అస్తవ్యస్తమైన ‘పుర’పాలన

ABN , First Publish Date - 2021-03-06T06:14:00+05:30 IST

పురపాలక సంఘాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. సొంతంగా నిధులు కేటాయించే పద్ధతిని ప్రభుత్వం నిలిపివేసింది. కేంద్రం నిధులు ఇస్తే తప్ప సొంత నిధులతో పనులు చేపట్టడానికి ప్రణాళికలు లేవు....

అస్తవ్యస్తమైన ‘పుర’పాలన

పురపాలక సంఘాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. సొంతంగా నిధులు కేటాయించే పద్ధతిని ప్రభుత్వం నిలిపివేసింది. కేంద్రం నిధులు ఇస్తే తప్ప సొంత నిధులతో పనులు చేపట్టడానికి ప్రణాళికలు లేవు. పట్టణీకరణ సమస్యలపై పని చేస్తున్న ప్రజా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దేశంలోని40 నగరాల్లో, పట్టణాల్లో అధ్యయనం నిర్వహించి మెరుగైన పాలన ప్రాతిపదికన సూచీలు ప్రకటించింది. ఈ సూచీల్లో ఒడిషా మొదటి స్థానం దక్కించుకోగా ఆంధ్రప్రదేశ్ 15 స్థానంలో ఉంది.


భవిష్యత్తును బాగు చేసుకోవడానికి ఓటుకు మించిన బ్రహ్మాస్త్రం లేదు. జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమయింది. ఈ రెండేళ్ల కాలంలో పట్టణాలు, నగరాలను పట్టించుకోకపోవడంతో మున్సిపాలిటీలు మురికిపాలిటీలుగా మారాయి. మరి పురపాలకసంఘాల ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు ఓటు వెయ్యాలి? జగన్ పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి ఎక్కడా కనబడడం లేదు. ఇరవై నెలల్లో లక్షా 80 వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా, వడ్డీలకు అడ్డాగా మార్చారు. 10 నెలల్లోనే రూ.73,913 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ వెల్లడించింది. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల అప్పుల భారం మోపారు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం హయాంలో అమలు చేసిన 34 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. అప్పులు తెచ్చుకోవడం కోసం ఆస్తి పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న ఘనత జగన్‌దే. 


పట్టణ పేదల సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. అభివృద్ధి నిలిచిపోయింది. పేదరికం, ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. నిరుద్యోగం ప్రబలింది. పారిశ్రామికీకరణ కుంటుపడి ప్రజల ఆదాయాలు క్షీణించాయి. వైసీపీ నాయకుల ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప ప్రజల ఆస్తులు పెరగడం లేదు. ప్రజల సంపదను పూర్తిగా కొల్లగొట్టేస్తున్నారు. 2018-–19లో టీడీపీ ప్రభుత్వం పట్టణాల్లో రూ.6,562కోట్లు ఖర్చుపెడితే, అందులో కేపిటల్ ఎక్స్‌పెండిచర్ రూ.1,391కోట్లు. 2019–-20లో జగన్ ప్రభుత్వం రూ.4,801కోట్లు ఖర్చుపెడితే అందులో కేపిటల్ ఎక్స్‌పెండిచర్ రూ.673కోట్లు మాత్రమే. 2018–-19లో కంటే 2019–-20లో రూ. 1761కోట్లు తక్కువ ఖర్చు పెట్టారు. కేపిటల్ ఎక్స్‌పెండిచర్ సగానికి పైగా తగ్గిపోయింది. 2020-–21 బడ్జెట్‌లో రూ.8,150 కోట్లు కేటాయించారు. కేపిటల్ ఎక్స్‌పెండిచర్కు రూ.1,203 కోట్లు కేటాయించారు. తొలి ఏడాది రూ.673కోట్లు కూడా ఖర్చు పెట్టలేని వాళ్లు ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ ఏం ఖర్చు పెట్టగలరు? కేపిటల్ ఎక్స్‌పెండిచర్ కూడా పూర్తిగా ఖర్చుపెట్టలేని వీళ్లు పట్టణాభివృద్ధి ఎలా సాధించగలరు? అందుకే మున్సిపాలిటీలలో ఓట్లు అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదు. 


ప్రస్తుత పాలకులు పేదల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గృహ నిర్మాణాల కోసం కేటాయించిన దాంట్లో ఖర్చుపెట్టింది శూన్యం. 2018–-2019లో గృహ నిర్మాణం కోసం రూ.3,189 కోట్లు ఖర్చు పెడితే అందులో కేపిటల్ ఎక్స్‌పెండిచర్ రూ.1078 కోట్లు కాగా 2019–-20లో మాత్రం సవరించిన అంచనా రూ.963 కోట్లు. కేపిటల్ ఎక్స్ పెండిచర్ రూ.26.37 లక్షలు మాత్రమే. 2020–-21లో కేవలం రూ.3,690 కోట్లు కాగా కేపిటల్ ఎక్స్‌పెండిచర్ శూన్యం. గృహ నిర్మాణం జగన్ పాలనలో పూర్తిగా పడకేసింది. రెండేళ్లుగా మున్సిపాలిటీల్లో రోడ్లపై తట్టి మట్టి వెయ్యలేదు. పట్టణ, నగర జనాభాకు తగిన విధంగా వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. పారిశుద్ధ్య నిర్వహణ నిర్లక్ష్యానికి గురయింది. పట్టణాల్లో, నగరాల్లో ఎటువంటి అభివృద్ధి చేయలేని జగన్ పాలన గురించి పట్టణ ఓటర్లంతా ఆలోచించాలి. ఆయన హయాంలో సంక్షేమ పథకాల రద్దు గురించి పేదలందరూ ఆలోచించాలి. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలి. అసత్యాలు అభూత కల్పనలతో జనానికి అంత చేసాం, ఇంత చేసాం అంటూ మసిపూసి మారేడుకాయ చేసే విధంగా అంతా బ్రహ్మాండం అంటూ పత్రికా ప్రకటనలతో పెద్దఎత్తున ప్రజాధనం మాత్రం దుర్వినియోగం చేస్తున్నారు. 


అసెంబ్లీ ఎన్నికల ముందు మురికివాడలు లేని పట్టణాలుగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికారు. కానీ ఒక్క మురికివాడను కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. పురపాలక సంఘాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. సొంతంగా నిధులు కేటాయించే పద్ధతిని ప్రభుత్వం నిలిపివేసింది. కేంద్రం నిధులు ఇస్తే తప్ప సొంత నిధులతో పనులు చేపట్టడానికి ప్రణాళికలు లేవు. పట్టణీకరణ సమస్యలపై పని చేస్తున్న ప్రజా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దేశంలోని 40 నగరాల్లో, పట్టణాల్లో అధ్యయనం నిర్వహించి మెరుగైన పాలన ప్రాతిపదికన సూచీలు ప్రకటించింది. ఈ సూచీల్లో ఒడిషా మొదటి స్థానం దక్కించుకోగా ఆంధ్రప్రదేశ్ 15 స్థానంలో ఉంది. ఎడా, పెడా ప్రత్యక్ష, పరోక్ష భారాలు మోపి పట్టణ ప్రజల ఉనికికే ప్రమాదం తెస్తున్నారు.


ఆస్తి విలువ ఆధారంగా పన్ను రేటు నిర్ణయించాలన్న కేంద్రప్రభుత్వ ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. దీనివల్ల ఆస్తి పన్ను నుంచి మినహాయింపు పొందుతున్న గుడిసెవాసులు, రేకుల షెడ్లలో నివసించే వారు కూడా ఇక నుంచి ఆస్తి పన్ను కట్టాలి. వారు ఉండేది గుడిసె అయినా పెరిగిన భూమి విలువ ఆధారంగా పన్ను కట్టాల్సి వస్తుంది. లక్షలాది పట్టణ పేదల నుంచి ఆస్తి పన్ను గుంజుకోబోతున్నారు. దీనిని బట్టి ఇళ్ల అద్దెలు కూడా భారీగా పెరగనున్నాయి. మున్సిపాలిటీల్లో ఖాళీ స్థలం విలువ కోటి రూపాయలు ఉంటే ఏడాదికి రూ.20,000 పన్ను కట్టాలి. అదే మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఏడాదికి పన్ను రూ.50 వేలు చెల్లించాలి. మున్సిపాలిటీల్లో ఉన్న వృత్తి, వినోద పన్నులు, స్టాంపు డ్యూటీ పన్నులు, తాగునీరు, పారిశుద్ధ్యం, చెత్త పన్ను, నీటికి మీటర్లు వంటి వాటిపై చార్జీలు పెంచబోతున్నారు. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా పట్టణ, నగరాభివృద్ధే కొలమానం అవుతుంది. ఉండటానికి ఇల్లు, తాగడానికి మంచినీరు, డ్రైనేజీవ్యవస్థ, పారిశుధ్యం, మెరుగైన రవాణా, విద్య, వైద్య సౌకర్యాలు, ఉపాధి అవకాశాలను పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. 


మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వివిధ ఆర్థికసంస్థల నుంచి నిధులు సమీకరించి తాగునీటి సరఫరా, వీధిదీపాలు, రహదారులు, డ్రైనేజి, మురుగునీరు, వరదనీటి పారుదల వ్యవస్థల అభివృద్ధికి, పచ్చదనం, పారిశుధ్యం, సుందరీకరణకు ప్రాధాన్యం ఇచ్చింది. మౌలిక సదుపాయాల కల్పనకు పట్టణాల్లో నాలుగేళ్లలో రూ.1,05,972 కోట్లు ఖర్చు చేసింది గత తెలుగుదేశం ప్రభుత్వం. పట్టణాల్లో రోజువారీ నీటి సరఫరాను 1,718 మిల్లీ లీటర్లకు చేర్చింది. ఇందుకోసం రూ.3,681 కోట్లకు పైగా ఖర్చు చేసింది. మురుగు నీటి నిర్వహణను 422 మిలియన్ లీటర్లు విస్తరించింది. వరదనీటి పారుదల వ్యవస్థను 23,588 కిలోమీటర్లకు పెంచింది. 110 పట్టణాల్లో 6,38 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేసింది. పచ్చదనం, సుందరీకరణకు రూ.300 కోట్లు ఖర్చు చేసింది. 2,38,726 వ్యక్తిగత, సామాజిక, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, పాఠశాలల్లో 1,400 మరుగుదొడ్లు నిర్మాణం, పట్టణ పేదలకు 9,58,230 ఇళ్ల నిర్మాణం చేపట్టింది.


పట్టణాల్లో నాలుగేళ్ల వ్యవధిలో 2,772 కిలోమీటర్ల రహదారులు నిర్మాణం చెయ్యగా, రూ.7,525 కోట్లతో మరో 5,482 కిలోమీటర్ల మేరకు రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల్లో అమలవుతున్న సంస్కరణలు, వివిధ కార్యక్రమాలు, సాంకేతిక అనుసంధానం వంటి అంశాలలో కేంద్రప్రభుత్వం, ఇతర అత్యుత్తమ సంస్థల నుంచి గత ప్రభుత్వానికి 46 పురస్కారాలు దక్కాయి. అందువల్ల అవినీతిపరులకు, అసమర్థులకు, అవకాశవాదులకు అవకాశం ఇవ్వడం వల్ల భవిష్యత్ అంధకారం అయిందని ఇప్పుడు బాధపడటం వల్ల ప్రయోజనం లేదు. 


మంచి సమాజాన్ని నిర్మించుకోవాలంటే ఎన్నికల్లో యువత నిర్ణయాత్మక పాత్ర పోషించాలి. యువశక్తి అనన్య సామాన్య మైనది. అటువంటి యువత రాష్ట్రాభివృద్ధికి పునరంకితం కావాలి. యువతకు తగిన నైపుణ్యాలను కల్పించి వారిని సుశిక్షితులుగా మార్చి ఆధునిక సవాళ్ళకు అనుగుణంగా తీర్చిదిద్దే నాయకత్వం అవసరం. ఆదర్శాలు వల్లె వేయకుండా స్వచ్ఛంగా, నిర్భయంగా వ్యవహరించే నాయకత్వం నేడు యువతరానికి అవసరం. సమర్థత కలిగిన నాయకుడికి ఓటు వేస్తేనే యువత భవితకు బాటలు పడతాయి. సంకుచిత రాజకీయం నూరిపోసి ప్రజలను తప్పుదారి పట్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని ఆరాటపడుతున్నవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రం అధోగతిపాలు అవుతుందని ఆవేదన చెందే వారు ఓటును బాధ్యతగా వినియోగిస్తేనే సమాజానికి, భావితరానికి మేలు జరుగుతుంది. ప్రజాస్వామ్య వజ్రాయుధమే ఓటు. మంచికి, సమర్థతకి పట్టంకట్టి మన జీవితాలను మనం బాగుచేసుకుందాం. చట్టబద్ధపాలనకు సమాధి కట్టి అవినీతే రాజనీతిగా చెలరేగిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఉద్ధరిస్తాను అంటూ మభ్యపెట్టే మాటలతో ఓటర్లను ఓడించి తాము గెలవాలని చూస్తున్న మాయలోళ్లకు ఓటర్లు గుణపాఠం చెప్పాలి. సంక్షోభాలకు, సవాళ్ళకు సమాధానం చెప్పగల సమర్థ నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలి. మన భవిష్యతు‌ను బాగుచేసుకునే నిర్ణయంలో తప్పటడుగు పడితే మనం పడేది అగాథంలోనే. అందుకే ప్రజలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో క్రియాశీలకంగా, బాధ్యతగా ఓటు వేయాలి. 


-యనమల రామకృష్ణుడు

మాజీ ఆర్థికమంత్రి

Updated Date - 2021-03-06T06:14:00+05:30 IST