Abn logo
Jun 12 2021 @ 00:24AM

పంట రుణాలు మంజూరు చేయాలి

 - ములుగు కలెక్టర్‌ కృష్ణఆదిత్య 

ములుగు కలెక్టరేట్‌, జూన్‌ 11 : రైతులందరికీ పంటరుణాలను సకాలంలో మంజూరు చేయాలని కలెక్టర్‌ కృష్ణఆదిత్య సూచించారు. 2021-22 వార్షిక రుణ ప్రణాళికను శుక్రవారం ఆయన విడుదల చేశారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో లీడ్‌బ్యాంకు మేనేజర్‌ వీరాంజనేయులు ఆధ్వర్యంలో రూ.1415. 94 కోట్ల రుణాల విడుదలకు అంగీకారం తెలుపుతూ ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలోని 8రకాల బ్యాంకులు, వివిధ అభివృద్ధి, నిరుద్యోగం, హౌసింగ్‌, విద్యారంగాలకు రుణాలు అందించేలా బ్యాంకర్లు కృషిచేయాలన్నారు. అర్హులైనవారికి రుణాలు ఇచ్చి వారి ఆర్థికాభివృద్ధికి బాసటగా నిలవాలన్నారు. లబ్ధిదారుల నుంచి రుణాల రికవరీ శాతం పెరిగితేనే అనుకున్న లక్ష్యానికి చేరుకోవచ్చని, దీనిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి మాట్లాడుతూ స్వయంసహాయక సంఘాలు బలోపేతం కావాలని, 5 నుంచి 10 మంది గ్రూపుగా ఏర్పడి రుణ సహాయం పొందాలన్నారు. ఐటీడీఏ పీవో హన్మంతు కె.జెండగే, డీఆర్‌డీవో నాగపద్మజ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రవి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. 

బాలకార్మికులు లేని సమాజం ఏర్పడాలి.. 

బాలకార్మికులు లేని సమాజం ఏర్పడాలని, ఇందుకోసం ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ కృష్ణఆదిత్య కోరారు. ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హన్మంతు కె.జెండగే, ములుగు అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి, జిల్లా సహాయ కార్మికశాఖ అధికారి షర్ఫొద్దీన్‌, డీపీఆర్‌వో ప్రేమలత, అధికారులు పాల్గొన్నారు. 

దరఖాస్తులను పూర్తి చేయాలి..

 జిల్లాలో ఇసుక రీచ్‌ల కోసం వచ్చిన పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ కృష్ణఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం జరగగా, ఆయన పాల్గొని మాట్లాడారు. ఇసుక సొసైటీల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని, రీసర్వే కోసం 17మంది పట్టాదారుల జాయింట్‌ ఇన్ఫెక్షన్‌ నివేదికలను డీఎల్‌ఎస్సీ కమిటీ ఆమోదించిందని అన్నారు. ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చేయాలని, సర్వేచేసే క్రమంలో ఫొటోలు, వీడియోలు, నివేదికలు పక్కాగా ఉండాలని, గూగుల్‌ మ్యాప్‌ ద్వారా విచారణ చేపట్టే విధంగా వీలు ఉండాలన్నారు. రీ సర్వే నివేదికలను ఈ- ఆఫీస్‌ ద్వారా పంపాలని మైనింగ్‌ ఏడీ రఘుబాబును ఆదేశించారు. మైనింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రఘుబాబు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 154 దరఖాస్తులు రాగా, అందులో పట్టాభూమి దరఖాస్తులు 94, సొసైటీ ల్యాండ్‌ దరఖాస్తులు 60, జాయింట్‌ ఇన్ఫెక్షన్‌ పూర్తయినవి 26 ఉన్నాయన్నారు. ఇంకా పెండింగ్‌లో 128 దరఖాస్తులు ఉన్నాయని, ఏడు ఇసుకరీచ్‌లకు పెసా గ్రామసభల ద్వారా ఎంపిక చేయాల్సి ఉందని కలెక్టర్‌కు వివరించారు. 


Advertisement
Advertisement