ ప్రతినిధుల అరెస్టు

ABN , First Publish Date - 2021-05-19T09:24:56+05:30 IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ నమోదైన కేసులో పోలీసులు సీబీఎన్‌ ఆర్మీ యూట్యూబ్‌ చానల్‌ ప్రతినిధులను అరెస్టు చేశారు...

‘సీబీఎన్‌ ఆర్మీ’ ప్రతినిధుల అరెస్టు

  • ఎంపీ విజయసాయిపై పోస్టులు పెట్టారని కేసు

గుంటూరు, మే 18: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ నమోదైన కేసులో పోలీసులు సీబీఎన్‌ ఆర్మీ యూట్యూబ్‌ చానల్‌ ప్రతినిధులను అరెస్టు చేశారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి కథనం మేరకు... శావల్యాపురం మండలం ఘంటావారిపాలేనికి చెందిన మాదినేని వెంకట మహేశ్‌బాబు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ టీడీపీకి చెందిన సీబీఎన్‌ ఆర్మీ పేరిట యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్నారు. టీడీపీ సోషల్‌ మీడియా జనరల్‌ సెక్రటరీగా కొనసాగుతున్న ఆయన వద్ద మచిలీపట్నం జవహర్‌పేటకు చెందిన మూల్పూరి శ్రీసాయి కల్యాణ్‌ సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్నారు. డిజిటల్‌ మల్టీమీడియాలో ఎమ్మెస్సీ చేసిన మహేశ్‌బాబు విజయవాడ గురునానక్‌ కాలనీలో ఉంటున్నారు. విజయసాయిరెడ్డి ఫొటోలను వీరు మార్ఫింగ్‌ చేసి కోతి బొమ్మలా పోలుస్తూ, వాయిస్‌ ఓవర్‌ ఇస్తూ, అభ్యంతరకర రీతితో దూషిస్తూ ఆయన ప్రతిష్ఠకు, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వీడియోను పోస్టు చేశారని వైసీపీ యువజన నాయకుడు పానుగంటి చైతన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరండల్‌పేట పోలీసులు గతనెల 24న పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా మహేశ్‌బాబు, సాయి కల్యాణ్‌ను చంద్రమౌళినగర్‌లో మంగళవారం అరెస్టు చేశారని ఎస్పీ వెల్లడించారు. 


Updated Date - 2021-05-19T09:24:56+05:30 IST