కేంద్ర గెజిట్‌ గొడ్డలిపెట్టు!

ABN , First Publish Date - 2021-07-22T07:55:29+05:30 IST

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను నిర్దేశిస్తూ కేంద్రం జారీచేసిన గెజిట్‌.. గ్రేటర్‌ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టని మాజీ మంత్రి, సీనియర్‌ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు

కేంద్ర గెజిట్‌ గొడ్డలిపెట్టు!

గ్రేటర్‌ రాయలసీమ ప్రాజెక్టులకు తీవ్ర నష్టం

గ్రేటర్‌ ప్రభుత్వమే ఉండి ఉంటే ఇంత అన్యాయం జరిగేది కాదు

సీమ పథకాలపై జగన్‌ చిన్నచూపు

శ్రీశైలాన్ని తెలంగాణ ఖాళీచేస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు?

లేఖలు రాస్తే సరిపోతుందా?

రాజకీయ లబ్ధికే సీఎంల కీచులాట

కలిసి ఎందుకు మాట్లాడుకోలేదు?

మాజీ మంత్రి మైసూరారెడ్డి ధ్వజం


హైదరాబాద్‌ సిటీ/అమరావతి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను నిర్దేశిస్తూ కేంద్రం జారీచేసిన గెజిట్‌.. గ్రేటర్‌ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టని మాజీ మంత్రి, సీనియర్‌ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. గ్రేటర్‌ రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రభుత్వం ఉంటే ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదని చెప్పారు. విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం జలాశయాన్ని తెలంగాణ ఖాళీ చేస్తుంటే జగన్‌ సర్కారు ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని నిలదీశారు. కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకుంటోందని ఆక్షేపించారు. గెజిట్‌ నోటిఫికేషన్‌పై గ్రేటర్‌ రాయలసీమ నాయకులతో బుధవారమిక్కడ తన బంజారాహిల్స్‌ నివాసంలో మైసూరారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గెజిట్‌తో హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలిగొండ, సోమశిల, కండలేరు సేద్యపు నీటి పథకాలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను జగన్‌ చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. గెజిట్‌ను స్వాగతిస్తున్నామని చెప్పిన ఆయన ప్రభుత్వం.. గ్రేటర్‌ రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగమన్న విషయం గుర్తిస్తే బాగుండేందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఇద్దరు ముఖ్యమంత్రులూ కీచులాడుకుంటున్నారని.. ఇద్దరూ కలిపి ప్రాజెక్టులపై ఎందుకు మాట్లాడుకోలేదని ప్రశ్నించారు. 


గతంలో గోదావరి జలాలపై వివాదాలను కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు చర్చించుకుని పరిష్కరించుకున్నారని.. కానీ 65 ఏళ్లు ఒకే రాష్టంలో కుటుంబ సభ్యులుగా ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు నదీ జలాల వివాదాలపై మాట్లాడుకోకుండా రాజకీయ లబ్ధి కోసం ఘర్షణ పడి తమ పిలకను కేంద్రం చేతిలో పెట్టి సీమ ప్రాజెక్టుల మనుగడను గందరగోళంలోకి నెట్టేశారని దుయ్యబట్టారు. పట్టిసీమపై శాసనసభలో చర్చ జరిగినప్పుడు గోదావరి జలాల తరలింపుతో ఆదా అయ్యే కృష్ణా జలాలను రాయలసీమకు ఇచ్చేందుకు జీవో ఇవ్వాలని అప్పటి సీఎం చంద్రబాబును నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారని.. కానీ తాను సీఎం అయి రెండేళ్లు గడచినా ఇప్పటివరకు జీవో ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరదలు వచ్చినప్పుడు మాత్రమే రాయలసీమ ప్రాజెక్టులు నీళ్లను పొందే దయనీయ స్థితిలో ఉన్నాయని వాపోయారు. సమావేశంలో మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కాసారం రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-22T07:55:29+05:30 IST