‘భారతి’ కోసమే సిమెంట్‌ మంట

ABN , First Publish Date - 2021-01-18T08:35:20+05:30 IST

‘భారతీ సిమెంట్స్‌’కు దోచిపెట్టేందుకే సీఎం జగన్‌ సిమెంటు కంపెనీలతో కుమ్మక్కయి ధరలు పెంచారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు.

‘భారతి’ కోసమే సిమెంట్‌ మంట

  • ఇండియా సిమెంట్స్‌ శ్రీనివాసన్‌తో
  • కలిసి జగన్‌ ధరలు పెంచేశారు
  • దీంతో భారతీ సంస్థకు వెయ్యికోట్ల లాభం
  • ఈ విషయం ‘భారతి’ నివేదికలోనే ఉంది
  • గతంలో ధరలు పెరగకుండా సబ్‌కమిటీ
  • జేట్యాక్స్‌.. జగన్‌ ఆ పనిచేయగలరా?
  • టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలు


అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ‘భారతీ సిమెంట్స్‌’కు దోచిపెట్టేందుకే సీఎం జగన్‌ సిమెంటు కంపెనీలతో కుమ్మక్కయి ధరలు పెంచారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు. ‘‘భారతీ సిమెంట్స్‌ ఉత్పత్తి సామర్థ్యం 5 మిలియన్‌ టన్నులు. అంటే 10 కోట్ల సిమెంట్‌ బస్తాలు. బస్తాకు రూ.100 పెంచితే వెయ్యికోట్ల లాభం. పోనీ అందులో సగమే ఉత్పత్తి చేసినా రూ.500 కోట్ల మేరకు లాభం. భారతీ సిమెంట్స్‌ను అవినీతి సొమ్ముతో పెట్టారు. అందులో 51ు వైక్యాట్‌ అనే ఫ్రెంచ్‌ కంపెనీకి అమ్మేశారు. 49ు వాటా తన దగ్గరే పెట్టుకున్నారు. వైక్యాట్‌ క ంపెనీ విడుదల చేసిన ఫైనాన్షియల్‌ రిపోర్ట్‌-2020లో 5వ పేజీ చివరి పేరాగ్రా్‌ఫలో.. ‘ధరల పెరుగుదల వల్ల రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయి’ అని రాశారు. రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించడం కోసం పేదల నడ్డివిరవడం జగన్‌కే సాధ్యమైంది’’ అని ధ్వజమెత్తారు. పట్టాభిరామ్‌ ఆదివారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడారు. ‘‘ఇండియా సిమెంట్స్‌ శ్రీనివాసన్‌తో కలిసి జగన్‌.. సిమెంటు ధరలు పెంచేశారు. గతంలో కూడా శ్రీనివాసన్‌ సిమెంటు ధరలు పెంచేసి దోచుకోవాలని చూస్తే.. నిర్మాణదారులంతా కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనివాసన్‌కు రూ.187 కోట్ల జరిమానా విధించారు. గతంలో జరిమానా కట్టిన పెద్దమనుషులతో కలిసి జగన్‌ సిమెంట్‌ కంపెనీలన్నీ ఏకం చేసి సిమెంటు ధరలు పెంచేశాడు. తన అవినీతి సొమ్ముకోసం.. సామాన్యుడిని ఇబ్బందిపెడుతూ.. తాడేపల్లి ప్యాల్‌సలో సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో సిమెంటు ధరలు పెం చాలనుకున్నప్పుడు.. యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం వేశారు. కంపెనీలను పిలిచి హెచ్చరించి ధరలు పెరగకుండా చేశారు. జేట్యాక్స్‌ వసూలు చేస్తు న్న జగన్‌ కూడా అదే పనిచేసి సిమెంటు ధర తగ్గించగలరా ?. రేపటినుంచి సిమెంటు ధర తగ్గాలని హెచ్చరించే దమ్ము జగన్‌కు ఉందా? భారతీ సిమెంట్స్‌ ధరలు తగ్గించే ధైర్యం ఆయనకుందా? ముందు ఆ పనిచేయాలి.


తన అవినీతి మురికిలో పుట్టిన భారతీ సిమెంట్స్‌కు లాభాలు చేకూర్చడం కోసం కొన్నికోట్ల మంది ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వైక్యాట్‌ ప్రకటన కాదనే దమ్ము వైపీపీ నేతలకు ఉందా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఒకపక్క ఇసుక దోపిడీ.. మరోపక్క సిమెంటు ధర పెంచేశారు. భవన నిర్మాణ రంగం దెబ్బతిన్నా, వేలాది కార్మికులు రోడ్డునపడ్డా పట్టించుకోకుండా తన స్వార్థం కోసం జగన్‌ ధరలు పెంచేశారు. భారతీ సిమెంట్స్‌ సహా అన్ని సిమెంటు కంపెనీలతో తక్షణమే చర్చలు జరిపి, ధరలు తగ్గేలా చూడాలి’’ అని పట్టాభి డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-01-18T08:35:20+05:30 IST