తాత కంటే మనవడి ఆస్తులే ఎక్కువ!

ABN , First Publish Date - 2020-02-21T10:10:31+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే ఆయన మనవడు దేవాన్ష్‌కే అధిక ఆస్తులు ఉన్నాయి. టీడీపీ అధినేత కుటుంబ నికర ఆస్తులు మొత్తం

తాత కంటే మనవడి  ఆస్తులే ఎక్కువ!

చంద్రబాబు ఆస్తి విలువ 9 కోట్లు

దేవాన్ష్‌ పేరిట రూ.19.42 కోట్లు

మొత్తంగా కుటుంబ నికర ఆస్తులు 111 కోట్లు

భువనేశ్వరికి 50 కోట్లు.. లోకేశ్‌కు 24 కోట్లు

బ్రహ్మణి ఆస్తులు 15.68 కోట్లు

ఎక్కువ ఉన్నట్లు నిరూపిస్తే వైసీపీ వాళ్లకే: లోకేశ్‌

ఇంతకంటే ఎక్కువ ఉన్నట్లు నిరూపిస్తే వైసీపీ వాళ్లకే ఇచ్చేస్తా

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సవాల్‌

మంగళగిరి/అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే ఆయన మనవడు దేవాన్ష్‌కే అధిక ఆస్తులు ఉన్నాయి. టీడీపీ అధినేత కుటుంబ నికర ఆస్తులు మొత్తం రూ.111.88 కోట్లు. ఇందులో అప్పులు పోను చంద్రబాబు ఆస్తి రూ.3.87 కోట్లు, భువనేశ్వరికి రూ.39.58 కోట్లు, లోకేశ్‌కు రూ.19 కోట్లు, బ్రహ్మణికి రూ.11.51 కోట్ల ఆస్తి ఉండగా.. దేవాన్ష్‌కు రూ.19.42 కోట్ల నికర ఆస్తులున్నాయి. కుటుంబ కంపెనీ నిర్వాణ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుమారు రూ.9.10 కోట్ల నికర ఆస్తులున్నాయి. ఈ వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వెల్లడించారు. గత తొమ్మిదేళ్ల నుంచీ ఆస్తులు ప్రకటిస్తున్న రాజకీయ కుటుంబం తమదేనని.. దేశంలో మరే రాజకీయ కుటుంబం ఇలా ప్రకటించడం లేదని పేర్కొన్నారు. ‘అంతెందుకు.. తుగ్లక్‌ సీఎం కనీసం ఒక్క ఏడాదైనా తన ఆస్తులు ప్రకటించారా’ అని ప్రశ్నించారు.


తాను ప్రకటించిన దాని కంటే ఒక్క గజం, ఒక్క పైసా, ఒక్క షేరు ఎక్కువుందని నిరూపించినా అది వైసీపీ వాళ్లకే ఇచ్చేస్తానని సవాల్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ అవినీతి ఆస్తులను సీబీఐ, ఈడీ ప్రకటిస్తున్నాయని.. ధైర్యముంటే ఆయన ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలన్న ఉద్దేశంతో 27 ఏళ్ల క్రితం హెరిటేజ్‌ సంస్థను చంద్రబాబు స్థాపించారని, దాన్ని క్రమపద్ధతిలో కష్టపడి అభివృద్ధి చేశామని చెప్పారు. మూడేళ్లు వరుసగా గోల్డెన్‌ పీకాక్‌ అవార్డును కూడా గెలుచుకుందన్నారు. ఆస్తులను తాము కొనుగోలు చేసిన నాటి విలువలతోనే ప్రకటిస్తున్నామని చెప్పారు.


మార్కెట్‌ విలువ ఎప్పటికప్పుడు మారుతుందని.. అందువల్ల దానిని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే బ్యాచ్‌ ఉంటుందని, వాళ్లు ముందు తమ ఆస్తులు ప్రకటించాలన్నారు. 2004లో జగన్‌ ఆస్తులు రూ.9 లక్షలని, 2010 నాటికి సీబీఐ, ఈడీలు రూ.43 వేల కోట్ల ఆస్తులు దోచేశారని ప్రకటించాయని తెలిపారు. రాష్ట్రంలో వ్యక్తిగతంగా తమ కుటుంబానికి ఆస్తులేమీ లేవని లోకేశ్‌ వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో కూడా భూములు లేవన్నారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌కు మాత్రం రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో 9 ఎకరాల భూమి ఉందని.. దానిని 2014లో కొనుగోలు చేసిందని చెప్పారు. ఆ ఏడాది మార్చిలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ ప్లాంటు నిర్మాణం కోసం మంగళగిరి, విశాఖ, చెన్నై తదితర చోట్ల భూములు కొనాలని తీర్మానించిందని.. ఆ ప్రకారం ఆ మూడుచోట్లా భూములు కొనుగోలు చేసినట్లు తెలిపారు. తమకు సింగపూర్‌లో హోటల్‌ ఉందని, ఇంకెక్కడో ఏదో ఉందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారని.. నిరూపించి మీరే తీసేసుకోండని సవాల్‌ చేస్తుంటే మాత్రం ముందుకు రావడం లేదన్నారు. టీడీపీ ప్రజా చైతన్య యాత్రలపై ఒకే రోజు 15 మంది మంత్రులు ప్రెస్‌మీట్లు పెట్టి విమర్శించడం వారి భయానికి అద్దం పడుతోందన్నారు. 


బాబు ఆస్తులు.. నిరుటి కంటే 88 లక్షలు ఎక్కువ 

చంద్రబాబు నికర ఆస్తులు గత ఏడాది కంటే రూ.88 లక్షలు పెరిగాయి. బ్యాంకు, నగదు నిల్వలు రూ.70 లక్షలు పెరగడం, అప్పులు రూ.18 లక్షల మేర తగ్గడంతో ఆ మేరకు ఆస్తులు పెరిగాయి. భువనేశ్వరి ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.8.50 కోట్లు పెరిగాయి. నిరుడు నికర ఆస్తులు రూ.31.01 కోట్లు కాగా...ఈ ఏడాది రూ.39.58 కోట్లకు చేరాయి. ఆస్తులు పెరగడం, అదే సమయంలో బ్యాంకు రుణం తగ్గడం వల్ల నికరంగా ఆస్తులు పెరిగాయి. బ్రహ్మణి నికర ఆస్తులు గత ఏడాదికంటే రూ.3.8 కోట్ల మేర పెరిగాయి. ప్రావిడెంట్‌ ఫండ్‌ రూ.32 లక్షల నుంచి రూ.55 లక్షలకు పెరగడం, అప్పులు రూ.5.66 కోట్ల నుంచి రూ.4.17కోట్లకు తగ్గడం తదితర కారణాలతో నికర ఆస్తులు పెరిగాయి.







Updated Date - 2020-02-21T10:10:31+05:30 IST