ఏసీబీ గాలానికి చిక్కిన భారీ అవినీతి తిమింగలం

ABN , First Publish Date - 2020-12-16T18:01:19+05:30 IST

చెన్నైలో పర్యావరణ శాఖ సూపరింటెండెంట్‌ నివాసగృహంలో

ఏసీబీ గాలానికి చిక్కిన భారీ అవినీతి తిమింగలం

చెన్నై : చెన్నైలో పర్యావరణ శాఖ సూపరింటెండెంట్‌ నివాసగృహంలో అవినీతి నిరోధక విభాగం అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ.1.37 కోట్ల నగదు, మూడు కిలోల బంగారు నగలు, ఏడు కోట్ల విలువైన ఆస్తి పత్రాలు లభించాయి. చెన్నై సైదాపేట పానగల్‌ మాళిగై భవనంలో రాష్ట్ర పర్యావరణ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌గా పాండ్యన్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన గత కొంతకాలంగా భారీగా ముడుపులు స్వీకరించి పలు సంస్థలకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు మంజూరు చేశాడంటూ ఏసీబీ అధికారులకు ఫిర్యాదులందాయి. దీంతో ఏసీబీ అధికారులు సోమవారం నుంచి ఆ కార్యాలయంలో తనిఖీలు ప్రారంభించారు. ఆ సందర్భంగా లెక్కల్లోకి రాని రూ.88,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.


ఇక పాండ్యన్‌ వాహనంలో ఉంచిన రూ.38,66,220 స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం సాలిగ్రామం తిలకర్‌ వీధిలో ఉన్న పాండ్యన్‌  గృహంలో తనిఖీలు జరపగా రూ.1.37 కోట్ల నగదు పట్టుబడింది. లాకర్లలో, బీరువాల్లో భద్రపరచిన 3.08 కిలోల బంగారు నగలు, మూడు  కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన  నగల విలువ రూ.1.22 కోట్లని,  వెండి ఆభరణాల విలువ రూ.51 లక్షలని  తెలిపారు. ఇదేవిధంగా రూ.5.40 లక్షల విలువైన వజ్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత బీరువాలలో దాచి ఉంచిన ఆస్తి పత్రాలను పరిశీలించినప్పుడు ఏసీబీ అధికారులు దిగ్ర్భాంతి చెందారు. 18 స్థిరాస్తులకు సంబంధించిన మార్కెట్‌ రేటు ప్రకారం రూ.7కోట్లని అధికారులు తెలిపారు. ఇక బ్యాంకుల్లో రూ.37 లక్షల దాకా ఫిక్సుడ్‌ డిపాజిట్లు  ఉన్నట్టు గుర్తించారు.  పాండ్యన్‌ నివాసగృహం వద్దనున్న టయోటా కారు సహా మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పాండ్యన్‌ భారీ స్థాయిలో అవకతవకలకు పాల్పడి అక్రమార్జనకు పాల్పడినట్టు ఈ తనిఖీల ద్వారా తెలిసిందని ఏసీబీ అధికారులు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం వరకూ తనిఖీలు కొనసాగాయి.

Updated Date - 2020-12-16T18:01:19+05:30 IST