Abn logo
Oct 15 2021 @ 01:35AM

‘నిషేధ భూముల’ సమస్యలకు చెక్‌

22-ఏ దుర్వినియోగంపై సర్కారు కీలక నిర్ణయం 

సమగ్ర విధానం రూపొందించాలన్న సీఎం జగన్‌ 

విమర్శలు, ఆరోపణలకు  తావులేకుండా వ్యవస్థ

భూమి రికార్డుల అప్‌డేషన్‌కు ప్రత్యేక డ్రైవ్‌ 

లోపాల సవరణకు  న్యాయ నిపుణుల సేవలు 

రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్లపై ఎస్‌ఓపీ రూపకల్పన

సర్వే డేటా భద్రపరిచేందుకు చర్యలు తీసుకోండి 

రెవెన్యూ శాఖకు సీఎం ఆదేశాలు 


అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): భూములను అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేరుస్తున్న ఉదంతాలపై సర్కారు స్పందించింది. రిజిస్ట్రేషన్‌ చట్టం-1908లోని 22-ఏ క్లాజును దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ అవసరాలకు వినియోగించుకుంటున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. నిషేధ భూముల జాబితా 22-ఏను ఇప్పుడు ఎలా అమలు చేస్తున్నారు? ఇంతకు ముందు ఎలా అమలు చేశారు? లోపాలను ఎలా అధిగమించాలి? ప్రభుత్వ భూములను కాపాడుతూనే సాగు భూములను నిషేధ జాబితాలో చేర్చకుండా ఎలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలో అధ్యయనం చేసి ఓ సమగ్ర విధానం రూపొందించాలని రెవెన్యూ శాఖను సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో రెవెన్యూ, సర్వేశాఖలు చేపట్టిన భూముల సమగ్ర సర్వేపై గురువారం ఆయన సమీక్షించారు. నిషేధ భూముల జాబితా అంశం అజెండాలో లేదు.


సీఎం స్వయంగా ఈ అంశాన్ని ప్రస్తావించి, 22-ఏ కేసుల సమస్యలు ఎక్కువగా ఎందుకొస్తున్నాయని ప్రశ్నించారు. గతంలో పెద్దఎత్తున తప్పులు జరిగాయని, ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకే కేసుల పరిష్కారం జరుగుతోందని అధికారులు నివేదించారు. అయినా ఇటీవల రచ్చకెక్కిన కొన్ని 22-ఏ కేసులను సీఎం ప్రస్తావిస్తూ, ఎవరి భూములైనా నిషేధ భూముల జాబితాలో పెడతారా అని ఆరాతీసినట్లు సమాచారం. ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ప్రయోజనాలతో ముడిపడిన భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో సామాన్యులు, రైతులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ‘‘నిషేధ భూముల జాబితాను అమలు చేసే విషయంలో తప్పిదాలు, పొరపాట్లు జరగకూడదు. ఉద్దేశపూర్వక చర్యలు ఇకపై జరగడానికి వీల్లేదు. వీటిన్నింటికీ పుల్‌స్టాప్‌ పెట్టేందుకు సమగ్రమైన పాలసీ రూపొందించండి’’ అని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ‘‘నిషేధ భూముల జాబితాలో ఒక భూమిని చేర్చాలంటే ఎవరికి అధికారం ఉంది? 22-ఏలో చేర్చిన భూమిని తిరిగి బయటకు తీసే అధికారం ఎవరికి ఉంది? వీటిపై స్పష్టత ఇవ్వండి. విమర్శలు, ఆరోపణలకు తావులేకుండా ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి’’ అని సీఎం ఆదేశించారు. భూముల రిజిస్ట్రేషన్‌ అనంతరం చట్టప్రకారం వెంటనే రికార్డులు అప్‌డేట్‌ చేయాలని సూచించారు. భూమి రికార్డుల అప్‌డేషన్‌, లోపాల సవరణకు న్యాయ నిపుణుల సేవలను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. నిపుణులు, అనుభవజ్ఞులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని, వారి సిఫారసుల ఆధారంగా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్లపై ప్రత్యేక స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌(ఎ్‌సఓపీ)ని రూపొందించాలని ఆదేశించారు. ప్రజలు నిరంతరం తమ పనుల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఈ విధానం ఉండాలన్నారు. భూమి రికార్డుల అప్‌డేషన్‌కు ప్రత్యేక కాలపరిమితి ఉండాలన్నారు. ఏటా ఒక వారం లేదా పక్షం రోజులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.


పైలట్‌ ప్రాజెక్టు కింద 512 గ్రామాల్లో చేపట్టిన భూముల సర్వే పూర్తయిందని అధికారులు సీఎంకు నివేదించారు. డిసెంబరు నాటికి 650 గ్రామాల్లోనూ సర్వే పూర్తిచేస్తామన్నారు. కాగా, రీసర్వే కోసం అవసరం మేరకు డ్రోన్లను సమకూర్చుకొనేందుకు రెవెన్యూ, సర్వేశాఖలకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. సర్వే డేటాను భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.