Advertisement
Advertisement
Abn logo
Advertisement

మళ్లీ సీఎం అయ్యాకే సభకు వస్తా : అసెంబ్లీలో చంద్రబాబు శపథం

అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. తాను తిరిగి సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతానంటూ శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. కాగా.. అసెంబ్లీ ప్రారంభమైంది మొదలు టీడీపీతో పాటు పార్టీ అధినేతపై దూషణల పర్వానికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమయం వెచ్చిస్తున్నారు. ఒకవైపు మంత్రి కొడాలి నాని.. చంద్రబాబును ‘లుచ్ఛా’ అంటూ నోటికి పని చెబుతుండగా.. మరోవైపు మరో మంత్రి కన్నబాబు, ఇతర ఎమ్మెల్యేలు తమదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


అంతటితో ఆగక చంద్రబాబును అవమానపరుస్తూ మాట్లాడటమే కాకుండా ఆయన కుటుంబంలోని మహిళలపై సైతం నోరు పారేసుకున్నారు. ఆయన భార్యతో పాటు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన చంద్రబాబు కంటతడి పెట్టారు. అనంతరం ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘‘పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశాం. జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశాం. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నాం. ఏనాడూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు నేను చూడలేదు. 


అదే విధంగా ఇన్నేళ్లుగా జరగని అవమానాలను భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి.. కుప్పం ఎన్నికల తర్వాత నేను రావాలి. నా ముఖం చూడాలన్నా కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్‌లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలున్నాయి. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా విమర్శించారు. ఇన్ని సంవత్సరాలుగా ఏ పరువు కోసం పని చేశానో.. ఇన్నేళ్లుగా బతికామో.. నా కుటుంబం, నా భార్య విషయం కూడా తీసుకొచ్చి(మాట్లాడుతుండగానే మైక్ కట్ చేసిన స్పీకర్) అవమానించారు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా’’ అని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

Advertisement
Advertisement