మెస్సీని మించిన మొనగాడు మన ఛెత్రీ

ABN , First Publish Date - 2021-06-09T05:57:47+05:30 IST

ఆధునిక ఫుట్‌బాల్‌ ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్‌ మెస్సీ ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి వీరి సరసన నిలిచే అరుదైన ఘనత...

మెస్సీని మించిన మొనగాడు మన ఛెత్రీ

  • 74 అంతర్జాతీయ గోల్స్‌తో రికార్డు పుటల్లోకి

అర్జెంటీనా స్టార్‌ను అధిగమించిన సునీల్‌.. 

రొనాల్డో తర్వాత నంబర్‌ 2

మెస్సీని దాటేసిన భారత సాకర్‌ కెప్టెన్‌


భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ గోల్స్‌ సంఖ్యలో.. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లయోనల్‌ మెస్సీ (72)ని వెనక్కునెట్టి రికార్డులకెక్కాడు. బంగ్లాదేశ్‌తో సోమవారం రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లో ఛెత్రీ రెండు గోల్స్‌ కొట్టి తన మొత్తం గోల్స్‌ను 74కు పెంచుకున్నాడు. ఈ క్రమంలో భారత్‌ను గెలిపించిన ఈ స్టార్‌ స్ట్రయికర్‌.. వర్తమాన ఆటగాళ్లలో అత్యధిక గోల్స్‌ చేసిన వారిలో పోర్చుగల్‌ మేటి క్రిస్టియానో రొనాల్డో (103) తర్వాతి స్థానంలో నిలిచాడు. 37 ఏళ్ల ఛెత్రీ సికింద్రాబాద్‌లో జన్మించాడు. 2005 నుంచి భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 117 మ్యాచ్‌లు ఆడాడు. 


దోహా: ఆధునిక ఫుట్‌బాల్‌ ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్‌ మెస్సీ ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి వీరి సరసన నిలిచే అరుదైన ఘనత దక్కించుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 74వ గోల్‌ సాధించి అర్జెంటీనా సూపర్‌స్టార్‌ మెస్సీని వెనక్కి నెట్టాడు. దీంతో ప్రస్తుతం ఆడుతున్న ఫుట్‌బాలర్లలో రొనాల్డో (103) తర్వాత చెత్రి రెండో స్థానం దక్కించుకున్నాడు. యూఏఈ స్టార్‌ అలీ మబ్‌ఖౌత్‌ (73), మెస్సీ (72)  తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2022 ఫిఫా ప్రపంచక ప్‌తో పాటు 2023 ఏఎ్‌ఫసీ ఆసియాక్‌పనకు సంయుక్తంగా జరుగుతున్న అర్హత పోటీల్లో భారత జట్టు 2-0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. సోమవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్స్‌నూ ఛెత్రినే సాధించాడు. దీంతో ప్రపంచకప్‌ అర్హత పోటీల్లో ఆరేళ్ల తర్వాత భారత్‌కు విజయం దక్కింది. ఈనెల 15న తదుపరి మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌తో ఆడుతుంది. మరోవైపు ప్రపంచ ఫుట్‌బాల్‌ ఆల్‌టైమ్‌ టాప్‌-10లో చోటు దక్కించుకునేందుకు ఛెత్రి మరో గోల్‌ దూరంలో ఉన్నాడు. సాండర్‌ కోసిస్‌ (హంగేరీ), కమమోటో (జపాన్‌), బషర్‌ అబ్దుల్లా (కువైట్‌) సంయుక్తంగా 75 గోల్స్‌తో ఛెత్రికన్నా ముందున్నారు.





Updated Date - 2021-06-09T05:57:47+05:30 IST