దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యండి.. జగన్‌కు చంద్రబాబు 48 గంటల డెడ్‌లైన్‌

ABN , First Publish Date - 2020-08-04T08:38:07+05:30 IST

‘‘ఎన్నికల ముందు అమరావతే రాష్ట్ర రాజధాని అన్నారు. ఎన్నికలు కాగానే నయ వంచనకు పూనుకున్నారు. ఎన్నికల ముందు చెప్పకుండా ఇప్పుడు

దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యండి.. జగన్‌కు చంద్రబాబు 48 గంటల డెడ్‌లైన్‌


రాజధానులపై ప్రజా తీర్పు కోరండి

మీకు మద్దతు లభిస్తే మేమిక మాట్లాడం

ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టారు

అమరావతికే మా మద్దతన్నది మీరు కాదా?

ఇప్పుడు తరలింపు వంచన.. నమ్మక ద్రోహం

అందుకే ప్రజల తీర్పును కోరమంటున్నాం

రాజధాని కోసం న్యాయపోరాటం ఓ భాగం

మోసగాళ్లను ప్రజాకోర్టులో నిలబెడతా: బాబు


48 గంటల గడువు ముగిసిన తర్వాత నేను మళ్లీ ప్రజల ముందుకు వస్తాను. ప్రతి అంశంపైనా చర్చిస్తా. వాస్తవాలు, గణాంకాలు అన్నీ ప్రజల ముందు పెడతాను. నమ్మక ద్రోహులను, నయ వంచకులను నడి వీధిలో నిలబెడతాను.


చంద్రబాబు


అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎన్నికల ముందు అమరావతే రాష్ట్ర రాజధాని అన్నారు. ఎన్నికలు కాగానే నయ వంచనకు పూనుకున్నారు. ఎన్నికల ముందు చెప్పకుండా ఇప్పుడు రాజధానిని మార్చే హక్కు మీకు లేదు. మీకు 48 గంటల సమయం ఇస్తున్నాను. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ప్రజా తీర్పు కోరండి. ప్రజలు రాజధాని విషయంలో మీ వాదనకు మద్దతు ఇస్తే మేం ఇక మాట్లాడం. మీకు ఆ దమ్ము ఉందో లేదో తేల్చుకోండి’’ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు....ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు రాజధాని మార్పు గురించి వైసీపీ నేతలు ఎక్కడా చెప్పలేదని... పైగా దానికే తమ పూర్తి మద్దతని పలుమార్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టారని చంద్రబాబు ఆరోపించారు.


‘‘2014 సెప్టెంబరు నాలుగో తేదీన రాష్ట్ర శాసనసభలో జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ... విజయవాడలో రాజధాని ఏర్పాటును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు. పైగా 30 వేల ఎకరాలు ఎక్కడ లభ్యమైతే అక్కడ పెట్టమని కూడా సూచించారు. ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎన్నికల ముందు మాట్లాడుతూ... రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. భూ కబ్జాలు, రియల్‌ ఎస్టేట్‌ చేసేవారికే రాజధాని మార్పు కావాలని, రాజధానిగా అమరావతే ఉంటుందని బొత్స సత్యనారాయణ చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఇదే చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ అయితే...రాజధాని మారితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతానని ప్రకటించారు. ఈ మాటలన్నీ ఏమయ్యాయి?’’ అని ప్రశ్నించారు.  


మేనిఫెస్టోలో రాజధానులేవి?: మేనిఫెస్టో తమకు బైబిల్‌... ఖురాన్‌... భగవద్గీత అని చెబుతారు. ఆ బైబిల్‌లో రాజధాని మార్పు గురించి ఎందుకు పెట్టలేదు? చెప్పకుండా ఎలా చేస్తారు? ఇదేమన్నా మీ సొంత విషయమా? ఐదు కోట్లమంది ప్రజలకు సంబంధించింది. తెలుగువారు ఇప్పటికే అనేకసార్లు దగాకు గురయ్యారు. ఇప్పుడు మీరు మరోసారి వెన్నుపోటు పొడిచారు. మీపై మీకు నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేయండి. ప్రజలకు చెప్పకుండా... వారి తీర్పు కోరకుండా మార్చే హక్కు మీకు లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. తమ 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని కొందరు  వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని... కొందరేం ఖర్మ మొత్తం అందరూ కలిసి రాజీనామా చేస్తే ప్రజలు తమ తీర్పు ఇస్తారని వ్యాఖ్యానించారు. ‘‘రాజధాని అనేది అమరావతి రైతులదో, జేఏసీదో, రాజకీయ పార్టీలకు సంబంధించిందో కాదు. మొత్తం రాష్ట్ర ప్రజలందరిదీ. అందరూ ఆలోచించాలి. ప్రతిస్పందించాలి. న్యాయ పోరాటం ఒక భాగం. కానీ ప్రజా కోర్టులో ఈ మోసగాళ్లను నిలబెట్టాలి’’ అని చెప్పారు. 


ఉన్న బలమంతా చట్టమే..

బలమైన చట్టాన్ని టీడీపీ ప్రభుత్వం చేసి ఉండాల్సిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, విభజన చట్టానికి మించిన బలమైన చట్టం ఏముంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘విభజన చట్టంలో ఒక రాజధాని ఏర్పాటు అన్నారుగాని మూడు రాజధానులని చెప్పలేదు. ఆ చట్టం ఆధారంగానే అమరావతిలో రాజధాని ఏర్పాటుచేసుకొన్నాం. హైకోర్టు ఎక్కడ పెట్టాలో సుప్రీంకోర్టు సలహాతో రాష్ట్రపతి నిర్ణయిస్తారని చట్టంలో రాశారు. ఆ ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైకోర్టు ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా వచ్చారు. ప్రభుత్వం తరఫున రైతులతో సీఆర్డీయే ఒప్పందం చేసుకుంది. దానిని ఏకపక్షంగా ఎలా మార్చేస్తారు? పిచ్చి తుగ్లక్‌ మాత్రమే ఇలాంటివి చేయగలరు. తప్పుడు నిర్ణయాలతో 60-70 సార్లు ఇప్పటికి కోర్టులతో మొట్టికాయలు వేయించుకొన్నారు. అయినా మార్పు రావడం లేదు’’ అని చెప్పారు. మూడు ప్రాంతాల అభివృద్ధి అని కబుర్లు చెబుతున్నారని, అభివృద్ధి అంటే ఏమిటో కూడా చర్చ జరగాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.


తనకు శక్తి ఉన్నంతవరకూ తెలుగువారి అభివృద్ధికి శ్రమించి పని చేశానని, ఇప్పుడు కూడా లాభనష్టాలేమిటో, మంచి చెడులేమిటో విపులంగా ప్రజలకు చెబుతానని, లేదంటే చరిత్ర హీనుడుగా మిగలాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘48 గంటల గడువు ముగిసిన తర్వాత మళ్లీ ప్రజల ముందుకు వస్తాను. ప్రతి అంశంపై చర్చిస్తాను. వాస్తవాలు...గణాంకాలు అన్నీ ప్రజల ముందు పెడతాను. ఒక రోజు కాదు. అనేక రోజులపాటు చర్చ జరుపుతాను. ప్రజల్లోకి తీసుకువెళ్తాను. నమ్మక ద్రోహులను, నయ వంచకులను నడి వీధిలో నిలబెడతాను’’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో 75  శాతం ప్రజలు ఈ నిర్ణయాలను ఆమోదించడం లేదని సర్వే నివేదికలు వస్తున్నాయని చెప్పారు. కరోనా విజృంభించి అతలాకుతలం  చేస్తున్న సమయంలో దానిని వదిలిపెట్టి పైశాచిక రాజకీయ ఆనందం కోసం నిర్ణయాలు తీసుకొంటున్నారని, ఏ సమయంలో ఏం చేస్తున్నారో కూడా అర్ధం కాని మూర్ఖత్వం ఆవరించిందని  వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-08-04T08:38:07+05:30 IST