అనవసర కాల్స్‌కు ‘దూస్రా నెంబర్‌’తో చెక్‌

ABN , First Publish Date - 2020-09-18T06:09:51+05:30 IST

స్పామ్‌ కాల్స్‌, మెసేజీలను కట్టడి చేయడానికి...

అనవసర కాల్స్‌కు ‘దూస్రా నెంబర్‌’తో చెక్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎక్కడైనా కొనుగోళ్లు చేసినప్పుడు ఇప్పుడు మొబైల్‌ నెంబర్‌ అడగడం సర్వ సాధారణమైంది. ఇలా ఇచ్చిన తర్వాత వచ్చే స్పామ్‌ కాల్స్‌, మెసేజీలతో విసుగెత్తుతుంది. ఇటువంటి వాటిని కట్టడి చేయడానికి మన ఫోన్‌ నెంబర్‌ ఇవ్వకుండా, మరో నెంబర్‌ ఇచ్చి తద్వారా మన ఫోన్‌కు వచ్చే కాల్స్‌కు అవసరమైతే తర్వాత మళ్లీ మనమే కాల్‌ చేసే కొత్త సదుపాయాన్ని హైదరాబాద్‌కు చెందిన టెన్‌20 ఇన్ఫోమీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. దూస్రా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, సబ్‌స్ర్కైబ్‌ చేస్తే.. 10 అంకెల నెంబరు ఇస్తారు. ఈ యాప్‌ను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభించారు. ఎక్కడైనా మొబైల్‌ నెంబర్‌ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దూస్రా నెంబర్‌ ఇస్తే సరిపోతుందని దూస్రా వ్యవస్థాపకుడు, సీఈఓ ఆదిత్య ఊచి తెలిపారు. దూస్రా యాప్‌లో చేసుకున్న సెట్టింగ్‌లకు అనుగుణంగా దూస్రా నెంబర్‌కు వచ్చే కాల్స్‌ బ్లాక్‌ అవుతాయి. లేదా వాయిస్‌ మెయిల్‌కు బదిలీ అవుతాయి. మెసేజీలు మెసేజీల ఫోల్డర్‌లోకి నిశ్శబ్ధంగా చేరతాయి. దీనివల్ల అవసరం అనుకున్న నెంబర్లకు మళ్లీ మనమే ఫోన్‌ చేయొచ్చు. ఈ సేవలు పొందడానికి సంవత్సరానికి రూ.700 చందా కట్టాల్సి ఉంటుంది.

Updated Date - 2020-09-18T06:09:51+05:30 IST