Abn logo
Jan 14 2021 @ 18:01PM

16న చిత్తూరు జిల్లాకు కేంద్ర పార్లమెంటరీ బృందం

చిత్తూరు: కేంద్ర నిధులతో జిల్లావ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ బృంద సభ్యులు ఈనెల 16న జిల్లాకు రానున్నారు. 31 మంది సభ్యులతో కూడిన బృందానికి ప్రతాప్‌రావు జావేద్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో 21 మంది లోక్‌సభ సభ్యులు, పది మంది రాజ్యసభ సభ్యులున్నారు. కాగా, ముందస్తు ప్రణాళిక మేరకు కాకుండా, ఈ బృంద పర్యటనలో స్వల్పమార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మేరకు 16న ఉదయం 10 గంటలకు కేంద్ర బృంద సభ్యులు తిరుపతి నుంచి బయలుదేరి 11 గంటలకు పులిచెర్ల మండలం దిగువపోకలవారిపల్లెకు చేరుకుంటారు. అరగంట పాటు ఉండి, పీఎంకేఎ్‌సవై కింద చేపట్టిన వాటర్‌షెడ్‌ పనులను పరిశీలిస్తారు. 11.30 గంటలకు సువారపుపల్లెలో చేపట్టిన ఉపాధి పనులను పరిశీలించి, స్థానిక కూలీలతో మాట్లాడతారు. మధ్యాహ్నం 12 గంటలకు మతుకువారిపల్లెలో నిర్మిస్తున్న గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, ఆరోగ్యకేంద్ర భవనాలను పరిశీలించనున్నారు. 12.30 గంటలకు కల్లూరు ఉన్నత పాఠశాల ఆవరణలో స్వయం సహాయ సంఘాలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 1.30 గంటలకు కల్లూరు పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డంపింగ్‌యార్డును, స్థానిక ఇందిరానగర్‌లో జలజీవన్‌ మిషన్‌ కింద నిర్మించిన వాటర్‌ ట్యాంకును పరిశీలించనున్నారు.

Advertisement
Advertisement
Advertisement