మళ్లీ సి..మంట!

ABN , First Publish Date - 2020-09-26T08:55:14+05:30 IST

ఇల్లు కట్టిచూడు...పెళ్లి చేసి చూడు అన్నది సామెత. కరోనాతో పెళ్లికళ ఎలాగూ తగ్గిపోయింది. ఇక ఇంటి సంగతికొస్తే చుక్కలు కనిపిస్తున్నాయి. పెరిగిన ఇసుక

మళ్లీ సి..మంట!

కొవిడ్‌లోనూ సిమెంట్‌ రేటు పైపైకి.. బస్తాకు వంద భారం

ఇసుక కొరతకు తోడైన కొత్త కష్టం.. నిర్మాణదారులకు కన్నీళ్లే


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఇల్లు కట్టిచూడు...పెళ్లి చేసి చూడు అన్నది సామెత. కరోనాతో పెళ్లికళ ఎలాగూ తగ్గిపోయింది. ఇక ఇంటి సంగతికొస్తే చుక్కలు కనిపిస్తున్నాయి. పెరిగిన ఇసుక ధరలు ఒకపక్క భారంగా మారగా, మరోపక్క సిమెంటు ధరలు మబ్బుల్లో నిలబడిపోయాయి. సాధారణంగా సిమెంటు ధరలు ఒక్కోసారి పెరిగి మళ్లీ తగ్గుతుంటాయి. నిర్మాణాలు జోరుగా సాగే వేసవికాలంలో కాస్త పెరిగినా మళ్లీ తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు మాత్రం పెరిగిన ధరలు పెరిగినట్లే ఉండిపోవడంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, చిన్న చిన్న నిర్మాణాలు చేసుకునే వారందరికీ కష్టంగా మారింది. అదీ బస్తాకు రూ.10-20కాదు.. ఏకంగా రూ.80-100 వరకు పెరిగింది. కొన్నినెలల క్రితం పెరిగిన సిమెంటు ధరలు మళ్లీ దిగిరాలేదు. గతంలో రూ.260-280 ఉండే సిమెంటు ధరలు ఇప్పుడు రూ.350 వరకు చేరిపోయాయి. బ్రాండ్‌ను బట్టి కొంత అటూఇటూగా ఇదే ధరకు కొనుగోలు చేయాల్సివ స్తోంది. దీంతో ఇళ్ల నిర్మాణదారుల మీద విపరీతమైన భారం పడుతోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణం చేసుకోవాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. 


ఇల్లు ఎవరికైనా ముల్లే!: ప్రభుత్వ ఇళ్ల లబ్ధిదారులు గతంలో అయితే కొంత తమ సొమ్ము వేసుకుని ఉన్నంతలో సౌకర్యవంతంగా ఇంటి నిర్మాణం చేసుకునేవారు. ఇప్పుడు అలాంటి ఆలోచన కూడా చేసే పరిస్థితి లేదని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు కొత్త నిర్మాణాలు ప్రారంభం తగ్గిపోయింది. సాధారణంగా ఇళ్ల నిర్మాణాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు రాష్ట్రంలో విపరీతంగా జరిగేవి. కొత్త వెంచర్లను ఎప్పటికప్పుడు ప్రారంభించేవారు. భూమి పూజలు నిత్యం పెద్దసంఖ్యలో జరుగుతుండేవి. అయితే గత ఏడాదికాలం నుంచి నిర్మాణ రంగం దెబ్బతింది. రియల్‌ ఎస్టేట్‌ కార్యక్రమాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు తగ్గుముఖం పడ్డాయి. కొంతకాలంగా ఇసుక ధరలు చుక్కలనంటడం, ఇసుక కొరతతో నిర్మాణాలు ఆగిపోయాయి. ఆ తర్వాత దానికి సిమెంటు భగభగలు, కొవిడ్‌ తోడయ్యాయి.


అదే సమయంలో మూడు రాజధానుల నిర్ణయం కూడా నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం చూపిందనే అభిప్రాయం ఉంది. ఇసుక, సిమెంటు ధరల పెరుగుదల, కొవిడ్‌ వ్యాప్తి, రాజధానిపై మారిన ప్రభుత్వ నిర్ణయం తదితర కారణాలతో నిర్మాణ రంగం కుదేలైంది. సొంత  ఇంటి నిర్మాణాలూ తగ్గుముఖం పట్టాయి. గతంలో మొదలుపెట్టి మధ్యలో ఉన్న నిర్మాణాలను మాత్రం పూర్తిచేసి ఊపిరి పీల్చుకుందామనే ఆలోచనకు వచ్చేశారు. ఇళ్ల నిర్మాణాలు మధ్యలో ఉండడం, చివరిలో ఆపేయలేకపోవడంతో ధరలు పెరిగినా ఎలాగోలా తిప్పలుపడి నెట్టుకొస్తున్నామని కొందరు నిర్మాణదారులు వాపోతున్నారు. 

Updated Date - 2020-09-26T08:55:14+05:30 IST