అస్తబ్ధ మక్లీబ మదీర్ఘ సూత్రం
సానుక్రోశం శ్లక్ష్ణ మహార్య మన్యైః
అరోగ జాతీయ ముదార వాక్యం
దూతం వదన్త్యష్ట గుణోపపన్నమ్!
ఒక దూతకు ఉండవలసిన ఎనిమిది లక్షణాల గురించి విదురుడు చెప్పిన శ్లోకమిది. అస్తబ్ధము అంటే మందకోడితనము లేకుండా చలనశీలిగా ఉండాలి. గర్వం ఉండకూడదు. సామర్థ్యం ఉండీ స్పందన లేకపోవడం క్లీబత్వం. నిశ్చయానికి త్వరగా రాని లక్షణం దీర్ఘసూత్రం. అదీర్ఘసూత్రుడు అంటే పనులలో జాగు సేయని వాడు లేదా సోమరితనం లేనివాడు. సానుక్రోశమ్ అంటే దయగల వాడు, శ్లక్ష్ణమ్ అంటే అందరూ మెచ్చేవాడు లేదా మంచి నడవడి కలవాడు. ఆహారమన్యైః అంటే ఇతరులకమ్ముడు పోని వాడు. అరోగం అంటే ఆరోగ్యం కలవాడు. ఉదారవాక్యం అంటే యుక్తితో కూడిన, గొప్ప ప్రయోజనం సాధించే మాటలు మాట్లాడేవాడు. ఈ లక్షణాలన్నీ దూతకు ఉండాల్సినవని విదురుడు చెబుతాడు.
దూతకృత్యం నిర్వహించే వ్యక్తికి తెలివి, విచక్షణ జ్ఞానం, భావ వ్యక్తీకరణ సామర్థ్యం, లోతైన పరిశీలన శక్తి, ధైర్యం, సాహసం, విషయంపై సమగ్ర అవగాహన ఉంటే అతని మాటలలోని సత్యాసత్యాలు ఎలాగున్నా ఆ మాటలను ఎదుటి వారు వింటారు. అతనిని నమ్ముతారు, అతను పెట్టిన ప్రతిపాదనలను అంగీకరిస్తారు. ప్రాచీన భారతీయ సంస్కృతిలో దూత అంటే కేవలం వార్తాహరునిగా చెప్పబడలేదు. దూత రాజాస్థానంలో గౌరవనీయుడైన ఒక ఉన్నతోద్యోగి. సైన్యంలో ముఖ్య నాయకుడు. రక్షణ విభాగంలో ముఖ్యుడు. విషయాలను ఏ పొరపాటూ లేకుండా సూక్ష్మదృష్టితో విశ్లేషణ చేసి రాజుకు నివేదించే వాడు. రాజుకు, వ్యవస్థకు విశ్వాసపాత్రుడు. ఏ ప్రలోభాలకూ లొంగని వాడై, నిందలకు అతీతంగా, స్థిరచిత్తుడై, సమయ స్ఫూర్తితో వ్యవహరించ గలిగి ఉండేవాడు. అలాగే.. మాటకారి, లోతైన ధీశక్తి, సహనం, ఓర్పు, సృజనాత్మకంగా యోచించగలగడంలో నైపుణ్యం కలిగిన వారే దౌత్యాన్ని విజయవంతంగా నిర్వహించగలరు.
ఏ దురలవాటూ లేకుండా, శారీరక దారుఢ్యం కలవాడై, ఎంతటి శ్రమనైనా తట్టుక్గోలిగి, వివిధ అంశాలపట్ల అవగాహనాపూర్ణుడై ఉండేవారు.. నీతి నిజాయతీ కలిగిన వారై, భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక పార్శ్వాలలో సమతుల్యతను పాటిస్తూ, సచ్ఛీలురై క్రమశిక్షణాయుత జీవితాన్ని గడిపేవారు దూతగా రాణిస్తారు. ఈ లక్షణాలన్నీ రామాయణంలో ఆంజనేయుడు, భారతంలో సంజయుడు, శ్రీకృష్ణుడు వంటివారిలో గమనించవచ్చు. ఈ లక్షణాలనే నేటి కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులలో కోరుకుంటున్నాయి.