జయించిన ప్రజావివేకం

ABN , First Publish Date - 2021-05-08T05:53:43+05:30 IST

నాలుగు ప్రధాన రాష్ట్రాలలోనూ గెలిచిన పక్షం సంపూర్ణ మెజారిటీ సాధించుకోవడమూ, ఓడిపోయిన పార్టీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉండేందుకు గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాలు పొందడం ఊరట కలిగిస్తోంది....

జయించిన ప్రజావివేకం

నాలుగు ప్రధాన రాష్ట్రాలలోనూ గెలిచిన పక్షం సంపూర్ణ మెజారిటీ సాధించుకోవడమూ, ఓడిపోయిన పార్టీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉండేందుకు గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాలు పొందడం ఊరట కలిగిస్తోంది. ఇదొక ఆనందప్రదమైన పరిణామం. అవును, ప్రజలే విజేతలు.


సమరం ముగిసింది. శాంతి కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇదే ప్రజాస్వామ్య (పోరాటాల) విశిష్టత. ప్రతి రాజకీయపార్టీ కూడా తమకు సంపూర్ణ విజయం దక్కకపోయినా ప్రజల మద్దతు దండిగా లభించిందని చెప్పుకుంది. మరీ ముఖ్యంగా భారతీయ జనతాపార్టీ ఈ విషయాన్ని మరింత ఘంటాపథంగా చాటుకుంటోంది. నాలుగు ప్రధాన రాష్ట్రాలలోనూ గెలిచిన పక్షం సంపూర్ణ మెజారిటీ సాధించుకోవడమూ, ఓడిపోయిన పార్టీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉండేందుకు గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాలు పొందడం ఊరట కలిగిస్తోంది. ఇదొక ఆనందప్రదమైన పరిణామం. అవును, ప్రజలే విజేతలు. ఈ ప్రజాస్వామ్య విజయాలలో ప్రజలతో పాటు భాగస్వాములైన ఇతర పార్టీలు, ఫ్రంట్‌లు: తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్‌ డెమొక్రాటిక్ ఫ్రంట్, ద్రవిడ మున్నేట్ర కజగమ్.


అసోంలో బిజెపి వరుసగా రెండోసారి ఘన విజయం సాధించింది. అయితే కేరళ, తమిళనాడులో ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అసోం, కేరళలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందేందుకు తగిన అర్హత సాధించుకున్నప్పటికీ పశ్చిమబెంగాల్లో ఘోరంగా విఫలమయింది. ఈ ప్రజాస్వామిక పోరాటాలు అన్నిటిలోనూ ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించింది నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ మధ్య సమరమే. అలాగే కేరళలో సిపిఎం, కాంగ్రెస్ నేతృత్వాలలోని ఫ్రంట్‌ల మధ్య పోరాటం కూడా దేశ ప్రజలను బాగా ఆకట్టుకుంది. కాంగ్రెస్ సారథ్యంలోని యుడిఎఫ్ కేవలం 0.8 శాతం ఓట్ల తేడాతో లెఫ్ట్‌ఫ్రంట్ చేతిలో ఓడిపోయింది. 


ప్రాంతీయ పార్టీలే ప్రజలకు సన్నిహితంగా ఉంటున్నాయన్న నా వాదన ఈ అసెంబ్లీ ఎన్నికలలో మరొకసారి రుజువయింది. ఒక ప్రాంతీయపార్టీ రాష్ట్ర ప్రజల భాషనే మాట్లాడుతుంది, వారి సంస్కృతిని మెరుగ్గా అర్థం చేసుకుంటుంది, జనాభాపరమైన మార్పులతో చురుగ్గా సర్దుబాటు చేసుకోగలుగుతుంది, సమాజంలో సంభవిస్తున్న మార్పులను సత్వరమే అర్థం చేసుకోగలుగుతుంది. జాతీయపార్టీలు పెద్ద క్షీరదాలు. స్తన్యజంతువుల వలే అవి చాలా తెలివైనవి. అయితే మార్పులకు సానుకూలంగా మారడమనేది వాటిలో చాలా నెమ్మదిగా సంభవిస్తుంది! 


కాలం తెచ్చిన మార్పులకు అనుగుణంగా మారేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. అయితే అనేక కారణాల వల్ల విఫలమయింది. తనను తాను పునరావిష్కరించుకోలేకపోయింది. ‘పునరావిష్కరణ’ మాత్రమే పురోగమనానికి ఏకైక బాట. ఒక వాస్తవాన్ని చెప్పితీరాలి. నిశితంగా, నిష్పాక్షికంగా గమనిస్తున్న వారికి భారత జాతీయ కాంగ్రెస్‌లో పునరావిష్కరణ ప్రక్రియ ఆనవాళ్ళు స్పష్టంగా కన్పిస్తాయి. 


శీఘ్రగతిన అతి పెద్దపార్టీగా పరిణమించినందుకు, నిరంకుశంగా వ్యవహరించే నాయకుడిని అంగీకరించినందుకు భారతీయ జనతాపార్టీ తగు మూల్యాన్ని చెల్లిస్తోంది. దేశంలో ఒకే ఒక్క పార్టీగా బీజేపీ వర్థిల్లాలని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు. చైనాలో కమ్యూనిస్టు పార్టీకి ఉన్న ప్రతిపత్తే భారత్‌లో బీజేపీకి ఉండాలని, తాను ఆ పార్టీకి ఒక జిన్ పింగ్ కావాలని ఆయన ఆశిస్తున్నారు, ఆరాటపడుతున్నారు. అయితే రాజ్యాంగం, రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఆయన ఆశయసాధనకు అవరోధంగా ఉన్నాయి. 


పార్లమెంటు, శాసనసభల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలనేది మోదీ మనోరథంగా ఉన్నది. అందుకు ‘ఒకే జాతి, ఒకే ఎన్నికలు’ అన్న నినాదాన్ని ఆయన ఇచ్చారు. ఇది చాలా మందిని ఆకట్టుకుంది. అయితే ఆయన మనోరథం నెరవేరాలంటే రాజ్యాంగం ప్రకారం రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ లభించేంతవరకు, అలాగే దేశవ్యాప్తంగా సగం రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు అధికారానికి వచ్చేంతవరకు ఆయన వేచిఉండక తప్పదు. అయితే అత్యధిక ఓటర్లు ఆయన నినాదంలోని అసలు లక్ష్యాన్ని అర్థం చేసుకున్నారు. మోదీకి సహకరించేందుకు వారు సిద్ధంగా లేరు. రాజ్యాంగ మౌలిక వ్యవస్థను కాపాడేందుకు సుప్రీంకోర్టు ఉండనే ఉంది. 


రాబోయే మూడు సంవత్సరాలు 2021 కంటే భిన్నంగా ఉండబోవు. 2022లో ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ శాసనసభలకు, 2023లో మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ తెలంగాణ శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక 2024లో లోక్‌సభ ఎన్నికలు. నరేంద్ర మోదీని ఒక ప్రధానమంత్రిగా కంటే ఒక ఎన్నికల ప్రచారసారథిగానే రాబోయే మూడు సంవత్సరాలలోనూ చూడబోతున్నాం సుమా! 


దేశ ఆర్థికవ్యవస్థ కరోనా మహమ్మారి మొదటి దఫా విజృంభణతోనే కుదేలైపోయింది. ఇప్పుడు రెండో విజృంభణతో అల్లల్లాడిపోతోంది. కథ ఇంతటితో ముగిసే సూచనలు కన్పించడం లేదు. మూడవ, నాల్గవ దఫా విజృంభణలు కూడా ఖాయమని నిపుణులు అంటున్నారు మందగతిలోకి పడిపోయిన ఆర్థిక వ్యవస్థ ప్రజల ప్రాణాలను హరిస్తోంది. వ్యాపార సంస్థలను మూసివేయాలని ఆదేశిస్తున్నారు. ఉద్యోగాలు మాయమై పోతున్నాయి. నిరుద్యోగం 8 శాతంగా ఉంది. వినియోగ ధరల ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది వ్యయాలను భరించేందుకు మరింతగా రుణాలు తీసుకోవడం మినహా గత్యంతరం లేదు. అయినా ఆర్థికవ్యవస్థను పూర్వస్థితికి సముద్ధరించే అవకాశాలు కానరావడం లేదు. 


మధ్యతరగతి ప్రజలు ఒక పెద్ద పాఠాన్ని నేర్చుకున్నారు. మోదీని వారు పూర్తిగా విశ్వసించారు. ఆయన చెప్పినట్లు కరోనాను పారదోలడానికి పళ్ళాలు మోగించారు, దీపాలు వెలిగించారు. ఇంటి నుంచే పని చేశారు. అయితే పేదలు, ముఖ్యంగా దినసరి కూలీలు, వలస కార్మికుల దయనీయ పరిస్థితులను చూడలేదు. చూసినా ఉదాసీనత చూపారు. జరిగిందేమిటి? ప్రభుత్వ అసమర్థత వల్ల ఇప్పుడు వారే ఆసుపత్రులకు చేరవలసివచ్చింది. దవాఖానాల నడవాలలో గంటలు, రోజుల తరబడి నిస్సహాయంగా ఉండిపోయి పడకలు, ఆక్సిజన్ సిలిండర్ల కోసం బతిమలాడుకోవల్సి వస్తోంది రోజురోజుకీ మరణాల సంఖ్య పెరిగిపోతోంది. కుటుంబసభ్యులో, బంధువులో, మిత్రులో లేక తమ ప్రతిభాపాటవాలకు మీ అభిమానాన్ని పొందిన కళాకారుడో, మేధావో చనిపోతున్నాడు. మృత్యువు మనకు ఇంత సన్నిహితంగా మరెప్పుడైనా ఉన్నదా? అవును, మృత్యువు మన ద్వారం వద్ద ఉంది. 


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనాశైలిని ప్రపంచ మీడియా తీవ్రంగా విమర్శిస్తోంది. భారతీయ మీడియాలోనూ ఒక కదలిక ప్రారంభమయింది. ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు ప్రతి ఎన్నికల అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ పంచాయత్ ఎన్నికలు ఇందుకొక ఉదాహరణ. 2022లోనూ, 2023లోనూ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో లభించే అవకాశాలను అదేరీతిలో ఉపయోగించుకోకపోవడం వల్ల సంభవించే పర్యవసానాలను గురించిన ఆలోచన నాలో వణుకు పుట్టిస్తోంది.




పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-05-08T05:53:43+05:30 IST